కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు చేసిన అద్భుతాలు—వాటినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

యేసు చేసిన అద్భుతాలు—వాటినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

యేసు చేసిన అద్భుతాలు—వాటినుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

యేసు భూజీవితం గురించి తెలిపే బైబిలు వృత్తాంతాల్లో “అద్భుతం” అనే మాటకు మూలభాషా పదమే ఉపయోగించబడలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతుండవచ్చు. “అద్భుతం” అని కొన్నిసార్లు అనువదించబడిన గ్రీకు పదానికి (దీనామీస్‌) అక్షరార్థ భావం “ప్రభావము.” (లూకా 8:​46) దానిని “సామర్థ్యము” లేక “అద్భుతములు” అని కూడా అనువదించవచ్చు. (మత్తయి 11:​20; 25:​15) ఒక విద్వాంసుని ప్రకారం, ఈ గ్రీకు పదం “నిర్వర్తించబడిన ఒక గొప్పకార్యమును, ప్రత్యేకించి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఉపయోగించబడిన శక్తిని నొక్కి చెబుతుంది. ఆ సంఘటన, ఆచరణలో ఉన్న దేవుని శక్తిని నొక్కి చెప్పే విధంగా వర్ణించబడింది.”

మరొక గ్రీకు పదం (టెరస్‌) సాధారణంగా “సూచక క్రియ” లేదా “మహత్కార్యము” అని అనువదించబడింది. (యోహాను 4:​48; అపొస్తలుల కార్యములు 2:​19) ఈ పదం చూపరుల మీదపడే ప్రభావం గురించి నొక్కి చెబుతుంది. యేసు చేసిన అద్భుతకార్యాలు చూసి జనసమూహము, శిష్యులు తరచూ విభ్రాంతినొందారు, ఆశ్చర్యపడ్డారు.​—⁠మార్కు 2:​12; 4:​41; 6:​51; లూకా 9:​43.

యేసు చేసిన అద్భుతాలను సూచించే మూడవ గ్రీకు పదం (సీమీఓన్‌) “సంకేతం” అనే అర్థాన్నిస్తుంది. ఇది “అద్భుతానికున్న లోతైన భావంపై దృష్టి సారిస్తుంది” అని విద్వాంసుడైన రాబర్ట్‌ డెఫిన్‌బావ్‌ చెబుతున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “మన ప్రభువైన యేసు గురించిన సత్యాన్ని తెలియజేసే అద్భుతమే ఒక సంకేతం.”

గారడీయా లేక దేవుడిచ్చిన శక్తా?

బైబిలు, యేసు చేసిన అద్భుతాలను ప్రజలకు వినోదం కలిగించే తంత్రాలుగా లేక గారడీలుగా వర్ణించడం లేదు. యేసు ఒక బాలుని నుండి దయ్యమును వెళ్ళగొట్టిన సంఘటనలో చూసినట్లుగా, ఈ అద్భుతాలు “దేవుని మహాత్మ్యమును” తెలిపేందుకు ప్రత్యక్ష రుజువులు. (లూకా 9:​37-43) అటువంటి అద్భుతకార్యములు, “అధికశక్తి” గలవాడని వర్ణించబడిన సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమా? (యెషయా 40:​26) ఎంత మాత్రం కాదు!

సువార్త వృత్తాంతాలు యేసు చేసిన అద్భుతాల్లో దాదాపు 35 అద్భుతాలను ప్రస్తావిస్తున్నాయి. అయితే ఆయన చేసిన మొత్తం అద్భుతాల సంఖ్యను చెప్పడం లేదు. ఉదాహరణకు మత్తయి 14:⁠14 ఇలా చెబుతోంది: “ఆయన [యేసు] వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.” ఆయన ఆ సందర్భంలో ఎంతమంది రోగులను స్వస్థపరిచాడో మనకు చెప్పడం లేదు.

యేసు తానే దేవుని కుమారుడనని, వాగ్దత్త మెస్సీయానని స్పష్టం చేసేందుకు అలాంటి అద్భుతకార్యములు ప్రాముఖ్యం. నిజానికి, దేవుడిచ్చిన శక్తి ద్వారానే యేసు అద్భుతములు చేయగలిగాడని లేఖనాలు ధ్రువీకరిస్తున్నాయి. అపొస్తలుడైన పేతురు యేసు గురించి ఇలా ప్రస్తావించాడు: “అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను. ఇది మీరే యెరుగుదురు.” (అపొస్తలుల కార్యములు 2:​22) మరొక సందర్భంలో పేతురు ఇలా స్పష్టీకరించాడు: “దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను . . . దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.”​—⁠అపొస్తలుల కార్యములు 10:​37, 38.

యేసు చేసిన అద్భుతాలు ఆయన సందేశంతో అనుసంధానమై ఉన్నాయి. మార్కు 1:​21-27 వచనాలు, యేసు బోధకు ఆయన చేసిన అద్భుతాలకు ప్రజల స్పందనను తెలియజేస్తున్నాయి. మార్కు 1:⁠22 జనసమూహాలు “ఆయన బోధకు ఆశ్చర్యపడిరి” అని, 27వ వచనం ఆయన ఒక అపవిత్రాత్మను వెళ్ళగొట్టినప్పుడు ప్రజలు “విస్మయమొందిరి” అని చెబుతున్నాయి. యేసు చేసిన అద్భుతకార్యములు, ఆయన ఇచ్చిన సందేశము రెండూ ఆయనే వాగ్దత్త మెస్సీయా అని నిరూపించాయి.

యేసు తానే మెస్సీయాను అని చెప్పుకోలేదు; ఆయన మాటలు, ఇతర క్రియలతోపాటు ఆయన చేసిన అద్భుతాల్లో వెల్లడైన దేవుడిచ్చిన శక్తి ఆయనే మెస్సీయా అని సాక్ష్యమిచ్చాయి. ఆయన భూమిక గురించి, ఆయన అధికారం గురించి సందేహాలు తలెత్తినప్పుడు, ఆయనిలా ధైర్యంగా జవాబిచ్చాడు: “[బాప్తిస్మమిచ్చు] యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.”​—⁠యోహాను 5:​36.

నమ్మడానికి రుజువులు

యేసు చేసిన అద్భుతాలు నిజమైనవి, నమ్మదగినవి అని మనమెందుకు విశ్వసించవచ్చు? నమ్మడానికిగల కొన్ని రుజువులను పరిశీలించండి.

యేసు అద్భుతాలు చేసేటప్పుడు, ఆయన ప్రజల శ్రద్ధను తన వైపుకు ఎన్నడూ మళ్ళించుకోలేదు. ఆయన ఏ అద్భుతం చేసినా దానికి ఘనతా మహిమా దేవునికే చెందేలా చూశాడు. ఉదాహరణకు, ఒక గ్రుడ్డి వానిని బాగు చేయడానికి ముందు, “దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే” స్వస్థత జరుగుతుందని యేసు నొక్కిచెప్పాడు.​—⁠యోహాను 9:​1-3; 11:​1-4.

గారడీవాళ్ళు, ఐంద్రజాలికులు, స్వస్థతా వరాలున్నాయని చెప్పుకునేవారు చేసినట్లు, యేసు వశీకరణను, తంత్రాన్ని, ఆకట్టుకునే ప్రదర్శనలను, మంత్ర విద్యలను, మానసికోద్వేగాలను పురికొల్పే ఆచారాలను ఎన్నడూ ప్రయోగించలేదు. ఆయన మూఢనమ్మకాలను లేక పవిత్ర చిహ్నాలను ఆశ్రయించలేదు. యేసు ఇద్దరు గ్రుడ్డివారిని చాలా మామూలుగా స్వస్థపరచిన విధానాన్ని గమనించండి. ఆ వృత్తాంతం, “యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి” అని తెలియజేస్తోంది. (మత్తయి 20:​29-34) అందులో ఆచారం, మతకర్మ, ఆకట్టుకునే ప్రదర్శన వంటివి ఏమీ లేవు. యేసు తన అద్భుతకార్యములను తరచూ బహిరంగంగా, అనేకమంది చూస్తుండగానే చేశాడు. ఆయన ప్రత్యేకమైన లైట్లను, వేదికలను, సామగ్రిని ఉపయోగించలేదు. అందుకు భిన్నంగా, అద్భుతాలు అని చెప్పుకోబడుతున్న ఆధునిక దిన అద్భుతాలు వివరణాత్మక ఆధారాలతో రుజువుపరచుకోలేక పోతున్నాయి.​—⁠మార్కు 5:​24-29; లూకా 7:​11-15.

యేసు తన అద్భుతాల నుండి ప్రయోజనం పొందినవారికి వారి విశ్వాసం దోహదపడిందని కొన్నిసార్లు అంగీకరించాడు. అయితే ఒక వ్యక్తిలోని అవిశ్వాసం యేసు అద్భుతం చేయకుండా నిరోధించలేదు. ఆయన గలిలయలోని కపెర్నహూములో ఉన్నప్పుడు, “జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి. ఆయన మాటవలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను.” (ఇటాలిక్కులు మావి.)​—⁠మత్తయి 8:​16, 17.

యేసు చేసిన అద్భుతాలు ప్రజల నిజమైన భౌతిక అవసరాలను తీర్చడానికే చేయబడ్డాయి కానీ ఉత్సుకతను కనబరచినవారిని తృప్తిపరచడానికి కాదు. (మార్కు 10:​46-52; లూకా 23:⁠8) యేసు తన ప్రయోజనార్థం కూడా ఎన్నడూ అద్భుతాలు చేయలేదు.​—⁠మత్తయి 4:​2-4; 10:⁠8.

సువార్త వృత్తాంతాల విషయమేమిటి?

యేసు చేసిన అద్భుతాల గురించిన యథార్థాలు నాలుగు సువార్త వృత్తాంతాల ద్వారా మనకు అందించబడ్డాయి. యేసుకు ఆపాదించిన అద్భుతాల నమ్మకత్వాన్ని మనం పరిశీలిస్తుండగా ఈ వృత్తాంతాలను నమ్మడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? ఉన్నాయి.

ఇంతకుముందే పేర్కొన్నట్లు, యేసు బహిరంగంగా, అనేకమంది చూస్తుండగానే అద్భుతాలు చేశాడు. అలా ఆ అద్భుతాలను చూసినవారు బ్రతికి ఉన్న కాలంలోనే మొట్టమొదటి సువార్తలు వ్రాయబడ్డాయి. సువార్త రచయితల నిజాయితీ గురించి, అద్భుతాలు, పునరుత్థానం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా చెబుతోంది: “మత విశ్వాస వ్యాప్తి కోసం చారిత్రక వాస్తవాన్ని అద్భుతాల కథల సాగరంలో కలిపారని సువార్త రచయితలను నిందించడం ఏమాత్రం న్యాయం కాదు . . . వారు నిజాయితీగల రచయితలుగా ఉండాలని కోరుకున్నారు.”

క్రైస్తవత్వాన్ని వ్యతిరేకించిన యూదులు, సువార్తల్లో వర్ణించబడిన అద్భుతకార్యాలను ఎన్నడూ సందేహించలేదు. అవి ఏ శక్తితో చేయబడ్డాయనేది మాత్రమే వారు సందేహించారు. (మార్కు 3:​22-26) ఆ తర్వాత తీవ్రంగా విమర్శించేవారు కూడా యేసు చేసిన అద్భుతాలను కాదనలేకపోయారు. దానికి భిన్నంగా, సా.శ. ఒకటి రెండు శతాబ్దాల్లో, యేసు చేసిన అద్భుతకార్యాలు ప్రస్తావించబడ్డాయి. దీన్నిబట్టి యేసు చేసిన అద్భుతాల గురించిన సువార్త వృత్తాంతాలు నమ్మకమైనవే అనేందుకు అనేక కారణాలున్నాయని స్పష్టమవుతోంది.

అద్భుతాల వెనకున్న వ్యక్తి

యేసు చేసిన అద్భుతాల నమ్మకత్వం గురించిన పరిశీలన తార్కిక వాదాలకే పరిమితమైనట్లయితే అది అసంపూర్ణమే అవుతుంది. సువార్తలు యేసు చేసిన అద్భుతకార్యాల గురించి వర్ణిస్తున్నప్పుడు, గాఢమైన భావాలు, అసమానమైన కనికరం, తోటి మానవుల సంక్షేమం పట్ల అత్యంత శ్రద్ధ ఉన్న ఒక వ్యక్తిని గోచరింపచేస్తాయి.

ఒక కుష్ఠురోగి యేసును ఇలా దీనంగా వేడుకుంటూ సమీపించిన సందర్భాన్ని పరిశీలించండి: “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు.” యేసు “కనికరపడి” తన చెయ్యిచాపి కుష్ఠురోగమున్న ఆ వ్యక్తిని ముట్టుకొని ఇలా అన్నాడు: “నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్ము.” వెంటనే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. (మార్కు 1:​40-42) యేసు ఆ విధంగా, దేవుడిచ్చిన శక్తిని అద్భుతాలు చేయడానికి ఉపయోగించేలా తనను పురికొల్పిన తదనుభూతిని ప్రదర్శించాడు.

నాయీననే ఒక ఊరి బయట యేసుకు ఒక అంత్యక్రియల ఊరేగింపు ఎదురైనప్పుడు ఏమి జరిగింది? చనిపోయిన యువకుడు ఒక విధవరాలికి ఏకైక కుమారుడు. యేసు ఆ స్త్రీ మీద “కనికరపడి” ఆమె దగ్గరకు వెళ్ళి “ఏడువవద్దు” అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన, చనిపోయిన ఆమె కొడుకును బ్రతికించాడు.​—⁠లూకా 7:​11-15.

యేసు చేసిన అద్భుతాల నుండి మనం నేర్చుకోగల ఓదార్పుకరమైన పాఠం ఏమిటంటే, ఆయన “కనికరపడి,” ప్రజలకు సహాయం చేయడానికే పనులు చేశాడు. అయితే అలాంటి అద్భుతాలు కేవలం చరిత్ర కాదు. “యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును” అని హెబ్రీయులు 13:⁠8 చెబుతోంది. ఆయనిప్పుడు పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్నాడు, దేవుడిచ్చిన అద్భుతమైన శక్తులను ఆయన భూమ్మీద మానవునిగా ఉన్నప్పుడు ఉపయోగించినదానికంటే ఎంతో విస్తృతంగా ఉపయోగించే సామర్థ్యంతో సిద్ధంగా ఉన్నాడు. విధేయత చూపించే మానవాళిని స్వస్థపరిచేందుకు ఆయన త్వరలోనే ఆ శక్తులను ఉపయోగిస్తాడు. మీరు భవిష్యత్తులోని ఉజ్వలమైన ఈ అపేక్ష గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు.

[4, 5వ పేజీలోని చిత్రాలు]

యేసు చేసిన అద్భుతాలు “దేవుని మహాత్మ్యమును” తెలిపే ప్రత్యక్ష రుజువులు

[7వ పేజీలోని చిత్రం]

యేసు ప్రగాఢమైన భావాలున్న వ్యక్తి