కంటెంట్‌కు వెళ్లు

మెర్సీ కిల్లింగ్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

మెర్సీ కిల్లింగ్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 మెర్సీ కిల్లింగ్‌ గురించి బైబిలు ప్రత్యేకంగా ఏమీ చెప్పట్లేదు. a అయితే జీవం, మరణం గురించి సరైన దృక్పథం కలిగి ఉండేందుకు అది సహాయం చేస్తుంది. చంపడం లేదా మనంతట మనమే చనిపోవడం మంచిది కాదు, కానీ మరణించే స్థితిలో ఉన్నప్పుడు ఏమి చేసైనా సరే జీవితాన్ని పొడిగించుకోవాల్సిన అవసరం లేదు.

 దేవుడు మన సృష్టికర్త, “జీవపు ఊట” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 36:9; అపొస్తలుల కార్యాలు 17:28) దేవుని దృష్టిలో ప్రాణం చాలా విలువైనది. అందుకే ఇతరుల ప్రాణాలు తీయడాన్ని లేదా మన ప్రాణాలు మనమే తీసుకోవడాన్ని ఆయన ఖండిస్తున్నాడు. (నిర్గమకాండము 20:13; 1 యోహాను 3:15) ఇంకా చెప్పాలంటే, మన ప్రాణానికి అలాగే ఇతరుల ప్రాణాలకి హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బైబిలు చెప్తుంది. (ద్వితీయోపదేశకాండము 22:8) అంటే మన ప్రాణాన్ని విలువైన బహుమతిగా చూడాలని దేవుడు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

ఒక వ్యక్తి తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటే?

 బైబిలు ఇతరుల ప్రాణాలు తీయడాన్ని, ఆఖరికి ఒక వ్యక్తి త్వరలోనే చనిపోతాడని ఖచ్ఛితంగా తెలిసినా అతని ప్రాణం తీయడాన్ని కూడా సమర్థించడం లేదు. ఇశ్రాయేలు రాజైన సౌలు ఉదాహరణ గమనిస్తే మనకు ఆ విషయం స్పష్టమౌతుంది. అతను యుద్ధంలో తీవ్రంగా గాయపడినప్పుడు, తనను చంపేయమని అక్కడున్న సేవకుణ్ణి అడిగాడు. (1 సమూయేలు 31:3, 4) కానీ ఆ సేవకుడు దానికి ఒప్పుకోలేదు. అయితే ఒక వ్యక్తి తానే సౌలు కోరిక మేరకు అతన్ని చంపానని అబద్ధం చెప్పాడు. అప్పుడు దావీదు ఈ విషయాన్ని దేవుని దృష్టితో ఆలోచించి అతన్ని రక్తాపరాధిగా పరిగణించాడు.—2 సమూయేలు 1:6-16.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన ప్రాణాల్ని కాపాడుకోవాలా?

 త్వరలోనే ఖచ్ఛితంగా చనిపోతామని తెలిసినప్పుడు, తీవ్రమైన బాధల్ని భరిస్తూ అలానే జీవితాన్ని కొనసాగించమని బైబిలు చెప్పడంలేదు. బదులుగా, జీవంపట్ల సరైన దృక్పథం కలిగి ఉండమని ప్రోత్సహిస్తుంది. పాపానికి వచ్చిన పర్యవసానమే మరణం, అదే మన ప్రధాన శత్రువు. (రోమీయులు 5:12; 1 కొరింథీయులు 15:26) మనం చనిపోవాలని కోరుకోకూడదు అలాగని దానికి భయపడకూడదు. ఎందుకంటే చనిపోయిన వాళ్లను మళ్లీ బ్రతికిస్తానని దేవుని మాటిస్తున్నాడు. (యోహాను 6:39, 40) ప్రాణానికి విలువిచ్చే వ్యక్తి, అందుబాటులో ఉన్న శ్రేష్ఠమైన వైద్య సహాయాన్ని తీసుకుంటాడు. అయితే, అతి త్వరలో చనిపోతామని తెలిసినా ఏదోక వైద్య విధానం ద్వారా బాధలు అనుభవిస్తూ అదే పరిస్థితిని కొనసాగించాల్సిన అవసరంలేదు.

ఆత్మహత్య క్షమించరాని పాపమా?

 ఆత్మహత్యను క్షమించరాని నేరంగా బైబిలు పరిగణించడంలేదు. ప్రాణాలు తీసుకోవడం ఘోరమైన తప్పే అయినా,  b మానసిక అనారోగ్యం, తీవ్రమైన ఒత్తిడి, ఆత్మహత్య కోరికల్ని ప్రేరేపించే జన్యుపరమైన సమస్యలు వంటి వాటిని దేవుడు పూర్తిగా అర్థం చేసుకోగలడు. (కీర్తన 103:13, 14) బాధల్లో ఉన్నవాళ్లకు ఆయన బైబిలు ద్వారా ఓదార్పునిస్తున్నాడు. అంతేకాదు “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని దేవుడు పునరుత్థానం చేస్తాడని” బైబిలు చెప్తుంది. (అపొస్తలుల కార్యాలు 24:15) అంటే ఆత్మహత్య లాంటి ఘోరమైన తప్పులు చేసిన వాళ్లకు కూడా పునరుత్థాన నిరీక్షణ ఉందని మనకు అర్థమౌతుంది.

a “బాగా జబ్బుపడిన వ్యక్తి లేదా తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆ బాధలు అనుభవించలేనప్పుడు అతన్ని చంపేయడాన్నే” మరణభిక్ష లేదా మెర్సీ కిల్లింగ్‌గా చెప్పవచ్చు. (మెర్రియమ్‌-వెబ్‌స్టర్‌ లెర్నర్స్‌ డిక్షనరీ) ఒక రోగి తన జీవితాన్ని అంతం చేసుకోవడానికి వైద్యుడు సహాయం చేస్తే దాన్ని డాక్టరు- సహాయంతో చేసుకునే ఆత్మహత్యగా పరిగణిస్తారు.

b ఆత్మహత్య చేసుకున్నట్లు బైబిల్లో ప్రస్తావించబడిన వ్యక్తులందరూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించినవాళ్లే.—2 సమూయేలు 17:23; 1 రాజులు 16:18; మత్తయి 27:3-5.