కంటెంట్‌కు వెళ్లు

నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా?

నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడా?

బైబిలు ఇచ్చే జవాబు

 తప్పకుండా చేస్తాడు. ఎవరైనా, దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉండే వాటికోసం నిజాయితీగా అడిగితే దేవుడు వాళ్లకు సహాయం చేస్తాడు. మీరు ఇంతవరకూ ఎప్పుడూ ప్రార్థన చేయకపోయినా బైబిల్లోని, ‘దేవా, నాకు సహాయం చేయి’ అని ప్రార్థించినవాళ్ల ఉదాహరణలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. ఉదాహరణకు:

  •   “యెహోవా నా దేవా, … నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.”—కీర్తన 109:26.

  •   “నేను శ్రమలపాలై దీనుడనైతిని … నాకు సహాయము నీవే.”—కీర్తన 40:17.

 ఆ మాటలు రాసిన వ్యక్తికి దేవుని మీద బలమైన విశ్వాసం ఉందనడంలో సందేహం లేదు. అయినా, “విరిగిన హృదయము,” “నలిగిన మనస్సు” కలిగిన వాళ్ల ప్రార్థనల్ని అంటే సరైన ఉద్దేశంతో తన దగ్గరకు వచ్చే వాళ్లందరి ప్రార్థనల్ని దేవుడు వింటాడు.—కీర్తన 34:18.

 దేవుడు మీ సమస్యల్ని పట్టించుకోలేనంత దూరంలో ఉన్నాడనే భయం మీరు పెట్టుకోనవసరం లేదు. బైబిలు ఇలా చెప్తోంది: “యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరమునుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును.” (కీర్తన 138:6) నిజానికి, ఒకసారి యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి” (మత్తయి 10:30) మీ గురించి మీకు తెలియని వివరాల్ని కూడా దేవుడు పరిశీలిస్తాడు. అలాంటిది, మీరు చింతిస్తూ దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తే ఆయన వినకుండా ఉంటాడా? తప్పకుండా వింటాడు.—1 పేతురు 5:7.