కంటెంట్‌కు వెళ్లు

అంత్యక్రియల గురించి యెహోవాసాక్షుల అభిప్రాయమేమిటి?

అంత్యక్రియల గురించి యెహోవాసాక్షుల అభిప్రాయమేమిటి?

అంత్యక్రియల పై మా అభిప్రాయాలు, వాటిని మేం చేసే విధానం బైబిలు బోధలపై ఆధారపడి ఉంటుంది. అవేంటంటే:

  • ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు ఏడ్వడం సహజమే. తమకు ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు యేసు శిష్యులు ఏడ్చారు. (యోహాను 11:33-​35, 38; అపొస్తలుల కార్యములు 8:2; 9:​39) కాబట్టి అంత్యక్రియల్ని సంబరాలు చేసుకునే సమయంగా మేం భావించం. (ప్రసంగి 3:​1, 4; 7:​1-4) బదులుగా సానుభూతి చూపించే అవకాశంగా చూస్తాం.—రోమీయులు 12:15.

  • చనిపోయినవాళ్లకు వాళ్ల చుట్టూ జరిగేవి తెలియవు. చనిపోయినవాళ్లు చుట్టూ జరుగుతున్న వాటిని చూడగలరని, బ్రతికివున్న వాళ్లకు మంచి లేదా చెడు చేయగలరని బైబిలు చెప్పట్లేదు. కాబట్టి మేం ఏ జాతికి చెందినవాళ్లమైనా, ఏ నేపథ్యం నుండి వచ్చినా బైబిలుకు విరుద్ధంగా ఉండే ఆచారాలకు, పద్ధతులకు దూరంగా ఉంటాం. (ప్రసంగి 9:​5, 6, 10) ఉదాహరణకు రాత్రంతా మేల్కొని ఏడుస్తూ పాటలు పాడడం, ఘనంగా అంత్యక్రియలు జరపడం, చనిపోయిన రోజును ఆచరించడం, చనిపోయినవాళ్ల కోసం బలులు అర్పించడం, చనిపోయినవాళ్లతో మాట్లాడడం, కోరికల్ని తీర్చమని వాళ్లను వేడుకోవడం, వితంతువు ఆచారాలు చేయడం వంటి వాటిని మేం చేయం, పాల్గొనం. “వేరుగా ఉండండి,” “అపవిత్రమైనదాన్ని ముట్టకండి” అని బైబిలు ఆజ్ఞాపిస్తోంది కాబట్టి మేం ఇలాంటి ఆచారాలకు, పద్ధతులకు దూరంగా ఉంటాం.—2 కొరింథీయులు 6:​17.

  • చనిపోతే అంతా అయిపోయినట్లు కాదు. చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారని, చావు అనేదే లేని కాలం వస్తుందని బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యములు 24:15; ప్రకటన 21:4) తొలి క్రైస్తవుల్లాగే మాకూ ఆ నమ్మకం ఉంది కాబట్టే అంత్యక్రియల సమయంలో విపరీతంగా ఏడ్వడం వంటివి చేయం.—1 థెస్సలొనీకయులు 4:​13.

  • అణకువగా ఉండమని బైబిలు చెప్తోంది. (సామెతలు 11:2) సమాజంలో లేదా ఆర్థికంగా మా ‘గొప్పను చూపించుకోవడానికి’ అంత్యక్రియల్ని ఓ అవకాశంగా భావించం. (1 యోహాను 2:​16) కాబట్టి వినోదం కోసమే ఏర్పాటు చేసినట్లుగా అంత్యక్రియల్ని ఆర్భాటంగా చేయం. లేదా ఇతరుల దృష్టిని ఆకట్టుకునేలా ఉండే బట్టల్ని లేదా చాలా ఖరీదైన శవపేటికల్ని ఉపయోగించం.

  • అంత్యక్రియల విషయంలో మన అభిప్రాయాలను వేరేవాళ్లపై రుద్దడానికి ప్రయత్నించం. ఈ విషయంలో మేం ఈ సూత్రాన్ని పాటిస్తాం: “మనలో ప్రతీ ఒక్కరం దేవునికి జవాబుదారులం.” (రోమీయులు 14:12) అయితే అవకాశం ఇచ్చినప్పుడు మేం మా నమ్మకాలను “సౌమ్యంగా, ప్రగాఢ గౌరవంతో” వివరిస్తాం.—1 పేతురు 3:​15.

యెహోవాసాక్షులు అంత్యక్రియల్ని ఎలా చేస్తారు?

ప్రదేశం: అంత్యక్రియలు జరపాలని ఏదైనా కుటుంబం నిర్ణయించుకుంటే, ఆ కుటుంబం ఇష్టపడిన చోటే దాన్ని నిర్వహిస్తాం. అది రాజ్యమందిరం కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, శ్మశానంలో కావచ్చు.

చేసే పద్ధతి: చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు ఓదార్పును ఇవ్వడానికి మరణం గురించి, పునరుత్థానం గురించి బైబిలు ఏం చెప్తుందో వివరిస్తూ ఒక ప్రసంగం ఇవ్వబడుతుంది. (యోహాను 11:25; రోమీయులు 5:​12; 2 పేతురు 3:​13) ఆ సమయంలో చనిపోయిన వ్యక్తిలోని మంచి లక్షణాల గురించి, ఆ నమ్మకమైన వ్యక్తి నుండి మనం నేర్చుకోగల వాటిగురించి కొన్ని విషయాలు కూడా ప్రస్తావిస్తారు.—2 సమూయేలు 1:​17-​27.

లేఖనాల పై ఆధారపడిన ఓ పాటను కూడా పాడతారు. (కొలొస్సయులు 3:​16) ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల్ని ఓదారుస్తూ చేసే ప్రార్థనతో అంత్యక్రియలు ముగుస్తాయి.—ఫిలిప్పీయులు 4:​6, 7.

ఫీజు లేదా చందాలు: అంత్యక్రియలు నిర్వహించినందుకు గానీ లేదా మతపరంగా మేం చేసే ఏ కార్యక్రమానికి గానీ మా సభ్యుల దగ్గర ఫీజు తీసుకోం. మా కూటాలకు వచ్చే వాళ్ల దగ్గర నుండి కూడా చందాలు వసూలు చేయం.—మత్తయి 10:8.

ఎవరు రావచ్చు: రాజ్యమందిరంలో నిర్వహించే అంత్యక్రియలకు యెహోవాసాక్షులుకాని వాళ్లు కూడా రావచ్చు. మా ఇతర కూటాల్లాగే అంత్యక్రియల కార్యక్రమానికి కూడా ఎవరైనా రావచ్చు.

వేరే మతాలవాళ్లు నిర్వహించే అంత్యక్రియలకు యెహోవాసాక్షులు వెళ్తారా?

ఈ విషయాన్ని ప్రతీ యెహోవాసాక్షి, తమ బైబిలు ఆధారిత మనస్సాక్షిని బట్టి ఎవరికి వాళ్లు నిర్ణయించుకుంటారు. (1 తిమోతి 1:​19) అయితే బైబిలు చెప్పే వాటికి విరుద్ధంగా ఉన్నాయనిపించే మతపరమైన ఆచారాల్లో మాత్రం మేం పాలుపంచుకోం.​—2 కొరింథీయులు 6:​14-​17.