కంటెంట్‌కు వెళ్లు

బైబిలు వచనాల వివరణ

రోమీయులు 12:2​—“మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి”

రోమీయులు 12:2​—“మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి”

 “ఇకమీదట ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.”—రోమీయులు 12:2, కొత్త లోక అనువాదం.

 “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమీయులు 12:2, పరిశుద్ధ గ్రంథము.

రోమీయులు 12:2 అర్థమేంటి?

 దేవున్ని సంతోషపెట్టాలని కోరుకునేవాళ్లు చెడు ప్రభావాలకు దూరంగా ఉంటే మాత్రమే సరిపోదు, వాళ్లు తమ వ్యక్తిత్వాన్ని కూడా మార్చుకోవాలి. దేవుడు వాళ్లను మారమని బలవంతపెట్టడు; అయితే వాళ్లే దేవుని మీద ప్రేమతో, అలాగే ఆయన కోరేవి మంచివి, సహేతుకమైనవి, ప్రయోజనకరమైనవి అని గ్రహించి మార్పులు చేసుకుంటారు.—యెషయా 48:17.

 “ఇకమీదట ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి.” “వ్యవస్థ”అనే మాట మానవ సమాజాన్ని సూచిస్తుంది, అందులో దాని ప్రమాణాలు, అలవాట్లు, పద్ధతులు ఉంటాయి; అది దేవుని విలువలకు, ఆయన ఆలోచనా విధానానికి తగినట్టు ఉండదు. (1 యోహాను 2:15-17) అది ప్రజల మీద నిరంతరం ఒత్తిడి పెడుతుంది, అలా వాళ్ల ప్రవర్తనను అలాగే వ్యక్తిత్వాన్ని మలుస్తుంది. ఒక వ్యక్తి దేవుడు ఆమోదించేలా ఆయన్ని ఆరాధించాలంటే, లోక ప్రభావాన్ని ఎదిరించాలి. లేకపోతే అతను తనకు తాను హాని చేసుకునే అలాగే దేవునికి ఇష్టంలేని లక్షణాలను వృద్ధి చేసుకోవచ్చు.—ఎఫెసీయులు 2:1-3; 4:17-19.

 “మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి.” ఒక వ్యక్తి తన లోలోపలి వైఖరులను, భావాలను కూడా మార్చుకోవాలి. ఇక్కడ “మార్పులు చేసుకుంటూ“ అనే మాటకు ఉపయోగించిన గ్రీకు పదం, ఆ మార్పులు ఎంత ఎక్కువగా చేసుకోవాలో సూచిస్తుంది. ఆ పదం, గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడం లాంటి మార్పును వర్ణిస్తుంది. దేవున్ని ఆరాధించేవాళ్లు “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించుకోవాలి.—ఎఫెసీయులు 4:23, 24; కొలొస్సయులు 3:9, 10.

 “మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి” తెలుసుకోండి. తనను ఆరాధించేవాళ్లు వేటినైతే నమ్ముతున్నారో వాటి విషయంలో పూర్తి నమ్మకంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్లు దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలించడం ద్వారా, దాన్ని పాటించడం ద్వారా, దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడం వల్ల ప్రయోజనాలను అనుభవించడం ద్వారా అలా చేస్తారు. అలా వాళ్లు, దేవుని మార్గాలు అత్యుత్తమమైనవి అని పరీక్షించి తెలుసుకుంటారు.—కీర్తన 34:8.

రోమీయులు 12:2 సందర్భం

 రోమీయులు 12వ అధ్యాయం, దేవుడు ఆమోదించేలా ఆరాధించాలంటే ఏమేం చేయాలో వివరిస్తుంది. అది మన జీవితంలోని ప్రతీ విషయంపై ప్రభావం చూపిస్తుంది, అలా చేయాలంటే కేవలం గుడ్డి నమ్మకంతో లేదా భావావేశంతో నడుచుకోకుండా “ఆలోచనా సామర్థ్యాల్ని” ఉపయోగించాలి. (రోమీయులు 12:1, 3) ఈ అధ్యాయంలో దేవుడు చూపించేలాంటి లక్షణాల్ని ఎలా చూపించాలో, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో, ఇతరులు మనతో తప్పుగా ప్రవర్తిస్తే ఎలా స్పందించాలో ఉపయోగపడే సలహాలు ఉన్నాయి.—రోమీయులు 12:9-21.