కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సిలువ

సిలువ

సిలువ

చాలామంది సిలువను క్రైస్తవ మతానికి గుర్తుగా చూస్తారు. కానీ సిలువ వేసుకోవాలని లేదా ఇళ్లలో, చర్చీల్లో పెట్టాలని అందరూ నమ్మరు.

యేసు సిలువ మీద చనిపోయాడా?

కొంతమంది ఏమంటారు?

 

రోమన్లు రెండు చెక్కలతో చేసిన సిలువ మీద యేసును వేలాడదీసి చంపారు.

బైబిలు ఏం చెప్తుంది?

 

యేసును చెట్టుకు వ్రేలాడదీసి చంపారు. (అపొస్తలుల కార్యములు 10:39, ద న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌) యేసు దేని మీద చనిపోయాడో వివరించడానికి బైబిలు రచయితలు వాడిన రెండు పదాలు ఒక కర్ర లేదా కొయ్య అనే అర్థాన్నే ఇస్తాయి కానీ రెండు కర్రలు లేదా కొయ్యలు అనే అర్థాన్ని ఇవ్వవు. క్రూసిఫిక్షన్‌ ఇన్‌ ఆన్‌టిక్విటీ అనే పుస్తకం ప్రకారం స్టౌరస్‌ అనే గ్రీకు పదానికి “అర్థం కొయ్య. అది సిలువ అనే పదానికి సమానమైనది కాదు.” అపొస్తలుల కార్యాలు 5:30⁠లో ఉపయోగించిన క్సైలోన్‌ అనే పదానికి “నిలువుగా ఉన్న కొయ్య లేదా మ్రాను అని అర్థం.” రోమన్లు కొయ్యకు మేకులు కొట్టి వ్రేలాడదీసినవాళ్లను సిలువ వేయబడ్డారు అనేవాళ్లు. a

యేసును చంపిన విధానాన్ని పూర్వం ఇశ్రాయేలీయులకు ఉన్న ఒక నియమంతో బైబిలు పోలుస్తుంది. ఆ నియమం ఇలా ఉంది: “మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల . . . వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు.” (ద్వితీయోపదేశకాండము 21:22, 23) ఆ నియమం గురించి చెప్తూ క్రైస్తవ అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: యేసు, “శాపానికి గురయ్యాడు. ఎందుకంటే ‘కొయ్యకు వేలాడదీయబడిన ప్రతీ మనిషి శాపానికి గురైనవాడు’ అని రాసివుంది.” (గలతీయులు 3:13) యేసు ఒక కొయ్యమీద అంటే ఒకేఒక గుంజ మీద చనిపోయాడని పౌలు సూచించాడు.

యేసును చెట్టుకు వ్రేలాడదీసి చంపారు.అపొస్తలుల కార్యములు 10:39, ద న్యూ జెరూసలేమ్‌ బైబిల్‌.

దేవున్ని ఆరాధించడానికి లేదా క్రైస్తవత్వానికి గుర్తుగా యేసు శిష్యులు సిలువను ఉపయోగించారా?

బైబిలు ఏం చెప్తుంది?

 

తొలి క్రైస్తవులు సిలువను మతసంబంధమైన గుర్తుగా చూశారని బైబిల్లో ఎక్కడా లేదు. నిజానికి ఆ కాలంలో జీవించిన రోమన్లే వాళ్ల దేవుళ్లకు సూచనగా సిలువ గుర్తును ఉపయోగించేవాళ్లు. తర్వాత, యేసు చనిపోయిన 300 సంవత్సరాలకు రోమన్‌ చక్రవర్తి కాన్‌స్టంటైన్‌ సిలువను తన సైన్యాలకు గుర్తుగా పెట్టుకున్నాడు. అప్పటినుండి సిలువ “క్రిస్టియన్‌” చర్చీలకు గుర్తు అయిపోయింది.

అన్య మతస్థులు వాళ్ల దేవుళ్లను ఆరాధించడానికి సిలువను వాడతారు అని తెలిసినా యేసు శిష్యులు సత్య దేవున్ని ఆరాధించడానికి అదే సిలువను ఉపయోగిస్తారని మీకు అనిపిస్తుందా? “యే స్వరూపముగలిగిన విగ్రహమును” ఆరాధించడం దేవునికి మొదటి నుండి అస్సలు ఇష్టం లేదని, క్రైస్తవులు ‘విగ్రహపూజకు దూరంగా ఉండాలని’ యేసు శిష్యులకు బాగా తెలుసు. (ద్వితీయోపదేశకాండము 4:15-19; 1 కొరింథీయులు 10:14) “దేవుడు అదృశ్య వ్యక్తి,” మనుషులకు కనిపించడు. కాబట్టి, తొలి క్రైస్తవులు దేవునికి దగ్గరవ్వడానికి కనిపించే వస్తువులను లేదా చిహ్నాలను ఉపయోగించలేదు. బదులుగా, ఆయనను “పవిత్రశక్తితో” అంటే పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ఆరాధించారు. అంతేకాదు, “సత్యంతో” అంటే లేఖనాల్లో ఉన్న దేవుని చిత్త ప్రకారం ఆరాధించారు.—యోహాను 4:24.

‘దేవుణ్ణి సరైన విధంగా ఆరాధించేవాళ్లు పవిత్రశక్తితో, సత్యంతో ఆరాధిస్తారు.’ యోహాను 4:23.

క్రైస్తవులు యేసుక్రీస్తుకు గౌరవాన్ని ఎలా చూపించాలి?

ప్రజల అభిప్రాయం

 

“రక్షణ తెచ్చిన సాధనాన్ని ప్రత్యేకంగా గౌరవించడం, ఆరాధించడం సహజమే . . . విగ్రహాన్ని ప్రేమించే అతను, విగ్రహానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిని కూడా ప్రేమిస్తాడు అనడంలో సందేహం లేదు.”—న్యూ క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా.

బైబిలు ఏం చెప్తుంది?

 

క్రైస్తవులు యేసుకు రుణపడి ఉన్నారు. ఎందుకంటే, ఆయన మరణం వల్ల పాప క్షమాపణ పొందడానికి, దేవున్ని సమీపించడానికి, నిత్యజీవం పొందడానికి వాళ్లకు అవకాశం ఉంటుంది. (యోహాను 3:16; హెబ్రీయులు 10:19-22) యేసుకు గౌరవం చూపించాలంటే ఆయనకు గుర్తుగా ఉన్న ఏదైనా ప్రతిమను పెట్టుకోవాలని క్రైస్తవులకు చెప్పలేదు. అంతేకాదు ఆయనను నమ్ముతున్నాము అని ఊరికే నోటితో చెప్తే కూడా సరిపోదు. నిజానికి, “విశ్వాసాన్ని చేతల్లో చూపించకపోతే అది చచ్చినట్టే లెక్క.” (యాకోబు 2:17) యేసు మీద వాళ్ల విశ్వాసాన్ని క్రైస్తవులు పనుల్లో చూపించాలి. ఎలా?

“క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలంగా పురికొల్పుతోంది. ఎందుకంటే ఒక్క మనిషి అందరి కోసం చనిపోయాడని గ్రహించాం; . . . బ్రతికి ఉన్నవాళ్లు ఇకమీదట తమకోసం జీవించకుండా, తమకోసం చనిపోయి బ్రతికించబడిన వ్యక్తి కోసం జీవించాలని” బైబిలు చెప్తుంది. (2 కొరింథీయులు 5:14, 15) క్రీస్తు చూపించిన అసాధారణమైన ప్రేమను బట్టి క్రైస్తవులు వాళ్ల జీవితాలను మార్చుకుని, ఆయన మాదిరి ప్రకారం జీవించాలని అనుకుంటారు. ఇలా, ఏదో మతసంబంధమైన చిహ్నాన్ని ఉపయోగించి కాకుండా యేసును సరైన విధంగా గౌరవిస్తారు.

“కొడుకును అంగీకరించి, ఆయనమీద విశ్వాసం చూపించే ప్రతీ ఒక్కరు శాశ్వత జీవితం పొందాలన్నదే నా తండ్రి ఇష్టం.” యోహాను 6:40.

a ఎథెల్‌బర్ట్‌. డబ్ల్యూ. బుల్లింగర్‌ రాసిన ఎ క్రిటికల్‌ లెక్సికన్‌ అండ్‌ కంకార్డెన్స్‌ టు ద ఇంగ్లిష్‌ అండ్‌ గ్రీక్‌ న్యూ టెస్టమెంట్‌, 11వ ఎడిషన్‌, 818-819 పేజీలు.