కంటెంట్‌కు వెళ్లు

ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 ఇష్టంగా ముందుకొచ్చి, సరైన ఉద్దేశంతో వేరేవాళ్లకు ఏమైనా ఇవ్వడాన్ని బైబిలు ప్రోత్సహిస్తుంది. అలా ఇస్తే తీసుకున్నవాళ్లకే కాదు ఇచ్చినవాళ్లకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. (సామెతలు 11:25; లూకా 6:38) యేసు ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.

 ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయి?

 స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు ప్రయోజనాలు ఉంటాయి. “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని బైబిలు చెప్తుంది.—2 కొరింథీయులు 9:7.

 హృదయపూర్వకంగా ఇవ్వడం, దేవునికి ఇష్టమైన ఆరాధనలో ఒక భాగం. (యాకోబు 1:27) అవసరంలో ఉన్నవాళ్లకు ఉదారంగా ఇచ్చేవాళ్లు దేవునితో చేయిచేయి కలిపి పనిచేస్తారు, ఆయన అలాంటి ఉదారతను తనకు అప్పు ఇచ్చినట్లుగా భావిస్తాడు. (సామెతలు 19:17) అలా ఇచ్చేవాళ్లకు దేవుడే తిరిగి చెల్లిస్తాడు అని బైబిలు చెప్తుంది.—లూకా 14:12-14.

 ఎలాంటప్పుడు ఇవ్వడం సరైంది కాదు?

 స్వార్థంతో ఇవ్వడం సరైంది కాదు. ఉదాహరణకు:

 దేవునికి ఇష్టంలేని పనులకు మద్దతుగా ఇవ్వకూడదు. ఉదాహరణకు జూదం ఆడేవాళ్లకు, మత్తు పదార్థాలు, లేదా తాగుడుకు బానిసలైన వాళ్లకు డబ్బులు ఇవ్వడం తప్పు. (1 కొరింథీయులు 6:9, 10; 2 కొరింథీయులు 7:1) అలానే, ఏదైనా పని చేసుకుని ఆర్థికంగా తనను తాను చూసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా పనిచేయకుండా ఉండేవాళ్లకు ఇవ్వడం సరైంది కాదు.—2 థెస్సలొనీకయులు 3:10.

 కుటుంబాన్ని చూసుకోకుండా ఇతరులకు ఇవ్వడం సరైంది కాదు. కుటుంబ పెద్దలు ఇంట్లో అవసరాలు చూసుకోవాలని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 5:8) కానీ సొంత కుటుంబాన్ని చూసుకోకుండా వేరేవాళ్లకే ఎక్కువగా ఇవ్వడం సరైంది కాదు. అలానే, ఆస్తులన్నీ “దేవునికి సమర్పించిన కానుక” అని చెప్పి వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి నిరాకరించినవాళ్లను యేసు తప్పుపట్టాడు.—మార్కు 7:9-13.