కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం నిజంగా దేవున్ని సంతోషపెట్టగలమా?

మనం నిజంగా దేవున్ని సంతోషపెట్టగలమా?

బైబిలు కొందరి గురించి గొప్పగా చెప్తుంది. వాళ్ల గురించి చదివినప్పుడు, ‘నేను వాళ్లలా ఉండలేను! నేను తప్పులు చేస్తాను, నేను అంత మంచివాన్ని కాదు’ అని మీరెప్పుడైనా అనుకున్నారా?

యోబు ‘యథార్థవంతుడు, న్యాయవంతుడు.’ —యోబు 1:1

యోబు ‘యథార్థవంతుడు, న్యాయవంతుడు’ అని, లోతు “నీతిమంతుడు” అని, దావీదు దేవుని దృష్టికి “ఏది అనుకూలమో” అదే చేశాడు అని బైబిలు చెప్తుంది. (యోబు 1:1; 2 పేతురు 2:8; 1 రాజులు 14:8) అయితే వాళ్ల గురించి బైబిలు నుండి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. అప్పుడు మనం ఈ మూడు విషయాలు గమనిస్తాం. (1) వాళ్లూ తప్పులు చేశారు, (2) వాళ్ల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, (3) మనలాంటి మనుషులు కూడా దేవున్ని నిజంగా సంతోషపెట్టవచ్చు.

వాళ్లూ తప్పులు చేశారు

దేవుడు “దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడిచేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.”—2 పేతురు 2:7

యోబు వెంటవెంటనే వచ్చిన కష్టాలతో అన్యాయంగా బాధపడ్డాడు. దేవుని మీద నమ్మకం ఉంచినా, ఉంచకపోయినా ఆయన మనల్ని పట్టించుకోడని యోబు తప్పుగా అనుకున్నాడు. (యోబు 9:20-22) యోబు తను నీతిమంతున్నని ఎంతగా నమ్మాడంటే, చూసేవాళ్లకు అతను దేవుని కంటే నీతిమంతుడని చెప్పుకుంటున్నట్లు అనిపించింది.—యోబు 32:1, 2; 35:1, 2.

లోతు సరైన, తేలికైన నిర్ణయం తీసుకోవడానికి వెనకాడాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో జీవిస్తున్న ప్రజల ఘోరమైన ప్రవర్తనను చూసి ఆయన చాలా దిగులుపడ్డాడు. వాళ్ల ప్రవర్తన చూసి ఆయన “నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను.” (2 పేతురు 2:8) ఆ పట్టణాలను నాశనం చేస్తానని, లోతును ఆయన కుటుంబాన్ని రక్షిస్తానని దేవుడు చెప్పాడు. ఆ పరిస్థితులకు విసిగిపోయిన లోతు అక్కడ నుండి వెంటనే వెళ్లుంటాడని మీరనుకోవచ్చు. కానీ చివరి నిమిషం వరకు అక్కడక్కడే తిరిగాడు. అప్పుడు లోతును, ఆయన కుటుంబాన్ని కాపాడడానికి వచ్చిన దూతలు చివరికి వాళ్ల చేతులు పట్టుకుని ఆ ఊరి బయటకు భద్రంగా తీసుకురావాల్సి వచ్చింది.—ఆదికాండము 19:15, 16.

“మనఃపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు.”1 రాజులు 14:8

దావీదు ఒక సందర్భంలో తన కోరికను అదుపు చేసుకోలేక వేరొకరి భార్యతో వ్యభిచారం చేశాడు. ఆ తప్పును కప్పిపుచ్చడానికి ఆమె భర్తను చంపించాడు. (2 సమూయేలు, 11వ అధ్యాయం) దావీదు చేసింది “యెహోవా దృష్టికి దుష్కార్యముగా” అనిపించింది.—2 సమూయేలు 11:27.

యోబు, లోతు, దావీదు ముగ్గురూ పొరపాట్లు చేశారు. కొంతమందైతే చాలా పెద్ద తప్పులు చేశారు. కానీ మనం చూడబోతున్నట్లుగా వాళ్లు దేవుని మాట విని ఆయనను సేవించాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. చేసిన తప్పుల విషయంలో బాధపడి, వాళ్ల ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. అందుకే దేవునికి వాళ్లంటే ఇష్టం. బైబిలు వాళ్లు నమ్మకమైన వాళ్లని చెప్తుంది.

మనం ఏమి నేర్చుకోవచ్చు?

మనుషులన్నాక తప్పులు చేయకుండా ఉండలేం. (రోమీయులు 3:23) కానీ తప్పు చేసినప్పుడు, చేసిన తప్పుకు బాధపడి, సరి చేసుకోవడానికి చేయగలిగినదంతా చేయాలి.

యోబు, లోతు, దావీదు వాళ్లు చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఏం చేశారు? యోబు పైకి ఏమన్నా, నిజానికి ఆయన నిజాయితీపరుడే. దేవుడు ఆయనతో మాట్లాడాక, యోబు తన తప్పును ఒప్పుకున్నాడు, తన ఆలోచనను సరిచేసుకున్నాడు. (యోబు 42:6) సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నవాళ్ల చెడు ప్రవర్తన విషయంలో దేవుడు బాధపడినట్లే లోతు కూడా బాధపడ్డాడు. కాకపోతే ఆయన ఆ సమయంలో త్వరగా వెళ్లిపోకుండా ఆలస్యం చేశాడు. అయినా, చివరికి దేవుడు శిక్షించిన పట్టణాల నుండి ఆయన పారిపోయాడు, దేవుని తీర్పును తప్పించుకున్నాడు. దేవుడు చెప్పినట్లే వెనకకు తిరిగి చూడకుండా అన్నీ వదిలిపెట్టి వెళ్లాడు. దావీదు కూడా దేవుని నియమాలకు పూర్తి వ్యతిరేకంగా తప్పు చేశాడు. కానీ తర్వాత మంచి హృదయంతో బాధపడి, క్షమించమని దేవున్ని బ్రతిమాలాడు.—కీర్తన 51.

మనుషులు తప్పులు చేస్తారని దేవునికి తెలుసు. ఆయన మననుండి ఎక్కువ కోరుకోడు. అందుకే, ఆయన దృష్టిలో ఆ ముగ్గురూ మంచివాళ్లే. “మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు” అని బైబిల్లో ఉంది. (కీర్తన 103:14) మనం తప్పులు చేయకుండా ఉండలేమని దేవునికి తెలుసు కాబట్టి ఆయన మననుండి ఏమి కోరుకుంటున్నాడు?

“మనము నిర్మింపబడిన రీతి ఆయనకు [దేవునికి] తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.”—కీర్తన 103:14

మనుషులు దేవున్ని ఎలా సంతోషపెట్టవచ్చు?

మనం దేవున్ని ఎలా సంతోషపెట్టవచ్చో దావీదు, తన కొడుకు సొలొమోనుకు చెప్పిన మాటల నుండి తెలుసుకోవచ్చు. ‘సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవాను తెలుసుకుని హృదయపూర్వకముగా ఆయనను సేవించుము.’ (1 దినవృత్తాంతములు 28:9) దేవుని మీద ప్రేమతో, ఆయన ఇష్టానికి తగ్గట్లుగా, ఆయన కోరేవాటిని చేస్తే మనం పూర్తి హృదయంతో దేవున్ని సేవించినట్లే. అంటే ఏ తప్పులు చేయకపోవడం అని కాదుగానీ, దేవుడు చెప్పినవన్నీ వింటూ, తప్పులు చేసినా వాటిని సరిచేసుకునే మంచి హృదయంతో ఉండడం అని అర్థం. దేవున్ని నిజంగా ప్రేమించి, మనస్ఫూర్తిగా ఆయన మాట విన్నారు కాబట్టి యోబుకు ‘యథార్థవంతుడు’ అని, లోతుకు “నీతిమంతుడు” అని, దావీదుకు దేవుని దృష్టికి ‘అనుకూలమైనది’ చేసినవాడు అని పేరు వచ్చింది. తప్పులు చేసినా, వాళ్లు దేవున్ని సంతోషపెట్టారు.

దేవుని మీద ప్రేమతో ఆయన ఇష్టానికి తగ్గట్లుగా ఆయన కోరేవాటిని చేస్తే మనం పూర్తి హృదయంతో దేవున్ని సేవించినట్లే

కాబట్టి, తప్పుడు ఆలోచనలు మన మనసులోకి వచ్చినప్పుడు లేదా అనకూడనివి అన్నప్పుడు లేదా మనం చేసింది తప్పని తెలుసుకున్నప్పుడు ఇప్పటి వరకు చూసిన వాళ్లను మనసులో పెట్టుకోండి. వాళ్లను చూసి ధైర్యం తెచ్చుకోండి. ప్రస్తుతానికి మనం తప్పులు చేస్తూ ఉంటామని దేవునికి తెలుసు. కానీ మనం ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన చెప్పినట్లు చేయడానికి కృషిచేయాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ విషయంలో మనం హృదయపూర్వకంగా చేయగలిగినదంతా చేస్తే, దేవున్ని సంతోషపెట్టవచ్చనే నమ్మకంతో ఉండవచ్చు. ▪ (w15-E 07/01)