కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు సాతానుతో పోరాడి—గెలవగలరు!

మీరు సాతానుతో పోరాడి—గెలవగలరు!

“విశ్వాసమందు స్థిరులై వానిని [సాతానును] ఎదిరించుడి.”1 పేతు. 5:9.

1. (ఎ) సాతానుతో పోరాడడం ఇప్పుడు ఎందుకంత ప్రాముఖ్యం? (బి) మనం సాతానుతో పోరాడి గెలవగలమని ఎందుకు చెప్పవచ్చు?

 సాతాను భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులతో, ‘వేరే గొర్రెలతో’ యుద్ధం చేస్తున్నాడు. (యోహా. 10:16) తనకు మిగిలిన కొంచెం సమయంలోనే వీలైనంత ఎక్కువమంది యెహోవా సేవకుల విశ్వాసాన్ని పాడుచేయాలని సాతాను చూస్తున్నాడు. (ప్రకటన 12:9, 12 చదవండి.) కానీ మనం సాతానుతో పోరాడి గెలవగలం. ఎందుకంటే బైబిలు ఇలా చెప్తుంది, “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”—యాకో. 4:7.

2, 3. (ఎ) ప్రజలు తన ఉనికిని సందేహించాలని సాతాను ఎందుకు కోరుకుంటున్నాడు? (బి) సాతాను నిజంగా ఉన్నాడని మీకెలా తెలుసు?

2 అసలు సాతాను ఉన్నాడన్న విషయాన్నే చాలామంది కొట్టిపారేస్తారు. సాతాను, దయ్యాలు కేవలం నవలల్లో, సినిమాల్లో, వీడియో గేముల్లో తప్ప నిజంగా ఉండరని వాళ్లు అనుకుంటారు. దుష్ట శక్తులు ఉన్నాయని తెలివైనవాళ్లెవరూ నమ్మరని వాళ్ల అభిప్రాయం. అలా ప్రజలు తన ఉనికిని, దయ్యాల ఉనికిని సందేహించినప్పుడు సాతాను ఏమైనా బాధపడతాడా? లేదు. నిజానికి, అలాంటి సందేహాలున్న వాళ్లను మోసగించడం సాతానుకు ఇంకా తేలిక. (2 కొరిం. 4:4) ప్రజల్ని మోసం చేయడానికి సాతాను అలాంటి ఆలోచనలనే ప్రోత్సహిస్తాడు.

3 అయితే, యెహోవా సేవకులమైన మనం మోసపోం. ఎందుకంటే, సాతాను నిజంగా ఉన్నాడని మనకు తెలుసు. ఓ పాము ద్వారా హవ్వతో సాతానే మాట్లాడాడని బైబిలు చెప్తుంది. (ఆది. 3:1-5) అంతేకాదు, యోబు ఉద్దేశాలను ప్రశ్నిస్తూ అతను యెహోవాను నిందించాడు. (యోబు 1:9-12) పైగా, యేసును శోధించడానికి ప్రయత్నించింది కూడా సాతానే. (మత్త. 4:1-10) అంతేకాదు, 1914⁠లో యేసు రాజైన తర్వాత, సాతాను భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులతో ‘యుద్ధం చేయడం’ మొదలుపెట్టాడు. (ప్రక. 12:17) అభిషిక్తుల, వేరేగొర్రెల విశ్వాసాన్ని పాడుచేయాలని ప్రయత్నిస్తూ సాతాను వాళ్లతో ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధంలో గెలవాలంటే, మనం సాతానుతో పోరాడాలి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. మనం ఏయే విషయాల్లో సాతానుతో పోరాడాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

గర్వాన్ని విడిచిపెట్టండి

4. సాతాను అహంకారానికి మారుపేరు అని ఎందుకు చెప్పవచ్చు?

4 సాతాను అహంకారానికి పెట్టిందిపేరు. ఓ దూత, దేవుని పరిపాలనా హక్కునే సవాలు చేసి, తనను తాను దేవుడిగా చేసుకున్నాడంటే, అతనికి ఎంత గర్వం, అహంకారం ఉందో తెలుస్తుంది. కాబట్టి, మనం సాతానును ఎదిరించే ఓ మార్గం, గర్వాన్ని విడిచిపెట్టి, వినయంగా ఉండడం. (1 పేతురు 5:5 చదవండి.) ఇంతకీ గర్వం అంటే ఏమిటి? అసలు ఎప్పుడూ గర్వపడకూడదా?

5, 6. (ఎ) అసలు ఎప్పుడూ గర్వపడకూడదా? వివరించండి. (బి) ఎలాంటి గర్వం ప్రమాదకరం? అలాంటి గర్వం చూపించినవాళ్ల ఏ ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి?

5 గర్వం అంటే మనమీద మనకు నమ్మకం, గౌరవం ఉండడమని ఓ డిక్షనరీ చెప్తుంది. అంతేకాక ‘మనం, మన సన్నిహితులు చేసిన మంచి పనుల వల్ల లేదా కలిగివున్న మంచివాటి వల్ల మనకుండే ఓ రకమైన సంతృప్తే’ గర్వమని ఆ డిక్షనరీ చెప్తుంది. అలా భావించడంలో తప్పేమీ లేదు. పౌలు కూడా ఓ సందర్భంలో ఇలా చెప్పాడు, “మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము [“గర్వపడుతున్నాము,” NW].” (2 థెస్స. 1:4) కాబట్టి ఇతరులు చేసినవాటిని బట్టి సంతోషించడం లేదా మన విషయంలో కాస్త గర్వపడడం మంచిదే. మన కుటుంబం, సంస్కృతి, మనం పెరిగిన ప్రాంతం విషయంలో కొంచెం గర్వపడడంలో కూడా తప్పు లేదు.—అపొ. 21:39.

6 అయితే, మరో విధమైన గర్వం ప్రమాదకరమైనది. అది ఇతరులతో ముఖ్యంగా యెహోవాతో మన స్నేహాన్ని పాడుచేయగలదు. ఇలాంటి గర్వం ఉన్నవాళ్లు, ఇతరులు ఏదైనా సలహా ఇస్తే కోప్పడతారు. దాన్ని వినయంగా స్వీకరించే బదులు తిరస్కరిస్తారు. (కీర్త. 141:5) ఇలాంటి గర్వాన్ని, తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకోవడం లేదా ‘ఏ కారణం లేకపోయినా ఇతరులకన్నా తామే గొప్పవాళ్లమని భావించే అహంకార స్వభావం’ అని నిర్వచించవచ్చు. అలాంటి స్వభావాన్ని యెహోవా అసహ్యించుకుంటాడు. (కీర్త. 101:5; సామె. 6:16, 17) కానీ, సాతానుకు మాత్రం, మనుషులు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటూ, తనలాగే అహంకారం చూపిస్తే ఇష్టం. నిమ్రోదు, ఫరో, అబ్షాలోము గొప్పలు చెప్పుకుంటూ అలాంటి గర్వాన్ని చూపించినప్పుడు సాతాను ఎంత సంతోషించివుంటాడో! (ఆది. 10:8, 9; నిర్గ. 5:1, 2; 2 సమూ. 15:4-6) కయీను దేవునితో తన స్నేహాన్ని పోగొట్టుకోవడానికి కూడా గర్వమే కారణం. యెహోవాయే స్వయంగా హెచ్చరించినా, కయీను గర్వంతో లెక్కచేయలేదు. అతను మొండిగా, హెచ్చరికను ఏమాత్రం పట్టించుకోకుండా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు.—ఆది. 4:6-8.

7, 8. (ఎ) జాతివివక్ష అంటే ఏమిటి? దానికీ గర్వానికీ సంబంధం ఏమిటి? (బి) గర్వంవల్ల సంఘంలో సమాధానం ఎలా పాడవ్వవచ్చో వివరించండి.

7 నేడు, ప్రజలు ఎన్నో విధాలుగా అలాంటి గర్వాన్ని చూపిస్తున్నారు. కొంతమంది గర్వంవల్ల జాతివివక్ష చూపిస్తారు. వేరే జాతికి చెందినవాళ్ల పట్ల పక్షపాతం చూపించడమే జాతివివక్ష అని ఓ డిక్షనరీ చెప్తుంది. ‘కొన్ని జాతుల ప్రజలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు, సామర్థ్యాలు ఉంటాయనీ, కొన్ని జాతులవాళ్లు పుట్టుకతోనే గొప్పవాళ్లని, మరికొన్ని జాతులవాళ్లు తక్కువవాళ్లని భావించడం’ కూడా జాతివివక్షేనని ఆ డిక్షనరీ చెప్తుంది. ఈ వివక్ష వల్ల ఎన్నో పోరాటాలు, యుద్ధాలు, సామూహిక హత్యలు జరిగాయి.

8 అయితే, క్రైస్తవ సంఘంలో ఇలాంటివాటికి చోటులేదు. అయినా, కొన్నిసార్లు గర్వం వల్ల సహోదరసహోదరీల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడి, అవి గొడవలకు దారితీయవచ్చు. కొంతమంది తొలి క్రైస్తవుల మధ్య అదే జరిగింది. అందుకే యాకోబు, వాళ్లను ఆలోచింపజేసే ఈ ప్రశ్న అడిగాడు, “మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి?” (యాకో. 4:1) మనం ఇతరులను ద్వేషిస్తూ, వాళ్లకన్నా మనమే గొప్పవాళ్లమని భావిస్తే మన మాటల ద్వారా, చేతల ద్వారా వాళ్లను నొప్పించే అవకాశం ఉంది. (సామె. 12:18) అవును, గర్వం సంఘంలో సమాధానం లేకుండా చేస్తుంది.

9. మనం జాతివివక్షకు, అనుచిత గర్వానికి దూరంగా ఉండడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 ఇతరులకన్నా మనమే గొప్ప అనే ఆలోచన మనకుంటే, “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు” అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. (సామె. 16:5) అంతేకాదు వేరే జాతి, దేశం, సంస్కృతికి చెందినవాళ్ల విషయంలో మన అభిప్రాయం ఎలా ఉందో కూడా పరిశీలించుకోవాలి. మన దేశమే లేదా మన జాతే గొప్ప అని మనం అనుకుంటుంటే, దేవుడు “ఒకే మనిషినుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు” అనే విషయాన్ని మనం మర్చిపోయినట్లే. (అపొ. 17:26, 27, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మనుషులందరూ ఆదాము నుండే వచ్చారు కాబట్టి ఒకవిధంగా చెప్పాలంటే మనందరం ఒకే జాతికి చెందినవాళ్లం. దేవుడు కొన్ని జాతులవాళ్లను ఉన్నతమైనవాళ్లుగా, మరికొన్ని జాతులవాళ్లను తక్కువవాళ్లుగా సృష్టించాడని అనుకోవడం మూర్ఖత్వం. ఒకవేళ మనం అలా ఆలోచిస్తుంటే క్రైస్తవ ప్రేమను, ఐక్యతను పాడుచేసేలా మనం సాతానుకు అవకాశమిస్తున్నట్లే. (యోహా. 13:35) మనం సాతానుతో పోరాడి గెలవాలంటే, ఏ విధమైన అనుచిత గర్వానికీ చోటివ్వకూడదు.—సామె. 16:18.

వస్తుసంపదలపై మోజు పెంచుకోకండి, లోకాన్ని ప్రేమించకండి

10, 11. (ఎ) మనం లోకాన్ని ప్రేమించే ప్రమాదం ఎందుకు ఉంది? (బి) దేమా ఈ లోకాన్ని ప్రేమించడం వల్ల ఏమి జరిగింది?

10 సాతాను “ఈ లోకాధికారి,” లోకం అతని గుప్పిట్లో ఉంది. (యోహా. 12:31; 1 యోహా. 5:19) అందుకే ఈ లోకం ప్రోత్సహించే చాలా విషయాలు, బైబిలు ప్రమాణాలకు విరుద్ధమైనవి. అయితే, లోకంలో ఉన్నవన్నీ చెడ్డవేమి కాదు. కానీ, సాతాను ఈ లోకాన్ని ఉపయోగించి మన కోరికల్ని తనకు అనుకూలంగా మార్చుకుని, మనం పాపం చేసేలా ప్రలోభపెడతాడని గుర్తుంచుకోవాలి. లేదా మనం ఈ లోకాన్ని ప్రేమించి, యెహోవా ఆరాధనను నిర్లక్ష్యం చేసేలా మభ్యపెడతాడు.—1 యోహాను 2:15, 16 చదవండి.

11 తొలి క్రైస్తవుల్లో కొంతమంది లోకాన్ని ప్రేమించారు. ఉదాహరణకు, ‘దేమా ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్లిపోయాడు’ అని పౌలు రాశాడు. (2 తిమో. 4:10) దేమా ఈ లోకంలో ఉన్నవాటిలో దేన్ని ప్రేమించి పౌలును విడిచి వెళ్లాడో బైబిలు ఖచ్చితంగా చెప్పట్లేదు. బహుశా ఆయన యెహోవా సేవ కన్నా వస్తుసంపదల్నే ఎక్కువగా ప్రేమించివుంటాడు. కారణం ఏదైనా ఆయన పనికిరాని వాటికోసం యెహోవా సేవలో మంచి అవకాశాలను కోల్పోయాడు. దేమా పౌలుకు సహాయకునిగానే ఉండుంటే యెహోవా ఆయనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చుండేవాడు, వాటికి మించినదాన్ని ఈ లోకం ఆయనకు ఎప్పటికీ ఇవ్వలేదు.—సామె. 10:22.

12. సాతాను ఎలా మన కోరికల్ని అవకాశంగా తీసుకుని మనం ‘ధనమోసంలో’ చిక్కుకునేలా చేస్తాడు?

12 దేమాకు జరిగినట్లే మనకూ జరగవచ్చు. క్రైస్తవులమైన మనం, మనల్నీ మన కుటుంబాన్నీ పోషించుకోవడానికి డబ్బు సంపాదించాలని కోరుకోవడం సహజమే. (1 తిమో. 5:8) యెహోవా ఆదాముహవ్వలకు అందమైన పరదైసును ఇచ్చాడు కాబట్టి, మనుషులు సంతోషంగా జీవించాలన్నది ఆయన కోరికని అర్థమౌతుంది. (ఆది. 2:9) కానీ మన కోరికల్ని సాతాను అవకాశంగా తీసుకుని మనం ‘ధనమోసంలో’ చిక్కుకునేలా చేయగలడు. (మత్త. 13:22) మనం సంతోషంగా ఉండాలన్నా, జీవితంలో విజయం సాధించాలన్నా ఎక్కువ డబ్బు, వస్తువులు ఉండాలని చాలామంది అనుకుంటారు. మనం కూడా అలాగే అనుకుంటే, అన్నిటికన్నా విలువైన యెహోవా స్నేహాన్ని పోగొట్టుకుంటాం. యేసు ఇలా హెచ్చరించాడు, “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” (మత్త. 6:24) మనం వస్తుసంపదలకు దాసులమైతే, యెహోవాను సేవించడం మానేసినట్లే. సాతానుకు నిజంగా కావాల్సింది అదే. కాబట్టి మనం డబ్బు, వస్తువులకన్నా యెహోవాతో మన స్నేహానికే విలువిద్దాం. మనం సాతానుతో పోరాడి గెలవాలంటే, వస్తుసంపదలను వాటి స్థానంలోనే ఉంచాలి.—1 తిమోతి 6:6-10 చదవండి.

అనైతికతకు దూరంగా ఉండండి

13. వివాహం విషయంలో ఈ లోకం ఎలాంటి తప్పుడు ఆలోచనను ప్రోత్సహిస్తుంది?

13 సాతాను ఉపయోగించే మరో ఉచ్చు, లైంగిక అనైతికత. భర్తకు/భార్యకు నమ్మకంగా ఉండడం, ఆఖరికి పెళ్లి చేసుకోవడం కూడా పాతకాలపు విషయమని, అది స్వేచ్ఛ లేకుండా చేస్తుందని చాలామంది అనుకుంటారు. ఉదాహరణకు, ఓ సినీనటి ఇలా చెప్పింది, ‘ఒకే వ్యక్తికి నమ్మకంగా ఉండడం అసాధ్యం. భాగస్వామికి నమ్మకంగా ఉన్నవాళ్లను లేదా ఉండాలనుకునేవాళ్లను నేను ఎప్పుడూ చూడలేదు.’ ఓ నటుడు ఇలా చెప్పాడు, “జీవితాంతం ఒకే వ్యక్తితో ఉండడం నిజంగా మన స్వభావంలో ఉందా అని నా సందేహం.” ప్రముఖ వ్యక్తులు దేవుడిచ్చిన బహుమానమైన వివాహాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే, సాతాను చాలా సంతోషిస్తాడు. అతను వివాహ ఏర్పాటును ఏమాత్రం ప్రోత్సహించడు, భార్యాభర్తలు కలిసి ఉండడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి, సాతానుతో పోరాడి గెలవాలంటే, దేవుడు చేసిన వివాహ ఏర్పాటు పట్ల మనకు గౌరవం ఉండాలి.

14, 15. తప్పు చేయాలనే శోధన ఎదురైతే మీరేమి చేయవచ్చు?

14 మనకు పెళ్లైనా, కాకపోయినా మనం అన్ని రకాల లైంగిక అనైతికతకు దూరంగా ఉండాలి. కానీ అదంత తేలిక కాదు. ఉదాహరణకు, స్కూల్‌లో లేదా కాలేజీలో మీ తోటి విద్యార్థులు తమకు నచ్చినవాళ్లతో శరీర కోరికలు తీర్చుకోవడం గురించి గొప్పగా చెప్పుకోవడం బహుశా మీరు వినివుంటారు. లేదా వాళ్లు సెక్స్‌టింగ్‌ గురించి అంటే, రెచ్చగొట్టే మెసేజ్‌లను, అశ్లీల చిత్రాలను సెల్‌ఫోన్‌లో ఇతరులకు పంపించడం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. నిజానికి సెక్స్‌టింగ్‌ను కొన్ని దేశాల్లో, చిన్నపిల్లల అశ్లీల చిత్రాలను పంపిణీ చేయడమంత తీవ్రంగా పరిగణిస్తారు. బైబిలు ఇలా చెప్తుంది, “జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.” (1 కొరిం. 6:18) అలా చేసినవాళ్లు సుఖవ్యాధుల బారినపడి ఎంతో బాధ అనుభవిస్తున్నారు, చనిపోతున్నారు. పెళ్లి కాకుండానే ఇతరులతో సంబంధం పెట్టుకున్న చాలామంది యౌవనులు, దానివల్ల కుమిలిపోతున్నామని చెప్తున్నారు. దేవుని నియమాలు మీరడంవల్ల నష్టమేమీ జరగదని ఈ లోకంలోని వినోద కార్యక్రమాలు మనల్ని నమ్మిస్తాయి. మనం అలాంటి అబద్ధాలు నమ్మితే “పాపమువలన కలుగు భ్రమచేత” మోసపోయినట్లే.—హెబ్రీ. 3:13-15.

15 తప్పు చేయాలనే శోధన ఎదురైతే మీరేమి చేయవచ్చు? ముందు మీకు ఆ బలహీనత ఉందని గుర్తించండి. (రోమా. 7:22, 23) బలాన్ని ఇవ్వమని దేవునికి ప్రార్థించండి. (ఫిలి. 4:6, 7, 13) తప్పు చేయడానికి దారితీసే పరిస్థితులకు దూరంగా ఉండండి. (సామె. 22:3) శోధన ఎదురైతే, వెంటనే దాన్ని తిరస్కరించండి.—ఆది. 39:12.

16. సాతాను శోధించినప్పుడు యేసు ఎలా స్పందించాడు? ఆయన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

16 శోధనలను ఎదిరించే విషయంలో యేసుక్రీస్తు మనకు చక్కని ఆదర్శం ఉంచాడు. ఆయన సాతాను చెప్పిన కల్లబొల్లి మాటల్ని నమ్మలేదు. ఆయన వాటి గురించి కనీసం ఆలోచించలేదు కూడా. బదులుగా, శోధన ఎదురైన వెంటనే “వ్రాయబడియున్నది” అని సాతానుకు జవాబిచ్చాడు. (మత్తయి 4:4-10 చదవండి.) యేసుకు దేవుని వాక్యం బాగా తెలుసు కాబట్టి సాతాను శోధించిన వెంటనే, లేఖనాలను ఉపయోగించి జవాబివ్వగలిగాడు. మనం కూడా సాతానుతో పోరాడి గెలవాలంటే, లైంగిక అనైతికతకు పాల్పడాలనే శోధనను ఎదిరించాలి.—1 కొరిం. 6:9, 10.

ఓపిగ్గా పోరాడి గెలవండి

17, 18. (ఎ) సాతాను ఇంకా ఏ ఉచ్చుల్ని ఉపయోగిస్తాడు? వాటి విషయంలో మనం ఎందుకు ఆశ్చర్యపోము? (బి) సాతానుకు చివరికి ఏమౌతుంది? ఓపిగ్గా పోరాడడానికి ఈ విషయం మీకెలా సహాయం చేస్తుంది?

17 గర్వం, వస్తుసంపదలపై మోజు, లైంగిక అనైతికత సాతాను ఉచ్చుల్లో కేవలం మూడు మాత్రమే. సాతాను దగ్గర ఇలాంటి ఉచ్చులు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు, కొంతమంది క్రైస్తవులు తమ కుటుంబ సభ్యుల వ్యతిరేకతను, మరికొంతమంది తోటి విద్యార్థుల ఎగతాళిని ఎదుర్కొంటున్నారు. ఇంకొంతమంది, మన ప్రకటనా పనిపై ఆంక్షలు ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు. ఇలాంటి కష్టాలు వస్తాయని మనకు ముందే తెలుసు. ఎందుకంటే యేసు తన శిష్యుల్ని ఇలా హెచ్చరించాడు, “మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషింపబడుదురు; అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును.”—మత్త. 10:22.

సాతాను సర్వనాశనం అవుతాడు (18వ పేరా చూడండి)

18 మనం సాతానుతో ఎలా పోరాడి గెలవవచ్చు? యేసు ఇలా చెప్పాడు, “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.” (లూకా 21:19) ఏ మనిషీ మనకు శాశ్వత హాని కలిగించలేడు. మన చేతులారా మనం చేసుకుంటే తప్ప, దేవునితో మన స్నేహాన్ని ఎవరూ పాడుచేయలేరు. (రోమా. 8:38, 39) చివరికి కొంతమంది యెహోవా సేవకులు చనిపోయినా, సాతాను గెలిచినట్లు కాదు, ఎందుకంటే యెహోవా వాళ్లను మళ్లీ బ్రతికిస్తాడు. (యోహా. 5:28, 29) కానీ సాతానుకు ఎలాంటి నిరీక్షణా లేదు. ఈ దుష్టలోకం నాశనమయ్యాక, యేసుక్రీస్తు సాతానును 1,000 సంవత్సరాలు అగాధంలో బంధిస్తాడు. (ప్రక. 20:1-3) క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన అయిపోయాక, సాతాను ‘చెరలోనుండి విడిపించబడి’ పరిపూర్ణులైన మనుషులను మోసగించడానికి చివరిసారి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత సాతాను సర్వనాశనమౌతాడు. (ప్రక. 20:7-10) సాతానుకు భవిష్యత్తు లేదు, కానీ మీకుంది! కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉంటూ, సాతానుతో పోరాడుతూనే ఉండండి. మీరు సాతానుతో పోరాడి గెలవగలరు!