కంటెంట్‌కు వెళ్లు

శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 శవదహనానికి సంబంధించిన స్పష్టమైన నిర్దేశం ఏదీ బైబిల్లో లేదు. చనిపోయినవాళ్లను పాతిపెట్టాలనే లేక దహనం చేయాలనే ఆజ్ఞ కూడా బైబిల్లో లేదు.

 అయితే బైబిల్లో, దేవుని నమ్మకమైన సేవకులు తమ ప్రియమైనవారి మృతదేహాల్ని పాతిపెట్టిన వృత్తాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు, అబ్రాహాము తన భార్యయైన శారా మృతదేహాన్ని పాతిపెట్టే స్థలాన్ని సంపాదించడానికి ఎంతో కృషిచేశాడు.—ఆదికాండము 23:2-20; 49:29-32.

 బైబిల్లో, నమ్మకమైన సేవకులు మృతదేహాల్ని దహించిన వృత్తాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన సౌలు, ఆయన ముగ్గురు కుమారులు యుద్ధంలో చనిపోయారు. అయితే వాళ్ల మృతదేహాలు శత్రుదేశంలో ఉన్నాయని, శత్రువులు వాటిని అగౌరవపరుస్తున్నారని ఇశ్రాయేలు నమ్మకమైన యోధులకు తెలిసింది. దాంతో వాళ్లు సౌలు, ఆయన కుమారుల మృతదేహాల్ని తీసుకొచ్చి, వాటిని దహించి, అవశేషాల్ని పాతిపెట్టారు. (1 సమూయేలు 31:8-13) ఆ పద్ధతి ఆమోదయోగ్యమైనదేనని బైబిలు సూచిస్తోంది.—2 సమూయేలు 2:4-6.

శవదహనం గురించి ఉన్న అపోహలు

 అపోహ: శవదహనం చేస్తే మానవ శరీరాన్ని అగౌరవపర్చినట్లు అవుతుంది.

 నిజం: చనిపోయినవాళ్లు తిరిగి మట్టిలో కలిసిపోతారని బైబిలు చెప్తుంది. సాధారణంగా మృతదేహం కుళ్లిపోయిన తర్వాత అదే జరుగుతుంది. (ఆదికాండము 3:19) కాకపోతే శవదహనం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఎందుకంటే శరీరం బూడిద అవుతుంది కాబట్టి అది త్వరగా మట్టిలో కలిసిపోతుంది.

 అపోహ: బైబిలు కాలాల్లో, దేవుని అనుగ్రహం లేనివాళ్ల మృతదేహాల్ని మాత్రమే దహనం చేసేవాళ్లు.

 నిజం: ఆకాను, ఆయన కుటుంబసభ్యులు వంటి కొంతమంది నమ్మకంగాలేని ప్రజల మృతదేహాల్ని అగ్నితో కాల్చేశారు. (యెహోషువ 7:25) అయితే అది వాళ్ల విషయంలో అలా జరిగిందే తప్ప, దేవుని అనుగ్రహం లేనివాళ్ల మృతదేహాల్ని మాత్రమే దహనం చేయాలనే నియమమేమీ లేదు. (ద్వితీయోపదేశకాండము 21:22, 23) మనం పై పేరాల్లో పరిశీలించినట్లుగా, సౌలు రాజు కొడుకైన యోనాతాను లాంటి కొంతమంది నమ్మకమైనవాళ్ల మృతదేహాల్ని కూడా దహనం చేశారు.

 అపోహ: దహనం చేస్తే దేవుడు వాళ్లను పునరుత్థానం చేయలేడు.

 నిజం: చనిపోయినవాళ్లను పునరుత్థానం చేసే విషయానికొస్తే, చనిపోయిన ఒక వ్యక్తిని పాతిపెట్టినా, దహనం చేసినా, లేదా అతను సముద్రంలో కొట్టుకుపోయినా, అతన్ని క్రూరమృగాలు తినేసినా దేవుడు పునరుత్థానం చేయగలడు. (ప్రకటన 20:13) సర్వశక్తిగల దేవుడు ఒక వ్యక్తి శరీరాన్ని మళ్లీ తేలిగ్గా సృష్టించగలడు.—1 కొరింథీయులు 15:35, 38.