కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

దేవుని పేరు—దానిని ఉపయోగించడం, దాని అర్థం

దేవుని పేరు—దానిని ఉపయోగించడం, దాని అర్థం

మీ బైబిల్లో కీర్తన 83:18 ఎలా అనువదించబడింది? పరిశుద్ధ గ్రంథములో ఆ వచన అనువాదం ఇలా ఉంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.” ఇతర అనేక బైబిళ్లు కూడా ఆ విధంగానే అనువదిస్తున్నాయి. అయితే కొన్ని అనువాదాలు మాత్రం యెహోవా పేరుకు బదులు, దాని స్థానంలో “ప్రభువు” లేదా “నిత్యుడు” అనే పదాలను ఉపయోగిస్తున్నాయి. ఈ వచనంలో ఏమి ఉండాలి? దేవుని స్థానాన్ని సూచించే పదమా లేక యెహోవా అనే ఆయన పేరా?

హీబ్రూ అక్షరాల్లో దేవుని పేరు

ఆ వచనం ఒక పేరును ప్రస్తావిస్తోంది. బైబిలు ఎక్కువగా వ్రాయబడిన ఆదిమ హీబ్రూ భాషలో అక్కడ ఒక అసాధారణమైన వ్యక్తిగత నామం కనబడుతుంది. అది హీబ్రూ అక్షరాల్లో יהוה (యహ్‌వహ్‌) అని ఉచ్ఛరించబడుతుంది. తెలుగులో ఆ పేరు సాధారణంగా “యెహోవా” అని అనువదించబడింది. మరి బైబిల్లో ఆ పేరు ఆ ఒక్క వచనంలోనే ఉందా? కాదు. ఆదిమ హీబ్రూ లేఖనాల మూలపాఠంలో అది దాదాపు 7,000 సార్లు కనబడుతుంది.

దేవుని పేరు ఎంత ప్రాముఖ్యం? యేసుక్రీస్తు నేర్పించిన మాదిరి ప్రార్థనను పరిశీలించండి. అదిలా ఆరంభమవుతుంది: “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక.” (మత్తయి 6:9, 10) ఆ తర్వాత ఒకసారి యేసు, దేవునికి ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నీ నామము మహిమపరచుము.” దానికి జవాబుగా దేవుడు పరలోకం నుండి మాట్లాడుతూ ఇలా అన్నాడు: “నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును.” (యోహాను 12:28) కాబట్టి, దేవుని పేరు అతి ప్రాముఖ్యమైనదని స్పష్టమవుతోంది. మరి అలాంటప్పుడు కొంతమంది అనువాదకులు తమ అనువాదాల్లో ఆ పేరును ఉపయోగించకుండా దాని స్థానంలో ఇతర పదాలను ఎందుకు వాడారు?

దానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. మొదటిది, తొలుత ఆ పేరును ఎలా పలికారో నేడు సరిగ్గా తెలియదు కాబట్టి దానిని ఉపయోగించకూడదని చాలామంది అంటారు. ప్రాచీన హీబ్రూ భాషను అచ్చులు ఉపయోగించకుండా వ్రాసేవారు. కాబట్టి బైబిలు కాలాల్లో ప్రజలు యహ్‌వహ్‌ అనే హీబ్రూ అక్షరాలను ఖచ్చితంగా ఎలా పలికేవారో నేడు ఎవరూ చెప్పలేరు. అంతమాత్రాన మనం దేవుని పేరును ఉపయోగించకుండా ఉండాలా? బైబిలు కాలాల్లో యేసు పేరును యెషువ అనో యెహోషువ అనో ఉచ్ఛరించి ఉండవచ్చు—అయితే ఫలానా విధంగానే పలికేవారని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రజలు యేసు పేరును తమ భాషలో సాధారణమైన పద్ధతిలో ఉచ్ఛరిస్తూ వివిధ రీతుల్లో దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. మొదటి శతాబ్దంలో ఆ పేరును ఎలా ఉచ్ఛరించేవారో తెలియనంతమాత్రాన ఆ పేరును ఉపయోగించడానికి ప్రజలు వెనుకాడడం లేదు. అదేవిధంగా, మీరు వేరొక దేశానికి వెళ్తే, అక్కడి భాషలో మీ పేరునే ఇంకో రకంగా పలకడాన్ని మీరు వినవచ్చు. కాబట్టి దేవుని పేరుకు సంబంధించి ప్రాచీనకాల ఉచ్ఛారణ స్పష్టంగా తెలియదనే మాట దానిని ఉపయోగించకుండా ఉండడానికి కారణమే కాదు.

బైబిలులో నుండి దేవుని పేరును తొలగించడానికి తరచూ చెప్పబడే రెండవ కారణం యూదుల దీర్ఘకాల ఆచారానికి సంబంధించినది. వారిలో చాలామంది దేవుని పేరును ఎన్నటికీ ఉచ్ఛరించరాదనే నమ్ముతారు. ఈ నమ్మకం “నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు” అనే బైబిలు నియమాన్ని తప్పుగా అన్వయించడపనే ఆధారపడి ఉందని స్పష్టమవుతోంది.—నిర్గమకాండము 20:7.

దేవుని పేరును దుర్వినియోగం చేయడాన్ని ఈ నియమం నిషేధిస్తోంది. అయితే ఆయన పేరును గౌరవపూర్వకంగా ఉపయోగించడాన్ని కూడా అది నిషేధిస్తోందా? ఎంతమాత్రం నిషేధించడం లేదు. హీబ్రూ బైబిలు (“పాత నిబంధన”) వ్రాసిన రచయితలు అందరూ, ప్రాచీన ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రానికి అనుగుణంగా జీవించిన విశ్వాసులే. వారు దేవుని పేరును తరచుగా ఉపయోగించారు. ఉదాహరణకు, ఆరాధకులు గుంపులుగా చేరి బిగ్గరగా పాడిన అనేక కీర్తనల్లో వారు ఆ పేరును చేర్చారు. యెహోవా దేవుడు తన నామమున ప్రార్థించమని కూడా అడిగాడు, విశ్వాసులు ఆ మాటకు లోబడ్డారు. (యోవేలు 2:32; అపొస్తలుల కార్యములు 2:21) కాబట్టి, నేడు క్రైస్తవులు యేసు ఉపయోగించినట్లే దేవుని పేరును గౌరవపూర్వకంగా ఉపయోగించడానికి వెనుకాడరు.—యోహాను 17:26.

దేవుని పేరుకు బదులు ఇతర పదాలను వాడడంలో బైబిలు అనువాదకులు గంభీరమైన తప్పు చేస్తున్నారు. వారు దేవుని వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ఆయనను దూరం చేస్తున్నారు, కానీ బైబిలు అందుకు భిన్నంగా ‘యెహోవాతో సాన్నిహిత్యాన్ని’ పెంపొందించుకోవాలని మానవులకు ఉద్బోధిస్తోంది. (కీర్తన 25:14,NW) మీ సన్నిహిత స్నేహితుని గురించి ఆలోచించండి. ఒకవేవ మీ స్నేహితుని పేరే మీకు తెలియకుంటే మీరు ఆయనకు ఎంత సన్నిహితం అవుతారు? అదేవిధంగా, ప్రజలకు యెహోవా దేవుని పేరే చెప్పకుంటే, వారు దేవునికి నిజంగా సన్నిహితులు ఎలా కాగలరు? అంతేకాక, ప్రజలు దేవుని పేరు ఉపయోగించకపోతే, ఆ పేరుకున్న అద్భుతమైన అర్థమే వారికి తెలియదు. ఈ దైవిక నామానికి ఉన్న అర్థమేమిటి?

దేవుడే స్వయంగా తన పేరుకున్న అర్థాన్ని తన నమ్మకమైన సేవకుడైన మోషేకు వివరించాడు. దేవుని పేరు గురించి మోషే అడిగినప్పుడు యెహోవా దానికి ఇలా జవాబిచ్చాడు: “నేను ఎలా కావాలంటే అలా అవుతాను.” (నిర్గమకాండము 3:14, NW) రోథర్‌హామ్‌ అనువాదం ఆ వచనాన్ని ఇలా అనువదిస్తోంది: “నాకు ఎలా ఇష్టమో ఆ రీతిగా నేను అవుతాను.” కాబట్టి యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా అవసరమైతే అలా అవుతాడు. తను చేసిన సృష్టి విషయంలో, తన సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో ఆయన ఏది చేయాలనుకున్నా చేయగలడు.

మీరు ఎలా కావాలనుకుంటే అలా అవుతారే అనుకోండి. అలాంటప్పుడు మీరు మీ స్నేహితుల కోసం ఏమి చేస్తారు? ఒక స్నేహితుడు తీవ్ర అస్వస్థతకు గురైతే మీరు నైపుణ్యంగల ఒక వైద్యునిగా మారి ఆయనకు చికిత్స చేయగలుగుతారు. మరొక స్నేహితుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటే, మీరొక ధనవంతుడైన దాతగా మారి ఆయనను ఆదుకోగలుగుతారు. అయితే వాస్తవమేమిటంటే, మీరలా మారగలిగే మీ సామర్థ్యం పరిమితమైనది. మనందరి పరిస్థితీ అలాంటిదే. కానీ మీరు బైబిలు అధ్యయనం చేస్తున్నకొద్దీ యెహోవా తన సంకల్పాలను నెరవేర్చడానికి ఎలా అవసరమైతే అలా అవడాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. తనను ప్రేమించే వారి పక్షాన తన శక్తిని ఉపయోగించడం ఆయనకు చాలా ఇష్టం. (2 దినవృత్తాంతములు 16:9) యెహోవా పేరు తెలియని వారు ఆయన వ్యక్తిత్వపు ఈ చక్కని అంశాలను గ్రహించలేరు.

కాబట్టి యెహోవా అనే పేరు బైబిల్లో ఉండాలి. ఆ పేరు అర్థాన్ని తెలుసుకోవడం, మన ఆరాధనలో దానిని విస్తృతంగా ఉపయోగించడం మన పరలోకపు తండ్రి అయిన యెహోవాకు సన్నిహితమవడానికి శక్తిమంతమైన సహాయకాలుగా ఉంటాయి. a

a దేవుని పేరు, దాని అర్థం, ఆరాధనలో దానిని ఉపయోగించడానికిగల కారణాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం) అనే బ్రోషుర్‌ చూడండి.