కంటెంట్‌కు వెళ్లు

పైన: 1964 లో, ఆమ్‌ స్టర్‌ డామ్‌లో ఉన్న బేతేలు భవనం. కింద: 1950లలో, 1960లలో బేతేలులో పని చేస్తున్న సహోదర సహోదరీలు

అక్టోబరు 7, 2022
నెదర్లాండ్స్‌

నెదర్లాండ్స్‌ వందేళ్ల చరిత్రలోని కష్టసుఖాలు

నెదర్లాండ్స్‌ వందేళ్ల చరిత్రలోని కష్టసుఖాలు

2022 సంవత్సరంతో, నెదర్లాండ్స్‌ రాజధాని నగరమైన ఆమ్‌ స్టర్‌ డామ్‌లో మన బ్రాంచి కార్యాలయం స్థాపించబడి వందేళ్లు పూర్తికావస్తుంది. అక్కడ యెహోవాసాక్షుల చరిత్రలో మన సహోదర సహోదరీలు తిరుగులేని విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించారు.

20వ శతాబ్దం మొదట్లో, హెన్రిచ్‌ బ్రింకాఫ్‌ అనే యువకుడు వాచ్‌టవర్‌ సొసైటీ అలాగే ఇంటర్‌ నేషనల్‌ బైబిలు స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ ప్రచురించిన పత్రికల్ని చదవడంతో నెదర్లాండ్స్‌కు మంచివార్త చేరింది. తర్వాత కొంతకాలానికే ఆయన నేర్చుకున్న విషయాల్ని వేరేవాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా సత్యపు విత్తనాలు ఎదగడం మొదలయ్యాయి. 1920 లో, సహోదరుడు జోసెఫ్‌ యఫ్‌. రూథర్‌ఫర్డ్‌ యూరప్‌ను సందర్శించి, స్విట్జర్లాండ్‌లో బ్రాంచి కార్యాలయాన్ని స్థాపించాడు. అదే కార్యాలయం నెదర్లాండ్స్‌ని కూడా చూసుకునేది. 1921 లో, సహోదరుడు రూథర్‌ఫర్డ్‌ నెదర్లాండ్స్‌లో జరుగుతున్న పనిని పర్యవేక్షించడానికి సహోదరుడు అడ్రియాన్‌ బ్లాక్‌ని నియమించాడు. 1922 లో ఆమ్‌ స్టర్‌ డామ్‌లో బ్రాంచి కార్యాలయం స్థాపించబడింది.

బ్రాంచి కార్యాలయం స్థాపించబడడంతో ప్రకటనా పని క్రమ పద్ధతిలో ముందుకెళ్లింది. యెహోవా ఆరాధకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధానికి కొంచెం ముందు, ఆ దేశంలో ఉత్సాహంగా పనిచేసే దాదాపు 500 మంది ప్రచారకులు ఉన్నారు.

యుద్ధం మొదలైనప్పుడు నెదర్లాండ్స్‌ని నాజీ ప్రభుత్వం ఆక్రమించుకుంది. ఆ ప్రభుత్వం వేరే వాళ్లతో పోలిస్తే యెహోవాసాక్షుల మీద ఎక్కువ గురి పెట్టి వాళ్లను హింసించింది. అలా ఆక్రమించుకునేటప్పుడు 300 మంది డచ్‌ భాష మాట్లాడే సాక్షుల్ని నాజీ ప్రభుత్వం దేశం నుండి బహిష్కరించింది. అలాగే చాలామందిని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంపులకు పంపించింది. ఒంట్లో బాగోకపోవడంతో, ఇంకా వేరే కష్టాలతో దాదాపు 130 మంది సహోదరులు చనిపోయారు. ఇంత హింస ఎదురైనా 1945 లో యుద్ధం ముగిసేసరికి నెదర్లాండ్స్‌లో ఉన్న యెహోవాసాక్షుల సంఖ్య 3,125కు చేరుకుంది.

యుద్ధానికి తెర పడింది కానీ కష్టాలకు కాదు. క్యాథలిక్‌ చర్చి దేశంలోని దక్షిణ భాగంలో ఉన్న సాక్షుల్ని బాగా వ్యతిరేకించింది. ఉదాహరణకు, 1952 లో వెన్లోలో జరుగుతున్న సమావేశాన్ని క్యాథలిక్‌ చర్చి ఆపాలని చూసింది. ఈ వ్యతిరేకత కారణంగా సాక్షులు సమావేశం జరుపుకోవడానికి తీసుకున్న హాలు కాంట్రాక్టులన్నీ రద్దయ్యాయి. అయినా సరే సహోదరులు మాత్రం ఆగలేదు. ఒక ఖాళీ స్థలంలో టెంటు వేసుకుని సమావేశాన్ని జరుపుకున్నారు.

వ్యతిరేకులు అంతటితో ఊరుకోలేదు. ఒకసారైతే కార్యక్రమాన్ని ఆపడానికి 1,000 మంది గుంపుగా వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కార్యక్రమం జరుగుతున్నప్పుడు, పోలీసులు సమావేశ స్థలం మీద దాడిచేసి, కొంతమంది సహోదరుల్ని అరెస్టు చేశారు.

ఎమ్మెన్‌లో ఇప్పుడున్న బ్రాంచి కార్యాలయం

వ్యతిరేకులు చేసిన ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. బ్రాంచి కార్యాలయం ఇచ్చిన నిర్దేశాల్ని బాధ్యతల్లో ఉన్న కొంతమంది సహోదరులు జాగ్రత్తగా పాటించి సమావేశ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు.

సహోదరులు పట్టు వదలకుండా చేసిన ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదిస్తూ వచ్చాడు. 1983 లో, నెదర్లాండ్స్‌లో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని ఎమ్మెన్‌కు మార్చారు. 2022 సంవత్సరానికి నెదర్లాండ్స్‌లో ఉన్న యెహోవాసాక్షుల సంఖ్య దాదాపు 30,000లకు చేరుకుంది.

యెహోవా తన ప్రజల్ని “విడిచిపెట్టడు, వదిలేయడు” అని నెదర్లాండ్స్‌లో ఉన్న యెహోవాసాక్షుల చరిత్ర రుజువు చేస్తుంది.—ద్వితీయోపదేశకాండం 31:6.