కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?

ఆందోళనను ఎలా తగ్గించుకోవచ్చు?

 అతిగా ఆందోళనపడడం మీ శరీరానికి, మనసుకు మంచిది కాదు. మీ అసలు సమస్య గోరంత అయితే, దాని గురించి అతిగా ఆందోళనపడడం వల్ల వచ్చే సమస్యలు కొండంత కావచ్చు.

ఆందోళన తగ్గించుకోవడానికి చిట్కాలు

  •  చెడు వార్తలు అతిగా చూడకండి లేదా చదవకండి. ఏదైనా ఒక చెడు సంఘటన గురించి మీరు అన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. విపత్తుల గురించిన వార్తలు ఎక్కువగా తెలుసుకోవడం వల్ల మీలో భయం, నిరాశ పెరిగిపోతాయి.

     బైబిలు సలహా: “నలిగిన మనస్సు ఒంట్లో శక్తినంతా లాగేస్తుంది.”సామెతలు 17:22.

     “బ్రేకింగ్‌ న్యూస్‌లు, షాకింగ్‌ న్యూస్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అని మనకు అనిపిస్తుంది. కానీ అది అంత మంచిది కాదు. న్యూస్‌లు చూడడం తగ్గించుకున్నప్పుడు నా ఆందోళన కూడా తగ్గిపోతుంది.”—జాన్‌.

     ఒకసారి ఆలోచించండి: ప్రతీ న్యూస్‌ తెలుసుకోవాల్సిన అవసరం మీకు నిజంగా ఉందా?

  •  అన్నీ టైంకి చేయడం అలవాటు చేసుకోండి. నిద్ర లేవడానికి, తినడానికి, పనులు చేసుకోవడానికి, పడుకోవడానికి ఒక టైం పెట్టుకుని, రోజూ అదే టైంకి వాటిని చేయండి. అలా అన్నీ టైం ప్రకారం చేస్తుంటే, మీ జీవితం మామూలుగానే సాగిపోతున్నట్టు అనిపిస్తుంది, మీ ఆందోళన తగ్గుతుంది.

     బైబిలు సలహా: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.”సామెతలు 21:5.

     “కోవిడ్‌-19 మొదలైనప్పుడు, నేను నా టైం టేబుల్‌ని పక్కన పెట్టేసి, వినోదం కోసం ఎక్కువ టైం వృథా చేశాను. తర్వాత నా టైంని సరిగ్గా ఉపయోగించడం కోసం, నేను రోజూ చేయాల్సిన పనులన్నిటికి ఒక షెడ్యూల్‌ వేసుకున్నాను.”—జోసెఫ్‌.

     ఒకసారి ఆలోచించండి: ‘ఈరోజు నేను నా పనులన్నీ చేసేశాను’ అని మీకు అనిపించేలా, ఒక మంచి షెడ్యూల్‌ ఫాలో అవుతున్నారా?

  •  మంచి విషయాల పైనే మనసుపెట్టండి. ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో అని, చివరికి పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుందేమో అని ఏవేవో ఊహించుకుంటూ కూర్చుంటే మీ ఆందోళన ఇంకా ఎక్కువౌతుంది. దానికి బదులు, మీ జీవితంలో ఇప్పుడున్న రెండు-మూడు మంచి విషయాల గురించి ఆలోచించి, వాటిని బట్టి కృతజ్ఞతతో ఉండండి.

     బైబిలు సలహా: “కృతజ్ఞులై ఉండండి.”కొలొస్సయులు 3:15.

     “చెడు వార్తలు చూసే బదులు, బైబిలు చదవడం వల్ల మంచి విషయాల మీదే మనసుపెట్టగలుగుతాను. ఇది చిన్న చిట్కాలా అనిపించవచ్చు, కానీ ఇది బాగా పనిచేస్తుంది!”—లీసా.

     ఒకసారి ఆలోచించండి: మీరు మీ జీవితంలో జరుగుతున్న చెడు విషయాల గురించే ఆలోచిస్తూ, మీ జీవితంలోని మంచి విషయాల్ని మర్చిపోతుంటారా?

  •  వేరేవాళ్ల గురించి ఆలోచించండి. ఆందోళనగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండిపోవాలి అనిపిస్తుంది. కానీ అలా ఉండిపోకుండా, అవసరంలో ఉన్నవాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చో ఆలోచించండి.

     బైబిలు సలహా: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”ఫిలిప్పీయులు 2:4.

     “వేరేవాళ్ల కోసం ఏదైనా చేస్తే నాకు ఆనందంగా అనిపిస్తుంది. దానివల్ల వాళ్లకు సంతోషంగా ఉంటుంది, నా ఆందోళన కూడా తగ్గుతుంది. ఇలాచేస్తే, అసలు ఆందోళన పడడానికి టైం ఎక్కడ ఉంటుంది?”—మరియ.

     ఒకసారి ఆలోచించండి: మీకు తెలిసిన వాళ్లలో ఎవరికైనా ఇతరుల సహాయం అవసరమా? వాళ్లకు మీరేమైనా సహాయం చేయగలరా?

  •  ఆరోగ్యంగా ఉండండి. ఎక్సర్‌సైజ్‌ (వ్యాయామం) చేయండి, కంటినిండా నిద్రపోండి. మంచి ఆహారం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీరు జీవితంలో మంచి విషయాల పైన మనసుపెట్టగలుగుతారు, ఆందోళనను తగ్గించుకోగలుగుతారు.

     బైబిలు సలహా: “వ్యాయామం ... ప్రయోజనకరం.”1 తిమోతి 4:8, అధస్సూచి.

     “నాకు, మా అబ్బాయికి బయటికి వెళ్లి ఎక్సర్‌సైజ్‌ చేయడం అంతగా కుదరదు. కాబట్టి మేము రోజూ ఇంట్లోనే ఎక్సర్‌సైజ్‌ చేయడానికి ఒక షెడ్యూల్‌ వేసుకున్నాం. దానివల్ల ఇప్పుడు మాకు హాయిగా అనిపిస్తుంది. ఒకరితో ఒకరం ఓర్పుగా, దయగా ఉంటున్నాం.”—క్యాథరిన్‌.

     ఒకసారి ఆలోచించండి: మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడం కోసం ఇంకాస్త మంచి ఆహారం తీసుకోవడం, ఇంకాస్త ఎక్కువ ఎక్సర్‌సైజ్‌లు చేయడం అవసరమా?

 చాలామంది తమ ఆందోళన తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు పాటించారు. దాంతోపాటు, వాళ్లు భవిష్యత్తు గురించి బైబిల్లో ఉన్న మంచి విషయాలు తెలుసుకుని ప్రయోజనం పొందారు. “దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?” అనే ఆర్టికల్‌ చూడండి.