కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కృతజ్ఞతతో తీసుకోండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి

కృతజ్ఞతతో తీసుకోండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి

కృతజ్ఞతతో తీసుకోండి, మనస్ఫూర్తిగా ఇవ్వండి

ప్రేమగల మన పరలోక తండ్రియైన యెహోవాకు మనలో ప్రతీ ఒక్కరి పట్ల ఎంతో శ్రద్ధ ఉంది. ఆయన తన సేవకులందరి పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడని బైబిలు హామీనిస్తోంది. (1 పేతు. 5:7) తనను నమ్మకంగా సేవించేలా మనకు ఎన్నో విధాలుగా సహాయం అందించి మన పట్ల శ్రద్ధ ఉందని చూపిస్తున్నాడు. (యెష. 48:17) మరిముఖ్యంగా కష్టాలు మనల్ని కృంగదీసినప్పుడు ఆయనిచ్చే సహాయాన్ని తీసుకుని మనం ప్రయోజనం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మోషే ధర్మశాస్త్రంలో చేయబడిన ఏర్పాట్లు పరిశీలిస్తే అది మనకు తెలుస్తుంది.

అనాథలు, విధవరాళ్లు, పరదేశులు వంటి “బీదలకు” సహాయం చేయడానికి ధర్మశాస్త్రంలో యెహోవా ప్రేమతో చక్కని ఏర్పాట్లను చేశాడు. (లేవీ. 19:9, 10; ద్వితీ. 14:29) తన సేవకుల్లో కొంతమందికి తమ తోటి విశ్వాసులు సహాయం అవసరమౌతుందని ఆయనకు తెలుసు. (యాకో. 1:27) అలా సహాయం చేసేవారు యెహోవా ప్రోత్సాహంతోనే చేస్తున్నారు కాబట్టి ఆయన సేవకులెవరూ సహాయం తీసుకోవడానికి అయిష్టత చూపించకూడదు. అయితే మనం సహాయాన్ని మంచి మనసుతో తీసుకోవాలి.

అదే సమయంలో, సహాయం చేసే అవకాశం కూడా దేవుని సేవకులకు వస్తుందని దేవుని వాక్యం చెబుతోంది. యెరూషలేము దేవాలయంలో యేసు చూసిన “బీద విధవరాలు”ను గుర్తుచేసుకోండి. (లూకా 21:1-4) ధర్మశాస్త్రంలో విధవరాళ్ల కోసం యెహోవా చేసిన ఏర్పాట్ల నుండి ఆమె కూడా ప్రయోజనం పొంది ఉంటుంది. ఆమె బీద విధవరాలే అయినా సహాయం తీసుకున్నందుకు కాదుగానీ, ఇచ్చినందుకే ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇచ్చే స్వభావం ఆమెకు సంతోషాన్ని ఇచ్చివుంటుంది. ఎందుకంటే “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు అన్నాడు. (అపొ. 20:35) దీన్ని మనసులో ఉంచుకుని, మీరూ ‘ఇవ్వడంలోని’ ఆనందాన్ని ఎలా పొందవచ్చు?—లూకా 6:38.

‘యెహోవాకు నేనేమి చెల్లించుదును?’

“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” అని కీర్తనకర్త అన్నాడు. (కీర్త. 116:12) యెహోవా ఆయనకు ఎలాంటి ఉపకారాలు చేశాడు? ‘శ్రమల్లో, దుఃఖంలో’ ఉన్నప్పుడు యెహోవా ఆయనను ఆదుకున్నాడు. అంతేకాక యెహావా ‘మరణం నుండి ఆయన ప్రాణాన్ని తప్పించాడు.’ ఇప్పుడు కీర్తనకర్త యెహోవాకు ఎలాగైనా తిరిగి ‘చెల్లించాలనుకున్నాడు’. కీర్తనకర్త ఏమి చెల్లించగలడు? “యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను” అని ఆయన అన్నాడు. (కీర్త. 116:3, 4, 8, 10-14) యెహోవాకు చేసుకున్న మ్రొక్కుబళ్లు తీర్చుకోవాలని, ఆయన ఆజ్ఞలన్నింటిని పాటించాలని కీర్తనకర్త నిర్ణయించుకున్నాడు.

మీరూ అలా చేయవచ్చు. ఎలా? మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని నియమాలనూ సూత్రాలనూ పాటించడం ద్వారా అలా చేయవచ్చు. మీ జీవితంలో అన్నిటికన్నా యెహోవా ఆరాధనకే మొదటి స్థానం ఇచ్చేందుకూ మీరు చేసే ప్రతీ పనిలో దేవుని ఆత్మ నడిపింపును తీసుకునేందుకూ తగిన చర్యలు తీసుకోండి. (ప్రసం. 12:13; గల. 5:16-18) ఆయనకు మీరు ఎంతగా రుణపడివున్నారంటే ఆయనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేరు. అయినప్పటికీ తన సేవకోసం మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా అంకితం చేసుకోవడం చూసినప్పుడు యెహోవా ‘హృదయం సంతోషిస్తుంది.’ (సామె. 27:11) ఇలా యెహోవాను సంతోషపెట్టడం ఎంత గొప్ప అవకాశం!

సంఘ క్షేమాభివృద్ధి కోసం పాటుపడండి

క్రైస్తవ సంఘం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని మీరు ఒప్పుకుంటారు. ఆ సంఘం ద్వారా యెహోవా మనకు సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇస్తున్నాడు. మీరు నేర్చుకున్న సత్యం దేవుని గురించి, ఆయన ఉద్దేశాల గురించి తెలియని పరిస్థితి నుండి, తప్పుడు బోధల నుండి స్వతంత్రుల్ని చేసింది. (యోహా. 8:32) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఏర్పాటు చేసిన సంఘ కూటాల్లో, సమావేశాల్లో పరదైసు భూమిపై కష్టాలు, బాధలు ఉండని నిరంతర జీవితం పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకున్నారు. (మత్త. 24:45-47) ఆ సంఘం వల్ల మీరు ఇప్పటికే అనుభవిస్తున్న, భవిష్యత్తులో అనుభవించబోయే ఆశీర్వాదాలన్నిటిని లెక్కపెట్టడం అసలు సాధ్యమేనా? ఆలోచించండి. మీరు సంఘానికి తిరిగి ఏమి ఇవ్వగలరు?

“సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (ఎఫె. 4:15, 16) అది ముఖ్యంగా అభిషిక్త క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా దానిలోని సూత్రం మన కాలంలోని క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. అందుకే సంఘ క్షేమాభివృద్ధి, అభివృద్ధి కోసం సంఘంలోని ప్రతీ ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. అది ఎలా చేయగలం?

దేవుని సేవను మరింత చేసేలా ఇతరులను ప్రోత్సహించడానికి, బలపర్చడానికి మనం ఎప్పుడూ కృషి చేయడం ద్వారా మనం అలా సహాయం చేయవచ్చు. (రోమా. 14:19) మన తోటి విశ్వాసులతో వ్యవహరించే ప్రతీసారి ఆత్మఫలంలోని లక్షణాలు చూపించడానికి ప్రయత్నించడం ద్వారా కూడా ‘శరీర అభివృద్ధికి’ పాటుపడవచ్చు. (గల. 5:22, 23) అంతేకాక అవకాశం దొరికినప్పుడల్లా ‘అందరికి, విశేషముగా విశ్వాస గృహానికి చెందినవారికి మేలు చేయడానికి’ ప్రయత్నించవచ్చు. (గల. 6:10; హెబ్రీ. 13:16) సంఘంలోని ప్రతీ ఒక్కరూ అంటే సహోదరులు సహోదరీలూ, పిల్లలు పెద్దలూ అనే తేడా లేకుండా అందరూ ‘ప్రేమయందు శరీరమునకు క్షేమాభివృద్ధి కలిగేలా’ పాటుపడొచ్చు.

అంతేకాక మన నైపుణ్యాలను, వనరులను, శక్తిసామర్థ్యాలను సంఘంతో కలిసి ప్రకటనా పని చేయడానికి ఉపయోగించవచ్చు. మీరు “ఉచితంగా పొందితిరి” అని యేసుక్రీస్తు అన్నాడు. మరి మనమేమి చేయాలి? ‘ఉచితంగా ఇవ్వాలి’ అని ఆయన చెప్పాడు. (మత్త. 10:8) అందుకే, ప్రాముఖ్యమైన రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో చేయగలిగినదంతా చేయండి. (మత్త. 24:14; 28:19, 20) మీరు ఈ పనిని ఎక్కువగా చేయలేకపోతున్నారా? యేసు చెప్పిన బీద విధవరాల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆమె ఇతరులకన్నా తక్కువే ఇచ్చింది. అయినా ఆమె వారందరికన్నా ఎక్కువ ఇచ్చిందని యేసు అన్నాడు. ఆమె ఇవ్వగలిగినదంతా ఇచ్చింది కాబట్టి యేసు ఆ మాట అన్నాడు.—2 కొరిం. 8:1-5, 12.

మంచి మనసుతో సహాయం తీసుకోండి

కొన్నిసార్లు మీకు సంఘ సహాయం అవసరం కావచ్చు. ఈ లోక ఒత్తిళ్లను ఎదుర్కోవడం మీకు కష్టమనిపించినప్పుడు సంఘ సహాయాన్ని తీసుకోవడానికి ఎప్పుడూ సంకోచించకండి. మీకు కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మీకు సహాయం చేయడానికి ‘సంఘమును కాసే’ అర్హులైన, శ్రద్ధగల సహోదరులను యెహోవా ఏర్పాటుచేశాడు. (అపొ. 20:28) మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పెద్దలూ సంఘంలోని ఇతరులూ మిమ్మల్ని ఓదార్చి, మీకు కావాల్సిన సహాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటారు.—గల. 6:2; 1 థెస్స. 5:14.

అయితే, మీరు మంచి మనసుతో సహాయాన్ని తీసుకోవడానికి కృషి చేయండి. సహోదరులు మీకు సహాయం చేసినప్పుడు మీరు ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపించండి. అలా దేవుడే మీ సహోదరుల ద్వారా తన కృపను చూపిస్తున్నాడని గుర్తించండి. (1 పేతు. 4:10) అలా ఎందుకు కృతజ్ఞత చూపించాలి? చేసిన మేలు మర్చిపోయే లోకస్థుల్లా మనం ఉండకూడదు కాబట్టి కృతజ్ఞత చూపించాలి.

ఎక్కువ ఆశించకుండా సమతుల్యంగా ఉండండి

పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రికలో తిమోతి గురించి చెబుతూ “మీ క్షేమవిషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడెవడును నాయొద్ద లేడు” అని అన్నాడు. కానీ ఆయన ‘అందరును తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడడంలేదు’ అని కూడా రాశాడు. (ఫిలి. 2:20, 21) పౌలు చెప్పిన ఈ తీవ్రమైన లోపాన్ని మనసులో ఉంచుకొని మనం ‘సొంత కార్యాల్లో’ మునిగిపోకుండా ఎలా ఉండొచ్చు?

మనం సమస్యల్లో ఉన్నప్పుడు సంఘంలోని ఇతరులు తప్పనిసరిగా మనకోసం సమయాన్నిచ్చి, శ్రద్ధ చూపించాలని ఎన్నడూ కోరుకోకూడదు. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. మనం ఎంతో అవసరంలో ఉన్నప్పుడు మనకు ఏ సహోదరుడైన ఆర్థిక సహాయం చేస్తే ఆ సహాయానికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత చూపిస్తాం. కానీ ఆయన అలా తప్పకుండా ఆర్థిక సహాయం చేయాలని అడుగుతామా? అలా ఎప్పుడూ అడగం. అలాగే మనకు సహాయం చేయడానికి సహోదరులు ఎప్పుడూ సంతోషంగా ముందుకొస్తారు. అయినప్పటికి వారు మన కోసం ఎక్కువ సమయం కేటాయించాలని ఆశించకూడదు. ఎంతైనా కష్టకాలాల్లో మనకు మన తోటి సహోదరులు ఇష్టపూర్వకంగా సహాయం చేయాలని కోరుకుంటాం.

నిస్సందేహంగా, మీ క్రైస్తవ సహోదరసహోదరీలు మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటారు. అయినా కొన్నిసార్లు వారు మీకు కావాల్సిన సహాయం చేయలేకపోవచ్చు. మీకు వారు సహాయం చేయలేకపోయినా ఎలాంటి కష్టాల్లోనైనా యెహోవా మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి. ఆయన కీర్తనకర్తకు అలాగే సహాయం చేశాడు.—కీర్త. 116:1, 2; ఫిలి. 4:10-13.

కాబట్టి, యెహోవా మీ కోసం చేసిన ఏర్పాట్లన్నిటిని కృతజ్ఞతతో అంగీకరించడానికి వెనకాడకండి. ముఖ్యంగా ఇబ్బందుల్లో, కృంగదీసే పరిస్థితుల్లో అలా చేయండి. (కీర్త. 55:22) మీరు దాన్ని అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాక మీరు ‘ఉత్సాహంగా ఇవ్వాలని’ కూడా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి సత్యారాధనకు మద్దతు ఇవ్వడానికి మీ పరిస్థితులు అనుకూలించినంతవరకు మీ “హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము” ఇవ్వండి. (2 కొరిం. 9:6, 7) ఆ విధంగా చేసినప్పుడు, మీరు కృతజ్ఞతతో తీసుకుని, మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతారు.

[31వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

“యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?”—కీర్త. 116:12

▪ అవకాశం దొరికినప్పుడల్లా ‘అందరికి, మేలు చేయండి’

▪ ఇతరులను ప్రోత్సహించండి, బలపర్చండి

▪ మీ పరిస్థితులు అనుమతించినంతవరకు శిష్యులను చేసే పనిలో చేయగలిగినదంతా చేయండి