కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దుర్దినములు రాకముందే యెహోవాను సేవించండి

దుర్దినములు రాకముందే యెహోవాను సేవించండి

“నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”ప్రసం. 12:1, 2.

1, 2. (ఎ) యౌవనులకు సొలొమోను ఏ సలహా ఇచ్చాడు? (బి) వయసు పైబడిన వాళ్లకు కూడా ఆ సలహా ఎందుకు ప్రయోజనకరం?

 “దుర్దినములు రాకముందే . . . నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని దైవ ప్రేరేపణతో సొలొమోను రాజు యౌవనులకు చెప్పాడు. ఏమిటా “దుర్దినములు”? వృద్ధాప్యంలో ఉండే కష్టాల గురించి అంటే, వణుకుతున్న కాళ్లు-చేతులు, ఊడిపోతున్న పళ్లు, మందగిస్తున్న చూపు, తగ్గిపోతున్న వినికిడి శక్తి, తెల్లబడుతున్న జుట్టు, వంగిపోతున్న నడుము వంటివాటి గురించి సొలొమోను అలంకారిక భాషలో వివరించాడు. అందుకే, యౌవనంలో ఉన్నప్పుడే మన గొప్ప సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని సొలొమోను ప్రోత్సహించాడు.—ప్రసంగి 12:1-5 చదవండి.

2 చాలామంది క్రైస్తవులు 50 ఏళ్ల వయసులో లేదా అంతకన్నా పెద్ద వయసులో కూడా బలంగానే ఉంటారు. వాళ్లకు జుట్టు కాస్త నెరసినా, సొలొమోను వివరించిన అనారోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని సొలొమోను యౌవనులకు ఇచ్చిన సలహా నుండి అలాంటివాళ్లు ఏమైనా ప్రయోజనం పొందగలరా? ఆ సలహా అర్థమేమిటి?

3. గొప్ప సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏమిటి?

3 మనం ఎన్నో ఏళ్లుగా యెహోవాను సేవిస్తున్నప్పటికీ, అప్పుడప్పుడు కాస్త ఆగి మన సృష్టికర్త గొప్పతనం గురించి ఆలోచించడం మంచిది. అసలు మన జీవమే ఒక అద్భుత బహుమానం! జీవంలోని సంశ్లిష్టత మానవ మేదస్సుకు అంతుచిక్కనిది. మనం జీవితాన్ని ఆస్వాదించడానికి కావాల్సినవాటినీ ఆయన సమృద్ధిగా దయచేశాడు. యెహోవా సృష్టి గురించి ఆలోచించినప్పుడు, ఆయన ప్రేమ, జ్ఞానం, శక్తి మీద మనకున్న కృతజ్ఞత రోజురోజుకీ పెరుగుతుంది. (కీర్త. 143:5) అలాగే, మన గొప్ప సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడంలో ఆయనపట్ల మనకున్న బాధ్యతల గురించి ఆలోచించడం కూడా ఉంది. అలా ఆలోచిస్తే, బ్రతికినంతకాలం వీలైనంత ఎక్కువగా సృష్టికర్తను సేవిస్తూ ఆయనపట్ల కృతజ్ఞత చూపిస్తాం.—ప్రసం. 12:13.

జీవితపు మలినాళ్లలో ఉండే ప్రత్యేక అవకాశాలు

4. అనుభవజ్ఞులైన క్రైస్తవులు ఏ ప్రశ్న వేసుకోవాలి? ఎందుకు?

4 మీరు ఇప్పటికే జీవితంలో దశాబ్దాల అనుభవం గడించివుంటే ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకోండి: ‘ప్రస్తుతం ఆరోగ్యంగా, బలంగా ఉన్న నేను నా జీవితాన్ని ఎలా ఉపయోగిస్తాను?’ ఒక అనుభవజ్ఞుడైన క్రైస్తవునిగా ఇతరులకు లేని కొన్ని అవకాశాలు మీకు ఉన్నాయి. యెహోవా నుండి మీరు నేర్చుకున్న విషయాలు యౌవనులతో పంచుకోవచ్చు. దేవుని సేవలో మీరు సొంతం చేసుకున్న మంచి అనుభవాలను చెప్పి ఇతరులను బలపర్చవచ్చు. దావీదు రాజు, అలాంటి అవకాశాల కోసం వేడుకుంటూ ఇలా ప్రార్థించాడు: “దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి . . . దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండువరకు నన్ను విడువకుము.”—కీర్త. 71:17, 18.

5. వయసు పైబడిన క్రైస్తవులు తాము నేర్చుకున్నవి యౌవనులతో ఎలా పంచుకోవచ్చు?

5 సంవత్సరాలుగా మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చు? యౌవన క్రైస్తవులను మీ ఇంటికి ఆహ్వానించి మీరు వాళ్లను ప్రోత్సహించగలరా? యెహోవా సేవలో మీరు పొందే ఆనందాన్ని ఇతరులు చూడగలిగేలా వాళ్లతో కలిసి పరిచర్య చేయడం మీకు వీలవుతుందా? ప్రాచీనకాల ఏలీహు ఇలా అన్నాడు: “వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్యగల యేండ్లు జ్ఞానము బోధింపతగును.” (యోబు 32:7) అనుభవజ్ఞులైన క్రైస్తవ స్త్రీలు తమ మాటలతో, ప్రవర్తనతో ఇతరులను ప్రోత్సహించాలని అపొస్తలుడైన పౌలు ఉపదేశించాడు. ఆయనిలా రాశాడు: ‘వృద్ధ స్త్రీలు మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి.’—తీతు 2:3-5.

మీరు ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చు?

6. దశాబ్దాల అనుభవం ఉన్న క్రైస్తవులు తమ సామర్థ్యాన్ని ఎందుకు తక్కువ అంచనా వేయకూడదు?

6 మీరు అనుభవజ్ఞులైన క్రైస్తవులైతే, మీకు ఎంతో సామర్థ్యం ఉన్నట్లే. సుమారు 30, 40 ఏళ్ల క్రితం మీకు అర్థంకాని విషయాలు ఇప్పుడు ఎంత బాగా అర్థంచేసుకుంటున్నారో ఆలోచించండి. బైబిలు సూత్రాలను జీవితంలోని వివిధ పరిస్థితుల్లో ఎలా అన్వయించాలో మీకు తెలుసు. ఇతరుల హృదయాన్ని చేరుకునేలా బైబిలు సత్యం గురించి మాట్లాడే సామర్థ్యం కూడా మీకు ఉండేవుంటుంది. ఒకవేళ మీరు ఓ పెద్ద అయితే, ‘తప్పిదంలో చిక్కుకున్న’ సహోదరులకు ఎలా సహాయం చేయాలో మీకు తెలిసుంటుంది. (గల. 6:1) సంఘ కార్యక్రమాల్ని, సమావేశంలో విభాగాల్ని లేదా రాజ్యమందిర నిర్మాణ పనిని ఎలా పర్యవేక్షించాలో మీరు బహుశా నేర్చుకుని ఉంటారు. రక్తం లేకుండా చికిత్స చేసేలా డాక్టర్లను ఒప్పించడం కూడా మీకు తెలిసుండవచ్చు. ఒకవేళ మీరు ఈ మధ్యే సత్యం తెలుసుకున్నా, జీవితంలో మాత్రం విలువైన అనుభవం గడించివుంటారు. ఉదాహరణకు, మీరు పిల్లల్ని పెంచివుంటే, ఎన్నో మెళకువలు మీకు తెలిసుంటాయి. వయసు పైబడ్డ క్రైస్తవులు బోధిస్తూ, నడిపిస్తూ, బలపరుస్తూ యెహోవా ప్రజలను ప్రోత్సహించవచ్చు.—యోబు 12:12 చదవండి.

7. వయసు పైబడ్డ క్రైస్తవులు యువతీయువకులకు ఎలాంటి శిక్షణ ఇవ్వవచ్చు?

7 మీకున్న సామర్థ్యాన్ని మరింత ఎక్కువగా ఎలా ఉపయోగించవచ్చు? బైబిలు అధ్యయనాలు ఎలా చేయాలో మీరు యౌవనులకు చూపించవచ్చు. మీరు ఒకవేళ సహోదరీలైతే, తమ చంటిబిడ్డల్ని చూసుకుంటూనే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో చురుగ్గా ఎలా పాల్గొనాలో తల్లులకు సలహాలు ఇవ్వవచ్చు. మీరు సహోదరులైతే, ఉత్సాహంగా ఎలా ప్రసంగించాలో, సమర్థవంతంగా ఎలా ప్రకటించాలో యువకులకు నేర్పించగలరా? వయసుమళ్లిన సహోదరసహోదరీలను సందర్శించి, ఎలా ప్రోత్సహించాలో వాళ్లకు చూపించగలరా? మీకు ఇంతకుముందున్నంత శక్తి లేకపోయినా యువతీయువకులకు శిక్షణనిచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. బైబిలు ఇలా చెబుతుంది: “యౌవనస్థుల బలము వారికి అలంకారము తలనెరపు వృద్ధులకు సౌందర్యము.”—సామె. 20:29.

అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవ చేయడం

8. అపొస్తలుడైన పౌలు వయసు పైబడుతున్నా ఏమి చేశాడు?

8 అపొస్తలుడైన పౌలు, వయసు పైబడుతున్న సంవత్సరాల్లో కూడా పూర్తి సామర్థ్యంతో దేవుని సేవ చేశాడు. దాదాపు సా.శ. 61లో, రోములోని చెరసాల నుండి విడుదలైన పౌలు, అప్పటికే ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి చాలా సంవత్సరాలు మిషనరీ సేవ చేశాడు. పౌలు కావాలనుకుంటే రోములోనే ప్రకటిస్తూ ప్రశాంతంగా జీవించగలిగేవాడే. (2 కొరిం. 11:23-27) ఆ నగరంలోని సహోదరులు కూడా పౌలు ఇచ్చిన సహకారాన్ని ఖచ్చితంగా ఎంతో విలువైనదిగా పరిగణించివుంటారు. అయితే, వేరే దేశాల్లో ఇంకా ఎక్కువ అవసరముందని పౌలు గమనించాడు. దాంతో ఆయన తీతు, తిమోతిలతో కలిసి తన మిషనరీ యాత్రను తిరిగి మొదలుపెట్టి ముందు ఎఫెసుకు తర్వాత క్రేతుకు, ఆ తర్వాత బహుశా మాసిదోనియాకు ప్రయాణించాడు. (1 తిమో. 1:3, 4; తీతు 1:5) ఆయన స్పెయిన్‌కు కూడా వెళ్లాలనుకున్నాడు కానీ ఖచ్చితంగా వెళ్లాడో లేదో మనకు తెలియదు.—రోమా. 15:23-24, 28.

9. అవసరం ఎక్కువున్న ప్రాంతానికి పేతురు ఏ వయసులో వెళ్లివుండవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 పేతురు విషయానికొస్తే, అవసరం ఎక్కువున్న ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్లినప్పుడు ఆయన వయసు 50 ఏళ్ల పైనే ఉండవచ్చు. ఆ విషయం మనకెలా తెలుసు? ఒకవేళ పేతురు వయసులో యేసుకు సమానుడైనా లేదా కొంచెం పెద్దవాడైనా, సా.శ. 49లో యెరూషలేములోని మిగతా అపొస్తలులను కలుసుకున్న సమయానికి ఆయనకు దాదాపు 50 ఏళ్లు ఉంటాయి. (అపొ. 15:6, 7) అలా కలుసుకున్న కొద్దికాలానికి, పేతురు బబులోనులో పెద్ద సంఖ్యలో ఉన్న యూదులకు ప్రకటించడానికి వెళ్లాడు. (గల. 2:8, 9) ఆయన అక్కడే నివసిస్తూ, దాదాపు సా.శ. 62లో తన మొదటి పత్రిక రాశాడు. (1 పేతు. 5:13) పరాయి దేశంలో నివసించడం కష్టమే అయినా, యెహోవాను ఎక్కువగా సేవించడంలోని ఆనందానికి తన వయసు అడ్డురాకుండా పేతురు చూసుకున్నాడు.

10, 11. జీవితపు మలినాళ్లలో అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు తరలివెళ్లిన ఓ అనుభవం చెప్పండి.

10 నేడు కూడా, 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న చాలామంది క్రైస్తవులు పరిస్థితులు మారడం వల్ల యెహోవాను సరికొత్త విధానాల్లో సేవించగలుగుతున్నారు. కొంతమంది అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవచేస్తున్నారు. అలా వెళ్లిన వాళ్లలో ఒకరైన రాబర్ట్‌ ఇలా రాశాడు: “యెహోవా సేవలో మాకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, సుమారు 55 ఏళ్ల వయసులో నేనూ నా భార్యా గుర్తించాం. మా ఒక్కగానొక్క కొడుకు వేరే చోట ఉంటున్నాడు, వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూడా ఇక లేదు. పైగా మాకు కొంత ఆస్తి ఉంది. మా ఇంటిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో అప్పులను తీర్చడంతోపాటు, పెన్షన్‌ వచ్చేంతవరకు మా అవసరాలను తీర్చుకోవచ్చని లెక్కవేశాను. బొలీవియా దేశంలో చాలామంది బైబిలు అధ్యయనాలను అంగీకరిస్తున్నారని, పైగా అక్కడ తక్కువ డబ్బుతో జీవించవచ్చని విన్నాం. దాంతో అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆ కొత్త ప్రాంతానికి అలవాటు పడడం మొదట్లో కష్టమనిపించింది. ఉత్తర అమెరికాలో మేము అలవాటుపడ్డ జీవితానికీ ఇక్కడి జీవితానికీ అన్నివిషయాల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. కానీ మేము పడ్డ శ్రమకు మంచి ప్రతిఫలం దక్కింది.”

11 రాబర్ట్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “ఇప్పుడు మేము ఎక్కువ సమయం సంఘానికి సంబంధించిన పనుల్లోనే గడుపుతున్నాం. మేము బైబిలు అధ్యయనాలు చేసిన కొంతమంది బాప్తిస్మం కూడా తీసుకున్నారు. మేము చాలా కిలోమీటర్ల దూరంలోని ఒక గ్రామంలో నివసించే ఓ పేద కుటుంబంతో అధ్యయనం చేశాం. ఆ కుటుంబ సభ్యులు ప్రతీవారం చాలా కష్టపడి ప్రయాణించి పట్టణంలో జరిగే కూటాలకు హాజరయ్యేవాళ్లు. ఆ కుటుంబం ప్రగతి సాధించడం చూసినప్పుడు, ముఖ్యంగా వాళ్ల పెద్దబ్బాయి పయినీరు సేవ చేపట్టినప్పుడు మాకు ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేము.”

వేరే భాషా క్షేత్రాల్లో అవసరం

12, 13. రిటైర్‌ అయ్యాక కొత్త విధానంలో యెహోవా సేవ చేసిన ఓ అనుభవాన్ని చెప్పండి.

12 వయసు పైబడిన సహోదరసహోదరీల ఆదర్శాన్ని చూసి వేరే భాషా సంఘాలు, గుంపులు ఎంతో ప్రయోజనం పొందుతాయి. అంతేకాకుండా, అలాంటి క్షేత్రాల్లో పనిచేయడం చాలా ఆనందాన్నిస్తుంది. ఉదాహరణకు, బ్రయిన్‌ అనే సహోదరుడు ఇలా రాశాడు: “65 ఏళ్లప్పుడు రిటైర్‌ అయ్యాక, మా జీవితం చప్పగా సాగుతుందని నాకూ నా భార్యకూ అనిపించింది. మా పిల్లలు వేరేచోట ఉంటున్నారు. బైబిలు అధ్యయనాలు పెద్దగా దొరికేవి కావు. అయితే ఒక రోజు, స్థానిక విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న ఓ చైనా యువకుడిని కలిసి మాట్లాడి, కూటాలకు ఆహ్వానించాను. అతనితో బైబిలు అధ్యయనం కూడా ప్రారంభించాను. అతను కొన్ని వారాల తర్వాత, చైనా దేశస్థుడైన తన తోటి ఉద్యోగిని కూటాలకు తీసుకొచ్చాడు. రెండు వారాల తర్వాత మరో వ్యక్తిని ఆ తర్వాత ఇంకో వ్యక్తిని కూడా తీసుకొచ్చాడు.”

13 “అలా వచ్చిన ఐదవ చైనా వ్యక్తి బైబిలు అధ్యయనం కావాలని అడిగినప్పుడు, ‘65 ఏళ్లు వచ్చినంత మాత్రాన యెహోవా సేవలో రిటైర్‌ కానక్కర్లేదు’ అని నాకనిపించింది. దాంతో 63 ఏళ్ల నా భార్యతో మాట్లాడి, ఆమె చైనీస్‌ భాష నేర్చుకోవడానికి ఇష్టపడుతుందేమో అడిగాను. రికార్డ్‌ చేయబడిన చైనీస్‌ భాషా కోర్సు సహాయంతో దాన్ని నేర్చుకున్నాం. అది జరిగి పదేళ్లు గడిచాయి. వేరే భాషా క్షేత్రంలో పరిచర్య చేయడం వల్ల మేము మళ్లీ యౌవనులమైనట్లు అనిపించింది. ఇప్పటివరకు మేము 112 మంది చైనా దేశస్థులతో బైబిలు అధ్యయనం చేశాం. వాళ్లలో చాలామంది కూటాలకు హాజరయ్యారు. వాళ్లలో ఒకామె ఇప్పుడు పయినీరుగా సేవచేస్తోంది.”

మీ వయసు ఎంతైనా మీ పరిచర్యను విస్తృతపర్చుకోవచ్చు (12, 13 పేరాలు చూడండి)

చేయగలిగేవి ఆనందంగా చేయండి

14. వయసు పైబడినవాళ్లు ఏ విషయంలో సంతోషంగా ఉండవచ్చు? పౌలు ఆదర్శం వాళ్లకెందుకు ప్రోత్సాహకరంగా ఉంది?

14 అయితే, కొత్తకొత్త మార్గాల్లో యెహోవా సేవ చేయడం 50 ఏళ్లు దాటిన కొంతమంది క్రైస్తవులకు కుదరకపోవచ్చు. వాళ్లకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉండవచ్చు లేదా వాళ్ల మీద ఆధారపడ్డ పిల్లలు ఉండవచ్చు. అయితే, తన సేవలో ఏమి చేసినా యెహోవా మెచ్చుకుంటాడనే విషయం తెలుసుకుని మీరు సంతోషంగా ఉండవచ్చు. కాబట్టి, మీరు చేయలేని వాటి గురించి ఆందోళన పడకుండా, చేయగలిగేవి ఆనందంగా చేయండి. అపొస్తలుడైన పౌలు గురించి ఒకసారి ఆలోచించండి. సంవత్సరాలపాటు గృహ నిర్బంధంలో ఉండడం వల్ల ఆయన మిషనరీ ప్రయాణాలు ఆపేయాల్సివచ్చింది. కానీ, తనను చూడడానికి వచ్చిన ప్రజలతో లేఖనాల గురించి మాట్లాడుతూ వాళ్ల విశ్వాసాన్ని బలపర్చాడు.—అపొ. 28:16, 30, 31.

15. వయసు పైబడిన క్రైస్తవులు ఎందుకు నిజంగా విలువైనవాళ్లు?

15 వయసు పైబడినవాళ్లు తన సేవలో చేస్తున్న కృషిని యెహోవా ఎంతో అమూల్యంగా ఎంచుతాడు. ‘దుర్దినాల్లో’ యెహోవా సేవ చేయడం అంత సులభం కాదని సొలొమోను ఒప్పుకున్నాడు, అయినా తన నామాన్ని స్తుతించడానికి అలాంటివాళ్లు చేసే ప్రతీ పనిని యెహోవా గమనిస్తాడని బైబిలు చెబుతుంది. (లూకా 21:2-4) చాలా కాలంగా సేవచేస్తున్న ఈ నమ్మకమైన సేవకుల మాదిరిని సంఘంలోని వాళ్లు ఎంతగానో ప్రశంసిస్తారు.

16. వృద్ధురాలైన అన్నకు ఏ అవకాశాలు దొరకలేదు? అయినా దేవుని ఆరాధించడానికి ఆమె ఏమి చేయగలిగింది?

16 అన్న అనే స్త్రీ వృద్ధాప్యంలో కూడా యెహోవాను నమ్మకంగా స్తుతించిందని బైబిలు చెబుతుంది. యేసు పుట్టినప్పుడు ఆమె 84 ఏళ్ల విధవరాలు. యేసు పెద్దవాడై పరిచర్య మొదలుపెట్టక ముందే ఆమె చనిపోయింది. దాంతో, యేసు శిష్యురాలయ్యే, పరిశుద్ధాత్మతో అభిషేకించబడే, రాజ్య సువార్త ప్రకటించే అవకాశాలు ఆమెకు దొరకలేదు. అయినా, అన్న చేయగలిగినదంతా సంతోషంగా చేసింది. ఆమె, “దేవాలయము విడువక . . . రేయింబగళ్లు సేవచేయుచుండెను.” (లూకా 2:36, 37) యాజకుడు ఆలయంలో ఉదయం, సాయంత్రం ధూపం వేసే సమయాల్లో, అన్న ఆవరణలో ఉండి మౌనంగా దాదాపు అరగంటసేపు ప్రార్థించేది. ఆమె పసివాడైన యేసును చూసి, “యెరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను.”—లూకా 2:38.

17. వయసు పైబడిన లేక అనారోగ్యంతో ఉన్న క్రైస్తవులు సత్యారాధనలో భాగంవహించేలా మనం ఎలా సహాయం చేయవచ్చు?

17 వయసు పైబడిన లేక అనారోగ్యంతో ఉన్న క్రైస్తవులకు సహాయం అందించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాంటి కొంతమంది సంఘ కూటాలకు, సమావేశాలకు హాజరవ్వాలని ఎంతగానో కోరుకుంటారు కానీ హాజరవ్వలేని స్థితిలో ఉండవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, వయసు పైబడినవాళ్లు టెలిఫోన్‌ సహాయంతో కూటాల్లోని కార్యక్రమాలు వినేలా సంఘాలు ప్రేమతో ఏర్పాటుచేస్తాయి. ఇతర ప్రాంతాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అయితే, కూటాలకు హాజరుకాలేని అలాంటి క్రైస్తవులు కూడా సత్యారాధనకు మద్దతివ్వవచ్చు. ఉదాహరణకు, వాళ్లు చేసే ప్రార్థనలు క్రైస్తవ సంఘం వర్ధిల్లడానికి తోడ్పడతాయి.—కీర్తన 92:13, 15 చదవండి.

18, 19. (ఎ) ఇతరులను తాము ఎంతగా ప్రోత్సహిస్తున్నారో వయసు పైబడిన క్రైస్తవులు ఎందుకు గుర్తించలేకపోవచ్చు? (బి) “నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అనే సలహాను ఎవరు పాటించవచ్చు?

18 తమ ఆదర్శం చూసి ఇతరులు ఎంతగా ప్రోత్సాహం పొందుతారో వయసు పైబడిన క్రైస్తవులు గ్రహించకపోవచ్చు. ఉదాహరణకు, సంవత్సరాలపాటు ఆలయంలో నమ్మకంగా సేవచేసిన అన్న విషయానికొస్తే, తన ఆదర్శం శతాబ్దాల తర్వాత కూడా ఇతరుల్ని ప్రోత్సహిస్తుందని ఆమెకు తెలియదు. ఆమె యెహోవాను ఎంత ప్రేమించిందో బైబిలులో నమోదైంది. దేవుని మీద మీరు చూపించే ప్రేమ కూడా తోటి ఆరాధకుల హృదయాల నుండి ఎన్నడూ చెరిగిపోదు. అందుకే బైబిలు ఇలా చెబుతుంది: “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును.”—సామె. 16:31.

19 యెహోవా సేవలో మనందరం చేయగలవాటికి కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే వయసు పైబడుతున్నా ఇంకా సత్తువ, బలం ఉన్న క్రైస్తవులు ఈ మాటల్ని గుర్తుపెట్టుకోవాలి: “దుర్దినములు రాకముందే . . . నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.”—ప్రసం. 12:1, 2.