కంటెంట్‌కు వెళ్లు

ప్రేమ వాళ్లను కలిపింది—జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఓ సమావేశం

ప్రేమ వాళ్లను కలిపింది—జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఓ సమావేశం

“ఒక విధంగా కుటుంబమంతా కలిసి చేసుకున్న పండుగలా ఉంది” అనే హెడ్‌ లైన్‌తో కఫ్‌ర్రంట్షావు అనే వార్తా పత్రికలో ఒక శీర్షిక వచ్చింది. కళ్లారా చూసినవాళ్లు ఆ మాటకు ఒప్పుకున్నారు.

“నాకు మా కుటుంబసభ్యులతో ఉన్నట్లు అనిపించింది” అని ప్యూర్టోరికో నుండి వచ్చిన కార్లా అనింది.

“వేరే దేశంలో ఉన్న మా కుటుంబసభ్యులను కలిసినట్లు అనిపించింది” అని ఆస్ట్రేలియా నుండి వచ్చిన సేరా చెప్పింది.

ఇంతకీ వీళ్లంతా దేని గురించి మాట్లాడుతున్నారు? యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశం గురించి. అది జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ మెయిన్‌లో ఉన్న కామర్జ్‌ బ్యాంకు-అరీనాలో 2014, జూలై 18 నుండి 20 వరకు జరిగింది. దాదాపు 37,000 మంది దానికి హాజరయ్యారు.

అక్కడున్నవాళ్లంతా బైబిలు గురించి నేర్చుకోవడానికి వచ్చారు. ఆ సమావేశ కార్యక్రమంలో బైబిలును చదవడం, పాటలు, ప్రార్థనలు, రెండు డ్రామాలు, ఇంకా బైబిలు అంశాలపై ఉత్సాహవంతమైన ప్రసంగాలు జరిగాయి.

ఆ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న సాక్షులతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, గ్రీస్‌, బ్రిటన్‌, లెబానన్‌, సెర్బియా, సౌత్‌ఆఫ్రికా దేశాల నుండి 3,000లకు పైగా సాక్షులు హాజరయ్యారు. 70 దేశాల నుండి మిషనరీ సేవలాంటి పూర్తికాల సేవ చేస్తున్న దాదాపు 234 పూర్తికాల సేవకులు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు.

ఆ కార్యక్రమంలో కొన్ని భాగాలను జర్మనీలోని కొన్ని ప్రాంతాలతోపాటు ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లోని ప్రాంతాలకు కూడా లైవ్‌వెబ్‌కాస్ట్‌ ద్వారా ప్రసారం చేశారు. మొత్తం 2,04,046 మంది ఆ కార్యక్రమాన్ని చూశారు.

అడ్డుగోడల్ని దాటడం

ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన ఆ కార్యక్రమాన్ని ఇంగ్లీష్‌, గ్రీకు, జర్మన్‌ భాషల్లోకి అనువదించారు. మిగిలిన చోట్ల ఆ కార్యక్రమాన్ని అక్కడికక్కడే అరబిక్‌, చైనీస్‌, తమిళ్‌, టర్కిష్‌, రెండు సంజ్ఞా భాషలతోపాటు 17 ఇతర భాషల్లోకి అనువదించారు.

సాక్షులు వేర్వేరు భాషలు మాట్లాడేవాళ్లైనా, వేర్వేరు దేశాలకు, సంస్కృతులకు చెందినవాళ్లైనాసరే ప్రేమ వాళ్లను విడదీయలేదు కాని ఒక్కటి చేసింది. (యోహాను 13:34, 35) వాళ్లు ఒకర్నొకరు తోబుట్టువుల్లా చూసుకుంటూ ప్రేమగా ఉన్నారు.

“మన అంతర్జాతీయ సహోదరత్వం దేశం, జాతి వంటి అడ్డుగోడల్ని ఎలా రూపుమాపుతుందో కళ్లారా చూశాం” అని బ్రిటన్‌ నుండి వచ్చిన టొబాయస్‌ అన్నాడు.

“20 కన్నా ఎక్కువ దేశాలనుండి వచ్చిన సాక్షులను నేను కలిశాను. దేవుని మీద, ఇతరుల మీద మనకున్న ప్రేమ మనల్ని ఐక్యంగా ఉంచుతోంది” అని ప్యూర్టోరికో నుండి వచ్చిన డావ్యానా చెప్పింది.

“నేను ఓ చిన్న పల్లెటూరిలో సత్యం తెలుసుకుని యెహోవాసాక్షి అయ్యాను. మన ప్రపంచవ్యాప్త సహోదరత్వం గురించి నేను చదివాను, కొన్ని వీడియోలను కూడా చూశాను. కానీ అది ఎలా ఉంటుందో ఈ సమావేశంలో స్వయంగా రుచి చూశాను. అసలు అంతర్జాతీయ సహోదరత్వం అంటే ఏమిటో ఇప్పుడే నాకు బాగా అర్థమైంది. ఇక్కడికి రావడం వల్ల నా విశ్వాసం చాలా బలపడింది” అని ఆస్ట్రేలియాకు చెందిన మాల్కమ్‌ చెప్పాడు.

మర్చిపోలేని ఆతిథ్యం

ఫ్రాంక్‌ఫర్ట్‌, ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉన్న 58 సంఘాల్లోని సాక్షులు, అంతర్జాతీయ సమావేశానికి వేరే దేశాల నుండి వచ్చిన సహోదరసహోదరీల కోసం కొన్ని గిఫ్టులను తయారుచేశారు. సాయంత్రం పూట అందరూ కలిసి సరదాగా గడిపేందుకు కొన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

“మేము అద్భుతమైన ఆతిథ్యాన్ని ఆనందించాం. సహోదరసహోదరీలు చూపించిన ప్రేమ, దయ, ఉదారతను నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని అమెరికా నుండి వచ్చిన సింథియా చెప్పింది.

“అక్కడ ప్రేమలు, నవ్వులు, సహోదర ఆప్యాయత పొంగిపొర్లాయి. ఒకరి నుండి ఒకరం చాలా నేర్చుకోవచ్చు” అని జర్మనీలో ఉంటున్న సైమన్‌ చెప్పాడు.

“యెహోవాసాక్షులుగా మనం అందరి నుండి దూరంగా ఉండే ప్రజలం కాదు. సరదాగా ఉండడమంటే ఏమిటో, అలా ఎలా ఉండాలో మనకు తెలుసు అని అర్థం చేసుకోవడానికి సాయంత్రం పూట సహోదరసహోదరీలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు నాకు సహాయం చేశాయి” అని ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఏమీ అనింది.

తీపి జ్ఞాపకాలతో ఇంటికి తిరిగెళ్లడం

ప్రపంచవ్యాప్తంగా జరిగిన తొమ్మిది అంతర్జాతీయ సమావేశాల్లో ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన సమావేశం ఒకటి.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరైనందుకు ఎలా అనిపిస్తుంది అని అక్కడికి వచ్చిన ఒక సహోదరున్ని అడిగినప్పుడు ఆయనిలా జవాబిచ్చాడు, ‘మీకు ఓ తమ్ముడు ఉన్నాడనే విషయమే మీకు తెలీదనుకోండి. కానీ ఆయన మీకు కనిపించి నేను మీ తమ్ముడిని అని చెప్పి మీ మీద చాలా ప్రేమాప్యాయతలు చూపిస్తే మీకెలా అనిపిస్తుంది. మాట్లలో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది కదా. ఇప్పుడు ఆ ఆనందాన్ని 37,000 రెట్లు చేస్తే ఎంత అవుతుంది. ఇక్కడికి రావడం వల్ల నాకంత ఆనందం కలిగింది.’