కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

దేవునితో, మా అమ్మతో సమాధానంగా ఉండగలిగాను

దేవునితో, మా అమ్మతో సమాధానంగా ఉండగలిగాను

“నువ్వెందుకు మన పూర్వీకుల్ని ఆరాధించవు?” అని మా అమ్మ నన్ను అడిగింది. “నువ్వు బ్రతికుండడానికి కారణం వాళ్లేనని నీకు తెలీదా? వాళ్లకు కృతజ్ఞత చూపించవా? తరతరాలుగా వస్తున్న మన ఆచారాల్ని నువ్వెందుకు పాటించవు? పూర్వీకుల్ని ఆరాధించను అంటున్నావంటే నువ్వు మన ఆరాధనను అవమానిస్తున్నట్లే” అని అంటూ అమ్మ ఏడ్చేసింది.

కొన్ని నెలల క్రితం యెహోవాసాక్షులు మా అమ్మను కలిసి బైబిలు స్టడీ గురించి చెప్పారు. ఆమెకు ఇష్టం లేకపోయినా వాళ్ల మాట కాదనలేక తనకు బదులు నన్ను స్టడీలో కూర్చోబెట్టేది. ఎప్పుడూ అమ్మ మాట వినే నేను, పూర్వికుల్ని ఆరాధించే విషయంలో ఆమె మాట వినట్లేదని అమ్మకు కోపమొచ్చింది. ఏదేమైనా నేను యెహోవాను సంతోషపెట్టాలనుకున్నాను. అలా చేయడం సులభం కాకపోయినా యెహోవా సహాయంతో చేయగలిగాను.

యెహోవా గురించి నేర్చుకోవడం

జపాన్‌లోని చాలామందిలాగే మేము కూడా బౌద్ధ మతస్థులం. కానీ యెహోవాసాక్షులతో స్టడీ మొదలుపెట్టిన రెండు నెలలకే బైబిలు చెప్పేది సత్యం అనే నమ్మకం నాకు కుదిరింది. నాకొక పరలోక తండ్రి ఉన్నాడనే విషయం తెలుసుకున్నాక, ఆయన గురించి నేర్చుకోవాలనే కోరిక నాలో కలిగింది. నేను నేర్చుకుంటున్న విషయాల గురించి మొదట్లో నేనూ, అమ్మ సంతోషంగా చర్చించుకునేవాళ్లం. నేను ఆదివారం మీటింగ్స్‌కు వెళ్లడం కూడా మొదలుపెట్టాను. సత్యం తెలుసుకున్నాను కాబట్టి ఇక బౌద్ధ ఆచారాలు పాటించనని అమ్మకు చెప్పేశాను. ఒక్కసారిగా ఆమెలో మార్పు వచ్చింది, ‘నువ్వు మన పూర్వీకుల్ని ఆరాధించట్లేదని తెలిస్తే మన కుటుంబ పరువు పోతుంది’ అని ఆమె అంది. బైబిలు స్టడీ తీసుకోవడం, మీటింగ్స్‌కు వెళ్లడం ఇక వీల్లేదని అమ్మ తేల్చి చెప్పింది. ఆమె అలా మాట్లాడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. అమ్మ ఇంతకుముందులా లేదు.

నాన్న కూడా అమ్మకు వంత పాడాడు. నేను తల్లిదండ్రుల మాట వినాలని యెహోవా కోరుకుంటున్నాడని ఎఫెసీయులు 6వ అధ్యాయంలో తెలుసుకున్నాను. నేను అమ్మానాన్నల మాట వింటే, వాళ్లు కూడా నేను చెప్పేది వింటారని, మా కుటుంబం ఇంతకుముందులా సమాధానంగా ఉంటుందని నేను మొదట్లో అనుకున్నాను. పైగా నాకు స్కూల్‌ పరీక్షలు దగ్గరపడ్డాయి కాబట్టి నేను చదువుకోవాలి. అందుకే మూడు నెలల వరకు వాళ్లు చెప్పినట్లే చేస్తానని అన్నాను. కానీ పరీక్షలు అయిపోయాక మళ్లీ మీటింగ్స్‌కు వస్తానని యెహోవాకు మాటిచ్చాను.

కానీ నా నిర్ణయం వల్ల రెండు చెడు ఫలితాలు వచ్చాయి. మొదటిది, మూడు నెలల తర్వాత కూడా యెహోవాను సేవించాలనే కోరిక నాలో బలంగానే ఉంటుందని అనుకున్నాను. కానీ కొంతకాలానికే నేను ఆధ్యాత్మికంగా బలహీనపడిపోయాను. రెండవది, యెహోవాను సేవించడం ఆపేయమని అమ్మానాన్నలు నన్ను ఇంకా ఎక్కువ ఒత్తిడి చేశారు.

సహాయం, వ్యతిరేకత

నాలాగే కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్లను నేను రాజ్యమందిరంలో కలిశాను. యెహోవా తప్పకుండా సహాయం చేస్తాడని వాళ్లు నాకు ధైర్యం చెప్పారు. (మత్త. 10:34-37) నేను యెహోవాకు నమ్మకంగా ఉంటే అది చూసి నా కుటుంబ సభ్యులు కూడా ఆయన గురించి నేర్చుకునే అవకాశం ఉందని వాళ్లు నాకు చెప్పారు. నేను యెహోవా మీద ఆధారపడాలనుకున్నాను అందుకే ఆయనకు ఎక్కువగా ప్రార్థించేదాన్ని.

మా కుటుంబం నుండి నాకు చాలా విధాలుగా వ్యతిరేకత వచ్చింది. సాక్షులకు దూరంగా ఉండమని అమ్మ బతిమిలాడేది, నచ్చజెప్పేది. అలాంటప్పుడు నేను మౌనంగా ఉండేదాన్ని. అలాకాకుండా మాట్లాడడం మొదలుపెడితే ఇద్దరం వాదించుకునేవాళ్లం. నేను అమ్మ భావాల్ని, నమ్మకాల్ని అర్థంచేసుకుని ఉంటే పరిస్థితులు చక్కబడేవేమో అనిపిస్తుంది. నన్ను గడప దాటనివ్వకుండా ఉంచడం కోసం అమ్మానాన్నలు నాకు ఎక్కువ పని చెప్పేవాళ్లు. ఒక్కోసారైతే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసేవాళ్లు, అన్నం కూడా పెట్టేవాళ్లు కాదు.

నన్ను మార్చడానికి సహాయం చేయమని అమ్మ వేరేవాళ్లను అడిగేది. మా స్కూల్‌ టీచర్‌ను కూడా కలిసి సహాయం అడిగింది, ఆయన మా ఇద్దరిలో ఎవ్వరి తరఫున మాట్లాడలేదు. ఆ తర్వాత మా అమ్మ తను పనిచేసే మేనేజర్‌ దగ్గరికి తీసుకెళ్లి మతాలన్నీ పనికిరానివని అతని చేత నన్ను ఒప్పించడానికి ప్రయత్నించింది. ఇంట్లో ఉన్నప్పుడేమో మా బంధువులకు ఫోన్‌ చేసి నన్ను మార్చమని ఏడుస్తూ వాళ్లను బతిమిలాడేది. నాకు చాలా బాధనిపించింది. నిజానికి అమ్మ మా పరిస్థితి గురించి ఇతరులకు చెప్పిన ప్రతీసారి తనకు తెలియకుండానే సాక్షమిస్తుందని సంఘపెద్దలు నన్ను ప్రోత్సహించారు.

ఆ తర్వాత పైచదువులకు వెళ్లాలనే మరో సవాలు నాకు ఎదురైంది. పైచదువులు చదివిస్తే మంచి ఉద్యోగం దొరుకుతుందని అమ్మానాన్నలు నన్ను ఓ యూనివర్సిటీలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం గురించి మాట్లాడుకున్న ప్రతీసారి మేము అరుచుకునేవాళ్లం, అందుకే నా లక్ష్యాల గురించి అమ్మానాన్నలకు ఉత్తరాల ద్వారా వివరించాను. నాన్న కోపంతో, “నువ్వు రేపటిలోగా ఉద్యోగం సంపాదిస్తేనే ఇంట్లో ఉండు లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపో” అని బెదిరించాడు. నేను ఆ విషయం గురించి యెహోవాకు ప్రార్థించాను. ఆ తర్వాతి రోజు నేను పరిచర్య చేస్తున్నప్పుడు, తమ పిల్లలకు ట్యూషన్‌ చెప్పమని ఇద్దరు సహోదరీలు నన్ను అడిగారు. కానీ నాన్న మాత్రం సంతోషించలేదు, పైగా నాతో మాట్లాడడం పూర్తిగా మానేశాడు, నిజానికి పట్టించుకోవడమే మానేశాడు. తన కూతురు నేరస్థురాలైనా ఫర్లేదుకానీ యెహోవాసాక్షిగా మారడం మాత్రం తనకు ఇష్టంలేదని అమ్మ అంది.

వేర్వేరు దేశాల్లో సేవచేయడం వల్ల యెహోవా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను

నేను మా అమ్మానాన్నలను ఇంతగా ఎదిరించడం అసలు యెహోవాకు ఇష్టమో కాదోనని కొన్నిసార్లు ఆలోచించేదాన్ని. కానీ బాగా ప్రార్థించడంవల్ల, యెహోవా ప్రేమ గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయో ఆలోచించడంవల్ల వ్యతిరేకతను సరైన దృష్టితో చూడగలిగాను. అమ్మానాన్నలకు నామీద ఉన్న శ్రద్ధ వల్లే అలా వ్యతిరేకిస్తున్నారని అర్థంచేసుకోగలిగాను. సరిగ్గా ఆలోచించడానికి, ఓ పరిష్కారం కనుగొనడానికి యెహోవా నాకు సహాయం చేశాడు. అంతేకాదు, పరిచర్యలో ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువ సంతోషంగా ఉండేదాన్ని. అందుకే పయినీరు అవ్వాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను.

పయినీరు సేవ చేయడం

నేను పయినీరు సేవ చేయాలనుకుంటున్నానని తెలుసుకున్న కొంతమంది సహోదరీలు, మా అమ్మానాన్నల కోపం తగ్గేవరకు ఆగమని సలహా ఇచ్చారు. అయితే నేను జ్ఞానం కోసం యెహోవాకు ప్రార్థించాను, పరిశోధన చేశాను, పయినీరు సేవ ఎందుకు చేయాలనుకుంటున్నానో పరిశీలించుకున్నాను, పరిణతిగల సహోదరసహోదరీలతో మాట్లాడాను. చివరికి యెహోవానే సంతోషపెట్టాలని నిర్ణయించుకున్నాను. అంతేకాదు, ఒకవేళ నేను పయినీరు సేవ చేయకుండా ఆగినా మా అమ్మానాన్నలు మారతారని నాకు అనిపించలేదు.

నేను హైస్కూల్‌లో చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు పయినీరు సేవ మొదలుపెట్టాను. పయినీరు సేవచేసిన కొంతకాలం తర్వాత, అవసరం ఎక్కువున్న చోటకు వెళ్లి సేవచేయాలనే లక్ష్యం పెట్టుకున్నాను. కానీ నేను ఇంటికి దూరంగా వెళ్లడం అమ్మానాన్నలకు ఇష్టంలేదు. దాంతో నాకు 20 ఏళ్లు వచ్చేవరకు ఆగాను. మాకు దక్షిణ జపాన్‌లో బంధువులు ఉన్నారు. అక్కడికి వెళ్లడానికైతే అమ్మ ఒప్పుకుంటుంది కాబట్టి నాకు దక్షిణ జపాన్‌లో నియామకం ఇవ్వమని బ్రాంచి కార్యాలయాన్ని కోరాను.

అక్కడ నేను స్టడీ ఇచ్చినవాళ్లలో చాలామంది బాప్తిస్మం కూడా తీసుకున్నారు. ఆ సమయంలో, మరింత ఎక్కువగా సేవ చేయగలిగేలా నేను ఇంగ్లీషు నేర్చుకున్నాను. నేను ఉంటున్న సంఘంలో ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్న ఇద్దరు సహోదరులు ఉండేవాళ్లు. వాళ్ల ఉత్సాహాన్ని, ఇతరులకు సహాయం చేయడాన్ని చూసి నేను కూడా ప్రత్యేక పయినీరు అవ్వాలనుకున్నాను. నేను దక్షిణ జపాన్‌లో సేవచేస్తున్న సమయంలో అమ్మ రెండుసార్లు తీవ్రంగా జబ్బుపడింది. ఆ రెండు సందర్భాల్లోనూ నేను ఆమెను చూసుకోవడానికి ఇంటికి వెళ్లాను. నేను అలా రావడం చూసి అమ్మ ఆశ్చర్యపోయింది, దాంతో ఆమె మనసు కాస్త మెత్తబడింది.

దీవెనల వర్షం

ఏడు సంవత్సరాల తర్వాత, పైన చెప్పిన ఇద్దరు ప్రత్యేక పయినీర్లలో ఒకరైన ఆట్సుషీ అనే సహోదరుని నుండి నాకో ఉత్తరం వచ్చింది. ఒకవేళ నేను ఇష్టపడితే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని ఆ ఉత్తరంలో రాశాడు. ఆయన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు, ఆయనకు అలాంటి ఆలోచన ఉందని కూడా నాకు తెలీదు. అయితే ఒకరి గురించి ఒకరు ఎక్కువ తెలుసుకోవడం నాకిష్టమే అని చెప్తూ నెల తర్వాత ఉత్తరం రాశాను. చాలా విషయాల్లో మా ఇద్దరి ఇష్టాలు కలిశాయి, ఇద్దరం పూర్తికాల సేవ చేయాలనుకుంటున్నాం, అది ఏ రంగంలోనైనా సరే. కొంతకాలానికి మేమిద్దరం పెళ్లిచేసుకున్నాం. పెళ్లికి మా అమ్మానాన్నలు, బంధువులు వచ్చినందుకు చాలా సంతోషించాను.

నేపాల్‌

మేము క్రమ పయినీర్లుగా సేవచేస్తుండగా , ఆట్సుషీని సబ్‌స్టిట్యూట్‌ ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. ఆ తర్వాత మమ్మల్ని ప్రత్యేక పయినీర్లుగా నియమించి, కొంతకాలానికి ప్రాంతీయ సేవకు పంపించారు, అవి మాకు వచ్చిన ఇతర దీవెనలు. మా సర్క్యూట్‌లో ఉన్న సంఘాలన్నిటినీ ఒకసారి సందర్శించిన తర్వాత మాకు బ్రాంచి కార్యాలయం నుండి ఫోన్‌ వచ్చింది. ‘నేపాల్‌కు వెళ్లి ప్రాంతీయ పర్యవేక్షకులుగా సేవ చేయడం మీకు ఇష్టమేనా?’ అని సహోదరులు మమ్మల్ని అడిగారు.

వేర్వేరు దేశాల్లో సేవచేయడం వల్ల యెహోవా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను

అంతదూరం వెళ్తున్నానంటే మా అమ్మానాన్నలు ఏమంటారో అని భయపడ్డాను. కానీ ఇంటికి ఫోన్‌ చేసి ఈ విషయం గురించి చెప్పినప్పుడు, నాన్న ఫోన్‌ ఎత్తి “నువ్వు చాలా అందమైన ప్రాంతానికి వెళ్తున్నావు” అని అన్నాడు. వారం క్రితమే నాన్నకు తన స్నేహితుల్లో ఒకరు నేపాల్‌ గురించి ఓ పుస్తకాన్ని ఇచ్చాడు. అది చదివాక, అక్కడికి వెళ్తే బాగుంటుందని నాన్న అనుకున్నాడట.

నేపాల్‌లోని సహోదరసహోదరీలతో కలిసి సంతోషంగా సేవచేస్తుండగా మాకు మరో దీవెన దొరికింది. మా సర్క్యూట్‌లో బంగ్లాదేశ్‌ను కూడా కలిపారు. అది నేపాల్‌కు దగ్గరే అయినా చాలా విషయాల్లో భిన్నమైనది. అక్కడ పరిచర్య కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ఐదు సంవత్సరాల తర్వాత మమ్మల్ని మళ్లీ జపాన్‌కు ప్రాంతీయ పర్యవేక్షకులుగా నియమించారు. ఇప్పుడు మేమిక్కడే సంతోషంగా సేవచేస్తున్నాం.

జపాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో సేవ చేస్తున్నప్పుడు నేను యెహోవా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ దేశాల్లోని ప్రజలకు వేర్వేరు సంస్కృతి, అలవాట్లు, కట్టుబాట్లు ఉన్నాయి. అక్కడి ప్రజల్లో ప్రతీ ఒక్కరు ఎంతో ప్రత్యేకమైనవాళ్లు. ప్రతీ వ్యక్తిపట్ల యెహోవా ఎలా శ్రద్ధ చూపిస్తాడో, దగ్గరకు తీసుకుంటాడో, సహాయం చేస్తాడో, ఆశీర్వదిస్తాడో నేను కళ్లారా చూశాను.

యెహోవాకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు ఎన్నో కారణాలు ఉన్నాయి. తన గురించి తెలుసుకుని, తనకు సేవచేసే అవకాశాన్ని ఆయన నాకు ఇచ్చాడు. అంతేకాదు ఓ మంచి భర్తను కూడా ఇచ్చాడు. మంచి నిర్ణయాలు తీసుకునేందుకు యెహోవా నాకెంతో సహాయం చేశాడు. దానివల్ల యెహోవాకు, నా కుటుంబానికి దగ్గరవ్వగలిగాను. ఇప్పుడు అమ్మా, నేను మళ్లీ మంచి స్నేహితులమైపోయాం, అందుకు యెహోవాకు ఎంతో రుణపడివున్నాను. దేవునితో, మా అమ్మతో సమాధానంగా ఉండగలుగుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.

ప్రాంతీయ సేవలో మేం చాలా ఆనందిస్తున్నాం