కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భావోద్వేగపరమైన ఆరోగ్యం

భావోద్వేగపరమైన ఆరోగ్యం

హాని చేసే భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోమని, మేలు చేసే భావోద్వేగాల్ని అలవర్చుకోమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తుంది.

కోపం

బైబిలు సూత్రం: “కోప్పడే విషయంలో నిదానించేవాడు బలశాలి కన్నా బలవంతుడు.”—సామెతలు 16:32, NW.

అంటే: మన భావోద్వేగాల్ని అదుపుచేసుకోవడం నేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. కొన్నిసార్లు మనకు కోపం రావడం న్యాయమే, కానీ విపరీతమైన కోపం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రజలు కోపంలో ఉన్నప్పుడు సరిగ్గా ఆలోచించలేరనీ, దానివల్ల ఏదోకటి అనేసి లేదా ఏదోకటి చేసేసి ఆ తర్వాత ఎందుకలా చేశామని బాధపడతారనీ ఆధునిక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.

మీరేం చేయవచ్చు: కోపంలో ఏదోకటి చేసేలోపే, మీ కోపాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకోండి. మితిమీరిన కోపం ఉన్నవాళ్లు బలవంతులని కొందరు అనుకుంటారు, అయితే నిజానికి అది ఒక బలహీనత అని తెలివైనవాళ్లు గుర్తిస్తారు. “ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 25:28) కోపాన్ని అదుపు చేసుకునే ఒక మంచి పద్ధతి ఏంటంటే, కోపంలో ఏదోకటి అనే ముందు లేదా చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవడం. “మనిషి లోతైన అవగాహన అతని కోపాన్ని చల్లారుస్తుంది.” (సామెతలు 19:11, NW) విషయాన్ని రెండువైపులా జాగ్రత్తగా వినడంవల్ల మనకు సరైన అవగాహన వస్తుంది. దానివల్ల మనం అతిగా స్పందించకుండా ఉండగలుగుతాం.

కృతజ్ఞత

బైబిలు సూత్రం: “కృతజ్ఞులై ఉండండి.”—కొలొస్సయులు 3:15.

అంటే: కృతజ్ఞత ఉన్నవాళ్లే సంతోషంగా ఉంటారని అంటుంటారు. తీవ్రంగా నష్టపోయిన కొంతమంది కూడా ఆ మాట నిజమని ఒప్పుకుంటారు. వాళ్లు ఇలా చెప్తున్నారు: ‘పోగొట్టుకున్న దాని గురించే ఆలోచిస్తూ ఉండే బదులు, మా దగ్గర ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞత కలిగివుండడం వల్ల మేము ఆ బాధను తట్టుకోగలిగాం.’

మీరేం చేయవచ్చు: ప్రతీరోజు, మీరు ఏయే విషయాల్ని బట్టి కృతజ్ఞతతో ఉండవచ్చో ఒక లిస్టు రాసుకోండి. అవి పెద్దపెద్ద విషయాలే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నచిన్న విషయాలు అంటే అందమైన సూర్యోదయం, మీకు బాగా ఇష్టమైనవాళ్లతో మనసువిప్పి మాట్లాడడం, లేదా బ్రతకడానికి మరో రోజు దొరకడం వంటివాటిని బట్టి కూడా కృతజ్ఞతతో ఉండవచ్చు. ఇలాంటి మంచి విషయాల గురించి ఆలోచిస్తూ, కృతజ్ఞతతో జీవిస్తే మీరు మరింత సంతోషంగా ఉంటారు.

మీ కుటుంబ సభ్యులు, స్నేహితుల విషయంలో మీరు ఎందుకు కృతజ్ఞత చూపించవచ్చో ఆలోచించడం మీకు చాలా మేలు చేస్తుంది. దేన్ని బట్టి వాళ్లు మీకు చాలా విలువైన వాళ్లో గుర్తించిన తర్వాత, దాని గురించి వాళ్లకు చెప్పండి. వాళ్లను కలిసి అయినా చెప్పండి లేదా ఒక ఉత్తరం, మెయిల్‌, మెసేజ్‌ ద్వారా అయినా తెలియజేయండి. దానివల్ల మీ అనుబంధాలు బలపడే అవకాశం ఉంది, అలాగే ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని కూడా మీరు రుచిచూస్తారు.—అపొస్తలుల కార్యాలు 20:35.

ఇంకొన్ని బైబిలు సూత్రాలు

మీరు బైబిలు ఆడియోను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. jw.org వెబ్‌సైట్‌లో బైబిలు ఆడియో 40 భాషల్లో ఉంది

గొడవలకు దూరంగా వెళ్లిపోండి.

“కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాక మునుపే దాని విడిచిపెట్టుము.”—సామెతలు 17:14.

భవిష్యత్తు గురించి అతిగా చింతించకండి.

“రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, ఎందుకంటే రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి. ఈరోజు ఉన్న సమస్యల గురించి మాత్రమే ఆలోచించండి.”—మత్తయి 6:34.

తొందరపడకండి, జాగ్రత్తగా ఆలోచించాకే ఏదైనా చేయండి.

“ఆలోచనా సామర్థ్యం నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది, వివేచన నీకు కాపుదలగా ఉంటుంది.”—సామెతలు 2:11, NW.