కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు కొన్ని పండుగలు ఎందుకు చేసుకోరు?

యెహోవాసాక్షులు కొన్ని పండుగలు ఎందుకు చేసుకోరు?

 ఏదైనా పండుగ చేయాలో వద్దో యెహోవాసాక్షులు ఎలా నిర్ణయించుకుంటారు?

 ఒక పండుగను చేయాలో వద్దో నిర్ణయించుకునే ముందు యెహోవాసాక్షులు బైబిల్ని చూస్తారు. కొన్ని పండుగలు, వేడుకలు బైబిల్లో ఉన్న సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉంటాయి. అలాంటప్పుడు యెహోవాసాక్షులు వాటిలో పాల్గొనరు. ఇతర సెలవు దినాల విషయంలో ప్రతి సాక్షి తన సొంత నిర్ణయం తీసుకుంటూ “దేవుని ముందు, మనుషుల ముందు మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి” కృషి చేస్తారు.—అపొస్తలుల కార్యాలు 24:16.

 ఫలానా పండుగ లేదా సెలవుదినం చేయాలో వద్దో నిర్ణయించుకునే ముందు యెహోవాసాక్షులు ఆలోచించే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. a

  •   ఆ పండుగ బైబిల్లో లేని బోధల నుండి వచ్చిందా?

     బైబిలు సూత్రం: “‘వాళ్ల మధ్య నుండి బయటికి వచ్చేసి, వేరుగా ఉండండి,’ ‘అపవిత్రమైనదాన్ని ముట్టకండి,’ అని యెహోవా చెప్తున్నాడు.”—2 కొరింథీయులు 6:15-17.

     ఆధ్యాత్మికంగా అపవిత్రమైన వాటన్నిటి నుండి, అంటే బైబిలు చెప్తున్నవాటికి విరుద్ధమైన వాటన్నిటి నుండి తమను వేరుగా ఉంచుకోవడానికి యెహోవాసాక్షులు ఈ కింద ఇచ్చిన అంశాలున్న పండుగలను చేసుకోరు.

     వేరే దేవుళ్లను నమ్మడానికి లేదా ఆరాధించడానికి చేసే పండుగలు. యేసు ఇలా చెప్పాడు: “‘నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించాలి, ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది.” (మత్తయి 4:10) ఆ మాటలను పాటిస్తూ యెహోవాసాక్షులు క్రిస్మస్‌, ఈస్టర్‌, లేదా మే డే వేడుకలు చేసుకోరు, ఎందుకంటే ఈ పండుగలు యెహోవాను కాకుండా వేరే దేవుళ్లను ఆరాధించడంతో మొదలయ్యాయి. ఇవి కాకుండా కింద ఇచ్చిన పండుగలను కూడా యెహోవాసాక్షులు చేసుకోరు.

    •  క్వాన్జా. క్వాన్జా అనే పేరు “స్వాహిలి పదాలైన మటుండా య క్వాన్జా నుండి వచ్చింది. ఆ మాటలకు ‘తొలి పంట’ లేదా ‘ప్రథమ ఫలాలు’ అని అర్థం. ఈ పండుగ ఆఫ్రికా చరిత్రలో తొలి కోతకు సంబంధించిన వేడుకల్లో నుండి వచ్చినట్లు తెలుస్తుంది.” (ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బ్లాక్‌ స్టడీస్‌) కొంతమంది క్వాన్జాను మతసంబంధమైన వేడుకగా చూడకపోయినప్పటికీ, ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఆఫ్రికన్‌ రెలిజియన్‌ మాత్రం ఈ పండుగను ఆఫ్రికాకు చెందిన ఒక పండుగతో పోలుస్తుంది. ఆఫ్రికాకు చెందిన ఈ పండుగలో మొదటి పంటను “దేవుళ్లకు, పూర్వీకులకు కృతజ్ఞతగా సమర్పిస్తారు. జీవాన్ని ప్రసాదించినందుకు పూర్వీకులకు కృతజ్ఞత తెలుపుతారు. అమెరికాకు చెందిన ఆఫ్రికా ప్రజల పండుగైన క్వాన్జాలో కూడా ఇదే స్ఫూర్తి కనిపిస్తుంది.”

      క్వాన్జా

    •  న్యూ ఇయర్‌. ఈ పండుగ ఆరంభం గురించి ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది: “రోమా పరిపాలకుడైన జూలియస్‌ సీజర్‌ క్రీస్తు పూర్వం 46లో, జనవరి 1ని కొత్త సంవత్సర దినోత్సవంగా స్థాపించాడు. రోమన్లు ఈ రోజును జానస్‌ దేవతకు అంకితం చేశారు.”

    •  నౌరూజ్‌. “ఈ పండుగ తొలి ఆరంభం జొరాస్ట్రియన్ల మతంలో ఉంది, ఇది ప్రాచీన జొరాస్ట్రియన్‌ క్యాలెండరులో ఒక పవిత్రమైన రోజుగా ఉండేది. . . . ముఖ్యంగా చలి లేదా శిశిర ఆత్మ, మధ్యాహ్నానికి ఆత్మగా పిలువబడే రఫీత్విన్‌ను చలికాలంలో భూగర్భంలోకి తరిమేస్తుంది. జొరాస్ట్రియన్‌ ఆచారం ప్రకారం ఆ ఆత్మ తిరిగి నౌరూజ్‌ రోజున మధ్యాహ్నం చేసే వేడుకల ద్వారా ఆహ్వానించబడుతుంది.”—యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైన్‌టిఫిక్‌ ఎండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో).

    •  షబ్‌-ఎ యాల్ద. ఇది పగలు తక్కువగా ఉండే రోజున చేసే పండుగ. సూఫిసమ్‌ ఇన్‌ ద సీక్రెట్‌ హిస్టరీ ఆఫ్‌ పర్షియా అనే పుస్తకం ప్రకారం ఇది “ఖచ్చితంగా మిత్ర (వెలుగు దేవత) ఆరాధనకు సంబంధించింది.” ఈ పండుగ రోమీయుల, గ్రీకుల సూర్య దేవతల ఆరాధనకు కూడా సంబంధించి ఉండవచ్చని అంటారు. b

    •  థ్యాంక్స్‌గివింగ్‌. క్వాన్జా పండుగలానే, ఈ పండుగ కూడా ఎన్నో దేవుళ్ల గౌరవార్థంగా చేసే ప్రాచీన కోత పండుగల నుండి వచ్చింది. కాలాక్రమేణ, “ఈ ప్రాచీన జానపద ఆచారాలను క్రైస్తవ చర్చీలు కూడా పాటించడం మొదలుపెట్టాయి.”—ఎ గ్రేట్‌ ఎండ్‌ గాడ్లీ ఎడ్వెంచర్‌—ద పిల్‌గ్రిమ్స్‌ ఎండ్‌ ద మిత ఆఫ్‌ ద ఫస్ట్‌ థ్యాంక్స్‌గివింగ్‌.

     మూఢనమ్మకాలు లేదా అదృష్టం మీద నమ్మకం ఆధారంగా చేసే పండుగలు. “అదృష్టదేవికి పానీయార్పణము” అర్పించేవాళ్లు యెహోవాను విసర్జించినవాళ్లని బైబిలు చెప్తుంది. (యెషయా 65:11) కాబట్టి యెహోవాసాక్షులు ఈ పండుగలు చేసుకోరు:

    •  ఈవాన్‌ కూపలా. “ఈవాన్‌ కూపలా సమయంలో ప్రకృతి తనకున్న మంత్ర శక్తులను వదులుతుందని, వాటిని ధైర్యంతో, అదృష్టంతో సొంతం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతారు” అని ద ఏ టు జెడ్‌ ఆఫ్‌ బెలారస్‌ అనే పుస్తకం చెప్తుంది. నిజానికి ఇది ఎండాకాలంలో పగలు ఎక్కువగా ఉండే రోజున చేసే అన్యమత పండుగ. కానీ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ కాంటెంపరరీ రష్యన్‌ కల్చర్‌ చెప్తున్నట్లు, “అన్యులు క్రైస్తవులుగా మారాక ఈ అన్య పండుగ చర్చి పండుగల్లో కలిసిపోయి బాప్తిస్మమిచ్చే యోహాను గౌరవార్థంగా చేసే పండుగ అయిపోయింది.”

    •  నూతన చాంద్రమాన సంవత్సరం (చైనా లేదా కొరియా కొత్త సంవత్సరం). “మిగతా సమయంలోకన్నా ఈ సమయంలో ఎక్కువగా కుటుంబాలు, స్నేహితులు, బంధువులు అందరూ అదృష్టం కలిసిరావాలని కోరుకుంటారు, దేవతలకు, ఆత్మలకు గౌరవ వందనాలు తెలుపుతారు, ఆ కొత్త సంవత్సరం అంతా బాగా కలిసిరావాలని కోరుకుంటారు.” (మూన్‌కేక్స్‌ ఎండ్‌ హంగ్రీ ఘోస్ట్‌—ఫెస్టివల్స్‌ ఆఫ్‌ చైనా) అలానే, కొరియా దేశంలో కొత్త సంవత్సరం రోజున “పూర్వీకులను ఆరాధిస్తారు, ఆత్మలను లేదా దయ్యాలను తరిమేయడానికి పూజలు చేస్తారు, కొత్త సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటారు, కొత్త సంవత్సరానికి జాతకం [పంచాంగం] చదువుతారు.”—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ న్యూ ఇయర్స్‌ హాలిడేస్‌ వరల్డ్‌వైడ్‌.

      చైనా కొత్త సంవత్సరం

     ఆత్మ చావదనే నమ్మకం ఆధారంగా చేసే పండుగలు. ఆత్మకు చావు ఉంటుందని బైబిలు వివరిస్తుంది. (యెహెజ్కేలు 18:4) కాబట్టి, ఆత్మకు చావు లేదు అనే నమ్మకం ఆధారంగా చేసే ఈ కింది పండుగలను యెహోవాసాక్షులు చేసుకోరు:

    •  ఆల్‌ సోల్స్‌ డే (సమాధుల పండుగ). న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం “చనిపోయిన వాళ్లందరినీ గుర్తు చేసుకోవడానికి,” ఈ రోజును చేస్తారు. “ఈ రోజున ఆత్మలు పర్గేటరీ (పాప విమోచనా లోకం) నుండి బయటకు వచ్చి, బ్రతికి ఉన్నప్పుడు బాధపెట్టినవాళ్లకు, భూతాలుగా, పిశాచాలుగా, కప్పల్లా కనపడతాయని మధ్య శతాబ్దాల్లో చాలా ఎక్కువగా నమ్మేవారు.”

    •  క్వింగ్‌మింగ్‌ పండుగ, హంగ్రీ ఘోస్ట్‌ పండుగ. ఈ రెండు పండుగలను పూర్వీకుల గౌరవార్థంగా చేస్తారు. సెలెబ్రేటింగ్‌ లైఫ్‌ కస్టమ్స్‌ అరౌండ్‌ ద వరల్డ్‌—ఫ్రమ్‌ బేబి షవర్స్‌ టు ఫ్యూనరల్స్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది, క్వింగ్‌మింగ్‌ అప్పుడు “చనిపోయినవాళ్లు ఆకలితో, దాహంతో, డబ్బు లేక బాధపడకుండా ఆహారం, పానీయం, డబ్బు నోట్లను కాలుస్తారు.” ఆ పుస్తకం ఇంకా ఇలా చెప్తుంది, “హంగ్రీ ఘోస్ట్‌ నెలలో (ఆకలితో ఉన్న భూతాల పండుగ నెలలో) ముఖ్యంగా పౌర్ణమి రోజున, ఏ రాత్రికన్నా ఆ రాత్రే చనిపోయినవాళ్లకు బ్రతికున్నవాళ్లకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి [అని పండుగ చేసేవాళ్లు నమ్ముతారు], కాబట్టి చనిపోయినవాళ్లను శాంతింపచేయడానికి, అలాగే పూర్వీకులను గౌరవించడానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.”

    •  చూసోక్‌. ద కొరియన్‌ ట్రెడిషన్‌ ఆఫ్‌ రెలిజియన్‌, సొసైటీ, ఎండ్‌ ఎతిక్స్‌ చెప్తున్నట్లు, ఈ పండుగలో “చనిపోయినవాళ్ల ఆత్మలకు ఆహారం, ద్రాక్షారసం అర్పిస్తారు.” ఈ అర్పణలు “శరీరం మరణించాక ఆత్మ బ్రతికే ఉంటుందనే నమ్మకాన్ని” చూపిస్తాయి.

     క్షుద్ర పూజలతో సంబంధమున్న పండుగలు. “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు” అని బైబిలు చెప్తుంది. (ద్వితీయోపదేశకాండము 18:10-12) క్షుద్ర విద్యలనుండి, అంటే జ్యోతిష్యం నుండి (సోదె చెప్పడం లాంటిది) దూరంగా ఉండడానికి యెహోవాసాక్షులు హాలోవీన్‌ పండుగను లేదా ఈ కింది పండుగలను చేయరు:

    •  సింహల, తమిళ కొత్త సంవత్సరం. “ఈ పండుగకు సంబంధించిన సాంప్రదాయాల్లో . . . జ్యోతిష్యం ఆధారంగా నిర్ణయించిన శుభ ఘడియల్లో కొన్ని పనులు చేస్తారు.”​—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ శ్రీలంక.

    •  సోంగ్‌క్రన్‌. ఆసియాలో చేసే ఈ పండుగను “సంస్కృత భాష పదం నుండి తీసుకున్నారు. ... దానికి ‘కదలిక’ లేదా ‘మార్పు’ అని అర్థం. మేషం అనే నక్షత్ర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడానికి గుర్తుగా ఈ పండుగ చేస్తారు.”​—ఫుడ్‌, ఫీస్ట్స్‌, ఎండ్‌ ఫెయిత్‌​—యాన్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఫుడ్‌ కల్చర్‌ ఇన్‌ వరల్డ్‌ రెలిజియన్స్‌.

     యేసు బలితో సమాప్తమైన మోషే ధర్మశాస్త్రం ఆధారంగా చేసే పండుగలు. బైబిలు ఇలా చెప్తుంది: “క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం ముగింపుకొచ్చింది.” (రోమీయులు 10:4) ప్రాచీన ఇశ్రాయేలుకు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఉన్న సూత్రాల నుండి క్రైస్తవులు ఇప్పటికీ ప్రయోజనం పొందుతారు. కానీ, వాటిలో ఉన్న పండుగలను మాత్రం చేయరు, ముఖ్యంగా రాబోయే మెస్సీయకు సంబంధించిన పండుగలు చేయరు, ఎందుకంటే ఆయన వచ్చేశాడని క్రైస్తవులు నమ్ముతారు. “అవి రాబోయే వాటి నీడ మాత్రమే, అయితే అసలు వ్యక్తి క్రీస్తు” అని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 2:17) ఈ పండుగల ఉద్దేశం నెరవేరిపోయింది, అంతేకాదు కొన్ని పండుగలు లేఖన విరుద్ధమైన ఆచారాలను కలుపుకున్నాయి కాబట్టి, యెహోవాసాక్షులు కింద ఇచ్చిన ఈ పండుగలను చేసుకోరు:

    •  హనుక్కా. యెరూషలేములో ఉన్న యూదుల దేవాలయాన్ని తిరిగి ప్రతిష్ఠించిన రోజుకు గుర్తుగా ఈ పండుగను చేస్తారు. కానీ యేసు ఇప్పుడు “మరింత గొప్పదైన, మరింత పరిపూర్ణమైన గుడారంలో [లేదా, ఆలయంలో] అడుగుపెట్టాడు. అది మనుషులు చేసింది కాదు, అంటే భూసంబంధమైన సృష్టికి చెందింది కాదు,” ఈ ఆలయానికి ఆయన ప్రధాన యాజకుడు అయ్యాడని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 9:11) ఈ ఆధ్యాత్మిక ఆలయం యెరూషలేములో ఉన్న యూదా ఆలయం స్థానంలోకి వచ్చేసిందని క్రైస్తవులు నమ్ముతారు.

    •  రోష్‌ హషాన్నా. ఇది యూదుల కొత్త సంవత్సరంలో మొదటి రోజు. ప్రాచీన కాలాల్లో ఈ పండుగ రోజున దేవునికి ప్రత్యేక బలులు అర్పించేవాళ్లు. (సంఖ్యాకాండము 29:​1-6) కానీ, యేసుక్రీస్తు మెస్సీయగా, “బలిని నైవేద్యమును నిలిపివేయును,” కాబట్టి దేవుని దృష్టిలో వాటికి ఇంక విలువ లేదు.—దానియేలు 9:26, 27.

  •   ఆ పండుగ వేరేమత ఆచారాలతో మిళితమై ఉందా?

     బైబిలు సూత్రం: “విశ్వాసికి, అవిశ్వాసికి ఏమైనా పోలిక ఉంటుందా? దేవుని ఆలయంలో విగ్రహాలకు చోటు ఉంటుందా?”—2 కొరింథీయులు 6:15-17.

     యెహోవాసాక్షులు తోటివాళ్లతో సమాధానంగా ఉండడానికి కృషి చేస్తారు, తమ నమ్మకాలను తామే నిర్ణయించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని గుర్తిస్తారు, కానీ వేరే మతాచారాలతో మిళితమైన ఈ వేడుకలను పాటించరు:

     మత గురువుల గౌరవంగా చేసే వేడుకలు లేదా వేర్వేరు మతస్థులు ఐక్యంగా ఆరాధించాలని ప్రోత్సహిస్తూ చేసే వేడుకలు. దేవుడు తన ప్రాచీన ఆరాధకులను వేరే మతాలను ఆచరించే ప్రజలున్న ఒక కొత్త దేశంలోకి తీసుకెళ్తున్నప్పుడు, ఇలా చెప్పాడు: “నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును.” (నిర్గమకాండము 23:32) కాబట్టి యెహోవాసాక్షులు ఇలాంటి పండుగల్లో పాల్గొనరు:

    •  లోయ్‌ క్రాథోంగ్‌. ఈ థాయ్‌ పండుగలో, “ప్రజలు ఆకులతో పడవలను తయారుచేసి, వాటిమీద కాండిల్స్‌ లేదా అగరబత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. ఆ పడవలు దురదృష్టాన్ని తీసుకెళ్లిపోతాయని వాళ్లు నమ్ముతారు. ఈ పండుగ నిజానికి బుద్ధుడు తన పాదాలతో వేసిన పవిత్ర అడుగుకు గౌరవార్థంగా చేస్తారు.”​—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బుద్ధిజమ్‌.

    •  నేషనల్‌ రిపెంటెంస్‌ డే. ఈ వేడుకలో పాల్గొనేవాళ్లు “క్రైస్తవ మత ప్రాథమిక నియమాలను ఒప్పుకుంటారు,” అని ఒక ప్రభుత్వ అధికారి ద నేషనల్‌ అనే పాపువా న్యూగిని వార్తాపత్రికలో చెప్పారు. వాళ్ల దేశంలో క్రైస్తవ సూత్రాలను పాటించడానికి ఆ వేడుక సహాయం చేస్తుందని ఆయన చెప్తున్నాడు.

    •  వెజక్‌. “ఇది బౌద్ధుల పండుగల్లో అతి పవిత్రదినం, ఇది బుద్ధుడి జననాన్ని, జ్ఞానోదయాన్ని, మరణాన్ని, లేదా మోక్షం సంపాదించుకోవడాన్ని గుర్తుచేసుకునే పండుగ.”​—హాలిడేస్‌, ఫెస్టివల్స్‌, ఎండ్‌ సెలబ్రేషన్స్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ డిక్షనరీ.

      వెజక్‌

     బైబిలు చెప్పని మతాచారాలను బట్టి చేసే వేడుకలు. యేసు మతనాయకులతో ఇలా చెప్పాడు: “మీరు మీ ఆచారం వల్ల దేవుని వాక్యాన్ని నీరుగార్చారు.” అంతేకాదు మీరు “మనుషులు పెట్టిన నియమాల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి” వాళ్ల ఆరాధన వృథా, అని కూడా ఆయన చెప్పాడు. (మత్తయి 15:6, 9) యెహోవాసాక్షులు యేసు ఇచ్చిన ఈ హెచ్చరికను హృదయానికి తీసుకుంటారు కాబట్టి వాళ్లు చాలా మత వేడుకలను చేయరు.

    •  ఎపిఫెని (ముగ్గురు రాజులు రోజు, తిమ్‌కాత్‌, లేదా లాస్‌ రెయీస్‌ మాగోస్‌). ఈ పండుగ చేసుకునేవాళ్లు జ్యోతిష్యులు యేసును చూడడానికి వచ్చిన రోజును గానీ, యేసు బాప్తిస్మాన్ని గానీ గుర్తు చేసుకుంటారు. పారే నీళ్లను, నదులను, కాలువలను దేవుళ్లుగా భావించి వాటి గౌరవార్థంగా వసంత ఋతువులో చేసే కొన్ని అన్య పండుగలను క్రైస్తవ పండుగగా మార్చేశారు. (ద క్రిస్మస్‌ ఎన్‌సైక్లోపీడియా) అలాంటి పండుగైన తిమ్‌కాత్‌ కూడా “ఆచారాల నుండి వచ్చిందే.”—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ సొసైటీ ఎండ్‌ కల్చర్‌ ఇన్‌ ద ఏన్షియంట్‌ వరల్డ్‌.

    •  ఫీస్ట్‌ ఆఫ్‌ ద ఎసంప్షన్‌ ఆఫ్‌ ద వర్జిన్‌ మేరీ (కన్య మరియ పరలోకానికి ఎత్తబడిన దినం). యేసు తల్లి అయిన మరియ భౌతిక శరీరంతోనే పరలోకానికి ఆరోహణం అయింది అనే నమ్మకాన్ని బట్టి ఈ పండుగ జరుగుతుంది. “ఈ నమ్మకం మొదట్లో ఉన్న చర్చీల్లో లేదు, దీని గురించి లేఖనాల్లో ఎక్కడా లేదు” అని రెలిజియన్‌ ఎండ్‌ సొసైటీ—ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ ఫండమెంటలిసమ్‌ అనే పుస్తకం చెప్తుంది.

    •  ఫీస్ట్‌ ఆఫ్‌ ద ఇమ్మాక్యులేట్‌ కన్సెప్షన్‌ (మరియ పుట్టినప్పటి నుండే పాపం లేకుండా పుట్టిందనే నమ్మకం ఆధారంగా చేసే పండుగ). “ఇమ్మాక్యూలేట్‌ కన్సెప్షన్‌ లేఖనాల్లో వివరించబడలేదు. . . . [అది] చర్చి తెచ్చిన బోధ.”—న్యూ కాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా.

    •  లెంట్‌. న్యూ కాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం పశ్చాత్తాపం, ఉపవాసం ఉండే ఈ కాలాన్ని “నాల్గవ శతాబ్దంలో” ఆరంభించారు. అంటే బైబిలు పూర్తైన 200 సంవత్సరాలకు ఇది మొదలైంది. ఈ లెంట్‌ రోజుల్లో మొదటి రోజు గురించి ఎన్‌సైక్లోపీడియా ఇలా చెప్తుంది, “1091లో జరిగిన సినడ్‌ ఆఫ్‌ బెనెవెంటో తర్వాత భస్మ బుధవారం రోజున విశ్వాసులు బూడిద రాయించుకునే ఆచారం సర్వత్రా వచ్చేసింది.”

    •  మేస్కెల్‌ (లేదా, మాస్కల్‌). “పెద్ద పెద్ద మంటలు పెట్టి వాటి చుట్టూ డాన్స్‌ చేస్తూ అసలు సిలువను (క్రీస్తు చనిపోయిన సిలువను) కనిపెట్టిన రోజుకు గుర్తుగా” ఇతియోపియా వాళ్లు చేసే పండుగ అని ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ సొసైటీ ఎండ్‌ కల్చర్‌ ఇన్‌ ద మిడీవల్‌ వరల్డ్‌ చెప్తుంది. అయితే యెహోవాసాక్షులు వాళ్ల ఆరాధనలో సిలువను ఉపయోగించరు.

  •   ఆ సెలవుదినం ఏ మనిషినైనా, సంస్థనైనా, లేదా జాతీయ గుర్తునైనా ఉన్నతపరుస్తుందా?

     బైబిలు సూత్రం: “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. —నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు.”—యిర్మీయా 17:5.

     యెహోవాసాక్షులకు తోటి మనుషులు పట్ల కృతజ్ఞత, గౌరవం ఉంది, వాళ్ల కోసం ప్రార్థన కూడా చేస్తారు, కానీ ఈ కింద ఇవ్వబడిన కార్యక్రమాల్లో లేదా వేడుకల్లో పాల్గొనరు:

     ఒక పరిపాలకుడిని లేదా ప్రఖ్యాత వ్యక్తిని ఘనపరిచే పండుగలు. బైబిలు ఇలా చెప్తుంది: “తన నాసికారంధ్రములలో ప్రాణముకలిగిన నరుని లక్ష్యపెట్టకుము; వానిని ఏవిషయములో ఎన్నిక చేయవచ్చును?” (యెషయా 2:22) అందుకే యెహోవాసాక్షులు ఒక రాజు, రాణి లేదా ఇతర గొప్పవాళ్ల పుట్టిన రోజులను చేయరు.

     జాతీయ జెండా పండుగలు. యెహోవాసాక్షులు జెండా పండుగ చేయరు. ఎందుకు? ఎందుకంటే బైబిలు చెప్తుంది, “విగ్రహాలకు దూరంగా ఉండండి.” (1 యోహాను 5:21) నేడు కొంతమంది జెండాను ఒక విగ్రహంగా లేదా పూజించే ఒక వస్తువుగా చూడరు. కానీ చరిత్రకారుడైన కార్ల్‌టన్‌ జే. ఎచ్‌. హేయ్స్‌ ఇలా రాశారు: “జాతీయవాదానికి ముఖ్య చిహ్నం, దేశభక్తికి ముఖ్య విగ్రహం జెండానే.”

     ఒక స్వామి లేదా సెయింట్‌ను ఉన్నతపరిచే పండుగలు. దేవునియందు భయభక్తులున్న ఒకతను అపొస్తలుడైన పేతురుకు వంగి దండం పెట్టినప్పుడు ఏమి జరిగింది? బైబిలు ఇలా చెప్తుంది: “పేతురు అతన్ని లేపుతూ ‘లే, నేను కూడా మనిషినే’ అన్నాడు.” (అపొస్తలుల కార్యాలు 10:25, 26) పేతురు గానీ అపొస్తలుల్లో ఏ ఒక్కరు గానీ ప్రత్యేకమైన గౌరవాన్ని, భక్తిని తీసుకోలేదు. కాబట్టి, స్వామీజీలుగా, సెయింట్లుగా, పవిత్రులుగా పరిగణించబడే వాళ్ల గౌరవార్థం చేసే కార్యక్రమాల్లో యెహోవాసాక్షులు పాల్గొనరు. వాళ్లు ఇలాంటి వేడుకలు చేయరు:

    •  ఆల్‌ సెయింట్స్‌ డే. “సెయింట్లందరి గౌరవార్థంగా చేసే పండుగ . . . ఈ పండుగ ఎలా మొదలైందో సరైన ఆధారాలు లేవు.”—న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా.

    •  ఫియస్టా ఆఫ్‌ అవర్‌ లేడీ ఆఫ్‌ గ్వాడలుపె. ఈ పండుగ “మెక్సికోను కాపాడే సెయింట్‌” గౌరవార్థంగా జరుగుతుంది, కొంతమంది ఆమెను యేసు తల్లి అయిన మరియగా నమ్ముతారు. ఆమె 1531లో అద్భుతంగా ఒక రైతుకు కనపడిందని చెప్తారు.—ద గ్రీన్‌వుడ్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ లాటినొ లిటరేచర్‌.

      ఫియస్టా ఆఫ్‌ అవర్‌ లేడీ ఆఫ్‌ గ్వాడలుపె

    •  నేమ్‌ డే. బాప్తిస్మం తీసుకున్నప్పుడు లేదా వాళ్లు చర్చిలో విశ్వాసాన్ని ధృవీకరించినప్పుడు పిల్లలకు ఒక సెయింట్‌ పేరు పెడతారు. ఆ సెయింట్‌ గౌరవంగా చేసే వేడుకే నేమ్‌ డే అని సెలెబ్రేటింగ్‌ లైఫ్‌ కస్టమ్స్‌ అరౌండ్‌ ద వరల్డ్‌—ఫ్రమ్‌ బేబి షవర్స్‌ టు ఫ్యూనరల్స్‌ పుస్తకం చెప్తుంది. “ఆ రోజున ఎక్కువ మత సంబంధమైన ఆచారాలు ఉంటాయి” అని ఆ పుస్తకం చెప్తుంది.

     రాజకీయ, సామాజిక పోరాటాలను జరుపుకునే వేడుకలు. “మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు” అని బైబిలు చెప్తుంది. (కీర్తన 118:8, 9) మనుషులు కాదుగానీ దేవుడే ప్రపంచ సమస్యల పరిష్కారాన్ని తెస్తాడని యెహోవాసాక్షులు నమ్ముతారు. ఈ విషయంలో వాళ్లని తప్పుగా అర్థం చేసుకోకుండా రాజకీయ, సామాజిక ఉద్యమాలకు మద్దతు ఇచ్చే యూత్‌ డే లేదా వుమెన్స్‌ డే లాంటి వేడుకల్లో యెహోవాసాక్షులు పాల్గొనరు. ఆ కారణాన్ని బట్టే వాళ్లు ఇమాన్‌సిపేషన్‌ డే (కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు బానిసత్వాన్ని నిర్మూలించాలని నిర్ణయించిన రోజు) లేదా అలాంటి వేడుకల్లో పాల్గొనరు. కానీ వాళ్లు జాతివివక్ష, అసమానత్వం లాంటి సమస్యల పరిష్కారానికి దేవుని రాజ్యం వైపు చూస్తారు.—రోమీయులు 2:11; 8:21.

  •   ఆ పండుగ ఒక దేశాన్ని లేదా జాతిని వేరేవాళ్ల కన్నా ఎక్కువగా ఉన్నతపరుస్తుందా?

     బైబిలు సూత్రం: “దేవునికి పక్షపాతం లేదు. ... ప్రతీ దేశంలో, దేవునికి భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 10:34, 35.

     యెహోవాసాక్షుల్లో చాలామందికి వాళ్ల సొంత దేశం అంటే ఇష్టం ఉన్నప్పటికీ, దేశాలను, జాతులను ఎక్కువగా ఉన్నతపరిచే వేడుకల్లో వాళ్లు పాల్గొనరు. ఈ కింది వాటిని చూడండి:

     సైన్యం గౌరవార్థంగా చేసే కార్యక్రమాలు. యుద్ధాన్ని ప్రోత్సహించే బదులు, యేసు తన అనుచరులకు, “మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి, మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి” అని చెప్పాడు. (మత్తయి 5:44) కాబట్టి, యెహోవాసాక్షులు సైనికుల గౌరవార్థంగా చేసే వేడుకలు చేయరు, వాటితోపాటు ఈ కింద ఇవ్వబడిన సెలవుదినాలు కూడా పాటించరు:

    •  ఆన్‌జాక్‌ డే. “ఆన్‌జాక్‌ అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సైనిక సంస్థలు. మెల్లగా, ఆన్‌జాక్‌ డే యుద్ధంలో చనిపోయిన వాళ్లను గుర్తుచేసుకునే రోజుగా మారిపోయింది.”—హిస్టారికల్‌ డిక్షనరీ ఆఫ్‌ ఆస్ట్రేలియా.

    •  వెటరన్స్‌ డే (రిమెంబరెన్స్‌ డే, రిమెంబరెన్స్‌ సండే లేదా మెమోరియల్‌ డే). ఈ సెలవుదినాలు “సైన్యాల్లో ఉన్న వయుసుపైబడిన వాళ్లను, దేశ యుద్ధాల్లో చనిపోయినవాళ్లను” గౌరవిస్తాయి.—ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.

     దేశ చరిత్ర లేదా స్వాతంత్ర్యాన్ని జరుపుకునే పండుగ. తన అనుచరుల గురించి యేసు ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కాను, అలాగే వీళ్లు కూడా లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) యెహోవాసాక్షులకు దేశ చరిత్ర గురించి నేర్చుకోవడం ఇష్టం ఉన్నప్పటికీ, ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు:

    •  ఆస్ట్రేలియా డే. వరల్డ్‌మార్క్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ కల్చర్స్‌ ఎండ్‌ డెయిలీ లైఫ్‌ ప్రకారం, ఈ సెలవుదినం “1788లో ఇంగ్లీష్‌ సైనికులు వాళ్ల జెండాను ఎగరేసి ఆస్ట్రేలియాను కొత్త కాలనీగా ప్రకటించిన రోజు.”

    •  గయ్‌ ఫాక్స్‌ డే. ‘1605లో గయ్‌ ఫాక్స్‌, అతనితో ఉన్న కొందరు కాథలిక్‌ సానుభూతిపరులు కింగ్‌ జేమ్స్‌ Iను, [ఇంగ్లండ్‌] పార్లమెంటును పేల్చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ చేసే జాతీయ వేడుక గయ్‌ ఫాక్స్‌ డే.’—ఎ డిక్షనరీ ఆఫ్‌ ఇంగ్లీష్‌ ఫోక్‌లోర్‌.

    •  ఇండిపెండెన్స్‌ డే (స్వాతంత్ర్య దినోత్సవం). చాలా దేశాల్లో, “దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును ప్రతీ సంవత్సరం అందరూ కలిసి జరుపుకోవడానికి ఒక రోజును నిర్ణయిస్తారు.”—మిరియమ్‌-వెబ్‌స్టర్స్‌ అన్‌ఎబ్రిజ్డ్‌ డిక్షనరీ.

  •   ఈ పండుగ విచ్ఛలవిడిగా లేదా అసభ్యంగా ఉండే ప్రవర్తనను పురికొల్పుతుందా?

     బైబిలు సూత్రం: “గతంలో మీరు లెక్కలేనట్టు ప్రవర్తిస్తూ, అదుపులేని వాంఛలకు లోనౌతూ, మితిమీరి తాగుతూ, విచ్చలవిడి విందులు చేసుకుంటూ, తాగుబోతుల విందుల్లో పాల్గొంటూ, అసహ్యకరమైన విగ్రహపూజలు చేస్తూ లోక ప్రజల ఇష్టప్రకారం జీవించారు. అవన్నీ చేయడానికి గతంలో మీరు వెచ్చించిన సమయం చాలు.”—1 పేతురు 4:3.

     ఆ సూత్రాన్ని పాటిస్తూ యెహోవాసాక్షులు బాగా తాగడాన్ని, విచ్ఛలవిడిగా పార్టీలు చేసుకోవడాన్ని ప్రోత్సహించే పండుగలు చేయరు. యెహోవాసాక్షులు స్నేహితుల్ని కలుసుకుని పార్టీ చేసుకుంటారు, మద్యం తీసుకోవాలని అనుకున్నా, మితంగా తీసుకుంటారు. బైబిల్లో ఇచ్చిన ఈ సలహాను పాటించడానికి బాగా కృషిచేస్తారు: “మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.”—1 కొరింథీయులు 10:31.

     కాబట్టి బైబిలు ఖండించే అసభ్య ప్రవర్తన ఉన్న కార్నివల్స్‌లో లేదా అలాంటి పండుగల్లో యెహోవాసాక్షులు పాల్గొనరు. అలాంటి వాటిలో ఒకటి యూదులు చేసే పూరీము పండుగ. క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలో యూదుల విడుదలకు గుర్తుగా పూరీమును చాలాకాలంగా చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ‘యూదులు ఈ పండుగను ఖచ్చితంగా కాకపోయినా చాలావరకు మార్డి గ్రాస్‌ లేదా కార్నివల్‌ లానే చేస్తున్నారు’ అని ఎసెన్షియల్‌ జూడాయిజమ్‌ అనే పుస్తకం చెప్తుంది. ఈ సంబరాలు చేసుకునే చాలామంది “డ్రామాల్లో వాడే విచిత్రమైన బట్టలు వేసుకుంటారు (చాలావరకు మగవాళ్లు ఆడవాళ్ల బట్టలు వేసుకుంటారు), విచ్ఛలవిడిగా ప్రవర్తిస్తారు, విపరీతంగా తాగుతారు, బాగా అల్లరి చేస్తారు.”

 యెహోవాసాక్షులు కొన్ని పండుగలు చేసుకోరు కాబట్టి వాళ్లు కుటుంబాలను ప్రేమించడంలేదని అర్థమా?

 కాదు. వాళ్ల నమ్మకాలు ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులందర్నీ ప్రేమించి, గౌరవించాలని బైబిలు ప్రజలకు నేర్పిస్తుంది. (1 పేతురు 3:1, 2, 7) నిజమే, ఒక యెహోవాసాక్షి కొన్ని వేడుకలు చేసుకోవడం ఆపేస్తే, వాళ్ల బంధువుల్లో కొంతమంది బాధపడవచ్చు, కోపం తెచ్చుకోవచ్చు, లేదా వాళ్లను వదిలేసినట్లు (వాళ్లకు నమ్మకద్రోహం చేసినట్లు) అనుకోవచ్చు. అందుకే చాలామంది యెహోవాసాక్షులు వాళ్లే చొరవ తీసుకుని బంధువుల మీద వాళ్లకు ప్రేమ ఉందనే భరోసాను ఇస్తారు, వాళ్ల నిర్ణయాలకు కారణాలను తెలివిగా, నొప్పించకుండా వివరిస్తారు, వేరే సమాయాల్లో బంధువులను కలుస్తుంటారు.

 యెహోవాసాక్షులు ఇతరులకు కొన్ని పండుగలు చేసుకోవద్దని చెప్తారా?

 లేదు. ఎవరి నిర్ణయం వాళ్లే తీసుకోవాలని యెహోవాసాక్షులు అనుకుంటారు. (యెహోషువ 24:15) ఎవరికి ఏ మతనమ్మకాలు ఉన్నా, యెహోవాసాక్షులు అన్నిరకాల ప్రజల్ని గౌరవిస్తారు లేదా ఘనపరుస్తారు.—1 పేతురు 2:17.

a ఈ ఆర్టికల్లో యెహోవాసాక్షులు చేయని ప్రతీ పండుగ గురించి చెప్పడం లేదు, లేదా వాటికి సంబంధించిన ప్రతీ బైబిలు సూత్రాన్ని చెప్పడం లేదు.

b కె. ఈ. ఇదుల్జీ రాసిన మిత్ర, మిత్రాయిసమ్‌, క్రిస్మస్‌ డే & యాల్ద పుస్తకం, 31-33 పేజీలు.