కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

చదువు, డబ్బు మంచి భవిష్యత్తును ఇస్తాయా?

పైచదువులు చదివితే, బాగా డబ్బు సంపాదిస్తే భవిష్యత్తు బాగుంటుందని చాలామంది అనుకుంటారు. బాగా చదువుకున్న వ్యక్తి పనిలో నైపుణ్యం సాధిస్తాడని, ఇంట్లోవాళ్లను బాగా చూసుకుంటాడని, సమాజానికి కూడా సేవ చేస్తాడనేది వాళ్ల అభిప్రాయం. పైగా అలాంటివాళ్లకు ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం దొరుకుతుందని, అప్పుడు బాగా డబ్బు సంపాదించి సంతోషంగా ఉండవచ్చని వాళ్లు అనుకుంటారు.

చాలామంది పైచదువును ఎంచుకుంటారు

చైనాలో ఉన్న జాంగ్‌ చెన్‌ ఇలా చెప్పాడు: “నేను పేదరికంలో పెరిగాను. నేను యూనివర్సిటీలో చదివి డిగ్రీ సంపాదిస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు కష్టాలేవీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను.”

చాలామంది మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో, పేరున్న యూనివర్సిటీలో చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం వేరేదేశాలకు కూడా వెళ్తున్నారు, అలా వెళ్లే వాళ్ల సంఖ్య కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. కాకపోతే, ఈమధ్య కోవిడ్‌ వల్ల విదేశీ ప్రయాణాలపై షరతులు విధించారు. ఆ కారణంగా, పైచదువుల కోసం విదేశాలకు వెళ్లేవాళ్ల సంఖ్య కాస్త తగ్గింది. సుమారు 10 ఏళ్ల క్రితం ఒక సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల్లో 52 శాతం మంది ఆసియా నుండి వెళ్లినవాళ్లే అని తేలింది.

పిల్లల్ని విదేశాల్లో చదివించడం కోసం తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పని చేస్తారు, ఎన్నో త్యాగాలు చేస్తారు. తైవాన్‌లో ఉంటున్న సీసియాంగ్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మా అమ్మానాన్నలకు నలుగురు పిల్లలం. మేము డబ్బు ఉన్నవాళ్లం కాదు. అయినా పైచదువుల కోసం మా నలుగురిని అమెరికా పంపించారు.” చాలామందిలాగే, సీసియాంగ్‌ వాళ్ల అమ్మానాన్నలు కూడా తమ పిల్లల చదువుల కోసం చాలాచోట్ల అప్పులు చేశారు.

ఫలితం

ఎక్కువ చదువుకుని చేతినిండా డబ్బు సంపాదించిన చాలామంది, చివరికి జీవితంతో విసిగిపోయారు.

పైచదువుల వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కానీ విద్యార్థులు కోరుకున్న జీవితాన్ని అది అన్నిసార్లు ఇవ్వలేదు. ఉదాహరణకు, ఎన్నో ఏళ్లు పగలనకా-రాత్రనకా కష్టపడి పనిచేసి, ఎన్నో అప్పులు చేసి, పైచదువులు చదివించాక కూడా చాలామందికి కోరుకున్న ఉద్యోగం దొరకట్లేదు. సింగపూర్‌ బిజినెస్‌ టైమ్స్‌ అనే వార్తాపత్రికలో ఇలా వచ్చింది: “ఈమధ్య కాలంలో, యూనివర్సిటీ డిగ్రీ ఉన్న చాలామంది ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్నారు.” తైవాన్‌లో ఉంటున్న జీయాంజికు డాక్టరేట్‌ డిగ్రీ ఉంది. అతను ఇలా అంటున్నాడు: “వేరే దారిలేక చాలామంది ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారంటే, వాళ్ల చదువుకూ చేస్తున్న ఉద్యోగానికీ ఎలాంటి సంబంధం ఉండట్లేదు.”

కొంతమందికి కోరుకున్న ఉద్యోగం దొరికినా, సంతోషం మాత్రం ఉండట్లేదు. థాయ్‌లాండ్‌కి చెందిన నిరాన్‌ అనే వ్యక్తికి అలాంటి పరిస్థితే ఎదురైంది. అతను యూరప్‌లోని ఒక యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని తన దేశానికి తిరిగొచ్చాడు. చదువుకు తగ్గ ఉద్యోగం కూడా దొరికింది. అతను ఇలా అంటున్నాడు: “నేను అనుకున్నట్లుగానే, యూనివర్సిటీ డిగ్రీ ఉండడం వల్ల మంచి జీతం వచ్చే ఉద్యోగం దొరికింది. కానీ తీరిక లేనంత పని, రోజులో ఎక్కువ గంటలు ఆఫీసులోనే గడిచిపోయేవి. కొంతకాలానికి కంపెనీ వాళ్లు చాలామంది ఉద్యోగుల్ని పనిలో నుండి తీసేశారు, అలా నా ఉద్యోగం కూడా పోయింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, కష్టపడి ఎంత మంచి ఉద్యోగం సంపాదించినా అది ఎంతకాలం ఉంటుందో గ్యారెంటీ లేదు.”

కొన్నిసార్లు డబ్బున్నవాళ్లను చూసి ‘వీళ్లకు ఏ కష్టం లేదు’ అని అనుకుంటారు. నిజానికి వాళ్లకు కూడా సమస్యలు ఉంటాయి. వాళ్లకూ ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. జపాన్‌లో ఉంటున్న కజూయా ఇలా అంటున్నాడు: “నాకు అన్నీ ఉన్నా సంతోషం మాత్రం ఉండేది కాదు. ఎందుకంటే వేరేవాళ్లు నన్ను చూసి అసూయపడేవాళ్లు, నన్ను ఎగతాళి చేసేవాళ్లు.” వియత్నాంలో ఉంటున్న లామ్‌ అనే ఆవిడ ఇలా చెప్పింది: “ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది మంచి జీతం వచ్చే ఉద్యోగం కోసం కష్టపడతారు. కానీ వాస్తవం వేరు. అది ప్రశాంతతను ఇవ్వకపోగా, రకరకాల టెన్షన్‌లతో పాటు ఆరోగ్య సమస్యల్ని, మానసిక సమస్యల్ని తెచ్చిపెడుతుంది.”

ఫ్రాంక్లిన్‌లాగే చాలామంది, జీవితం అంటే పెద్దపెద్ద చదువులు చదవడం, డబ్బు సంపాదించడం మాత్రమే కాదని అర్థంచేసుకున్నారు. వాటికన్నా ముఖ్యమైనవి జీవితంలో ఉన్నాయని గ్రహించారు. సాటిమనుషులకు వీలైన సహాయం చేస్తూ మంచి వ్యక్తిగా జీవిస్తే భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది అనుకుంటారు. వాళ్లు అనుకునేది నిజమేనా? జవాబు తర్వాతి పేజీల్లో తెలుసుకుందాం.