కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’?

మనమెందుకు ‘మెలకువగా ఉండాలి’?

“ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు.”మత్త. 24:42.

పాటలు: 136, 54

1. మనం సమయాన్ని లేదా మన చుట్టూ జరుగుతున్నవాటిని గమనించడం ఎందుకు ప్రాముఖ్యమో ఓ ఉదాహరణతో చెప్పండి. (ప్రారంభ చిత్రం చూడండి.)

 కొన్ని నిమిషాల్లో సమావేశం మొదలౌతుంది. ఛైర్మన్‌ స్టేజీ మీదకు వచ్చి అందరికీ స్వాగతం పలికి, సంగీతం మొదలవ్వబోతోందని చెప్పాడు. అందరూ తమ సీట్లలో కూర్చోవడానికి అది సమయమని ప్రేక్షకులకు తెలుసు. వాళ్లు ఆ శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ, ఆ రోజు ప్రసంగాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లలో కొంతమంది మాత్రం ఛైర్మన్‌ మాటల్నిగానీ సంగీతాన్నిగానీ పట్టించుకోలేదు. కాబట్టి సమావేశం మొదలవ్వబోతోందన్న విషయాన్ని వాళ్లు గుర్తించకుండా అటూఇటూ తిరుగుతూ ఉన్నారు, తమ స్నేహితులతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం సమయాన్ని లేదా మన చుట్టూ జరుగుతున్నవాటిని గమనించుకోకపోతే ఏమి జరిగే అవకాశముందో ఈ సందర్భాన్నిబట్టి అర్థమౌతుంది. ఇది మనకు ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. అదేమిటంటే అతిత్వరలో ఓ గొప్ప సంఘటన జరగనుంది, దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. ఇంతకీ ఏంటా సంఘటన?

2. ‘మెలకువగా ఉండండి’ అని యేసు తన శిష్యులకు ఎందుకు చెప్పాడు?

2 “యుగసమాప్తి” గురించి మాట్లాడుతూ యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, “జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.” ఆ తర్వాత ఆయన మళ్లీ, ‘మెలకువగా ఉండండి’ అని వాళ్లకు చెప్పాడు. (మత్త. 24:3; మార్కు 13:32-37 చదవండి.) ఈ విషయం గురించి యేసు ఎన్నోసార్లు తన శిష్యుల్ని హెచ్చరించాడని మత్తయి పుస్తకంలో చూస్తాం. ఆయన వాళ్లతో, “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి” అని చెప్పాడు. ఆ తర్వాత ఇలా హెచ్చరించాడు, “మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి.” ఆ తర్వాత మళ్లీ, “ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి” అని చెప్పాడు.—మత్త. 24:42-44; 25:13.

3. యేసు ఇచ్చిన హెచ్చరికను మనమెందుకు ప్రాముఖ్యంగా ఎంచుతాం?

3 యేసు ఇచ్చిన హెచ్చరికను యెహోవాసాక్షులు ప్రాముఖ్యంగా ఎంచుతారు. మనం చివరిరోజుల్లో జీవిస్తున్నామని, అతిత్వరలో మహాశ్రమలు మొదలౌతాయని మనకు తెలుసు. (దాని. 12:4; మత్త. 24:21) యేసు ముందే చెప్పినట్టు, యెహోవా ప్రజలు దేవుని రాజ్యం గురించిన మంచివార్తను భూమంతటా ప్రకటిస్తున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో యుద్ధాలు, రోగాలు, భూకంపాలు, కరువులు సంభవిస్తున్నాయి. మతపరమైన గందరగోళం, నేరం, హింస ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎక్కువైపోయాయి. (మత్త. 24:7, 11, 12, 14; లూకా 21:11) కాబట్టి, యేసు వచ్చి తన తండ్రి సంకల్పాన్ని నెరవేర్చే ఆ సమయం కోసం మనమిప్పుడు ఆతురతతో ఎదురుచూస్తున్నాం.—మార్కు 13:26, 27.

ఆ దినం చాలా దగ్గర్లో ఉంది

4. (ఎ) హార్‌మెగిద్దోను యుద్ధం ఎప్పుడు జరుగుతుందో యేసుకు ఇప్పుడు తెలుసని మనమెలా చెప్పవచ్చు? (బి) మహాశ్రమలు ఎప్పుడు మొదలౌతాయో తెలియకపోయినా, మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

4 సమావేశానికి వెళ్లినప్పుడు, ప్రతీ సెషన్‌ ఏ సమయానికి మొదలౌతుందో మనకు తెలుస్తుంది. కానీ మహాశ్రమలు ఖచ్చితంగా ఎప్పుడు మొదలౌతాయో తెలుసుకోవడం మనకు అసాధ్యం. “ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు” అని యేసు అన్నాడు. (మత్త. 24:36) అయితే, హార్‌మెగిద్దోను యుద్ధానికి నాయకత్వం వహించేది యేసే కాబట్టి ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో ఆయనకు ఇప్పుడు తెలిసేవుంటుంది. (ప్రక. 19:11-16) కానీ మనకు మాత్రం అంతం వచ్చే తేదీగానీ, సమయంగానీ ఇంకా తెలీదు. అందుకే మనం మెలకువగా ఉండడం చాలా ప్రాముఖ్యం. మహాశ్రమలు మొదలయ్యే సమయాన్ని యెహోవా నిర్ణయించాడు, రోజులు గడిచేకొద్దీ మనం ఆ సమయానికి దగ్గరౌతున్నాం. అది “జాగుచేయక వచ్చును” అని బైబిలు చెప్తుంది. (హబక్కూకు 2:1-3 చదవండి.) ఆ మాటల్ని మనమెందుకు నమ్మవచ్చు?

5. యెహోవా చెప్పినవన్నీ సరైన సమయానికే నెరవేరతాయనడానికి ఓ ఉదాహరణ చెప్పండి.

5 యెహోవా చెప్పినవన్నీ సరైన సమయానికే నెరవేరాయి. ఉదాహరణకు, యెహోవా తన ప్రజలను ఈజిప్టు నుండి విడిపించిన రోజు గురించి ఆలోచించండి. సా.శ.పూ. 1513, నీసాను నెల 14న ఆయన వాళ్లను విడిపించాడు. ఆ రోజు గురించి మోషే తర్వాత ఇలా చెప్పాడు, “ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను.” (నిర్గ. 12:40-42) సా.శ.పూ. 1943, నీసాను నెల 14న అంటే ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి విడిపించడానికి సరిగ్గా 430 సంవత్సరాల క్రితం యెహోవా అబ్రాహాము సంతానాన్ని ఆశీర్వదిస్తానని చేసిన వాగ్దానం నెరవేరడం మొదలైంది. (గల. 3:17, 18) కొంతకాలం తర్వాత యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు, “నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగువందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు.” (ఆది. 15:13-14; అపొ. 7:6) ఆ 400 సంవత్సరాలు, సా.శ.పూ. 1913లో అంటే ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేసినప్పుడు మొదలై, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి విడిపించినప్పుడు ముగిశాయి. (ఆది. 21:8-10; గల. 4:22-29) అవును, తన ప్రజలను విడిపించే తేదీని యెహోవా వందల సంవత్సరాల ముందే నిర్ణయించాడు.

6. యెహోవా తన ప్రజలను రక్షిస్తాడని మనమెందుకు నమ్మవచ్చు?

6 ఈజిప్టు నుండి విడుదలైన ఇశ్రాయేలీయుల్లో యెహోషువ కూడా ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచాక అతను ఇశ్రాయేలీయులకు ఇలా గుర్తుచేశాడు, “మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటియైనను తప్పియుండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు; అవి అన్నియు మీకు కలిగెను, వాటిలో ఒక్కటియైనను తప్పియుండలేదు.” (యెహో. 23:2, 14) తన ప్రజలను మహాశ్రమల నుండి తప్పించి కొత్తలోకంలో నిత్యజీవం ఇస్తానని యెహోవా మాటిచ్చాడు. ఆ మాట నిజమౌతుందని మనం నమ్మవచ్చు. మనం కొత్తలోకంలో ఉండాలనుకుంటే మెలకువగా ఉండాలి.

రక్షణ పొందాలంటే మెలకువగా ఉండాలి

7, 8. (ఎ) పూర్వకాలంలోని కావలివాళ్ల పని ఏమిటి? అది మనకు ఏ పాఠాన్ని నేర్పిస్తుంది? (బి) కావలివాళ్లు కాపలా కాస్తున్నప్పుడు నిద్రపోతే ఏమి జరుగుతుందో ఓ ఉదాహరణ చెప్పండి.

7 పూర్వకాలంలో పట్టణాలను కాపలా కాసేవాళ్ల నుండి మనం ఓ పాఠం నేర్చుకోవచ్చు. శత్రువులు పట్టణాల లోపలికి జొరబడకుండా ఉండేందుకు, యెరూషలేము లాంటి చాలా పట్టణాల చుట్టూ పెద్దపెద్ద గోడలు ఉండేవి. కావలివాళ్లు వాటిమీద నిలబడి పట్టణం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని చూసేవాళ్లు. ఇంకొంతమంది కావలివాళ్లు పట్టణ ద్వారాల దగ్గర నిలబడేవాళ్లు. కావలివాళ్లు రాత్రింబగళ్లు కాపలా కాస్తూ, ఒకవేళ శత్రువులు వస్తున్నట్లు కనిపిస్తే పట్టణంలో ఉన్నవాళ్లను హెచ్చరించాలి. (యెష. 62:6) మెలకువగా ఉంటూ, చుట్టూ జరుగుతున్నవాటిని జాగ్రత్తగా గమనించడం ఎంత ప్రాముఖ్యమో ఆ కావలివాళ్లకు తెలుసు. వాళ్లు మెలకువగా ఉండకపోతే, చాలామంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.—యెహె. 33:6.

8 సా.శ. 70లో రోమన్లు యెరూషలేములోకి ఎలా ప్రవేశించగలిగారో, యూదా చరిత్రకారుడైన జోసిఫస్‌ వివరించాడు. ఆ పట్టణాన్ని ఒకవైపు కాపలా కాస్తున్నవాళ్లు నిద్రలోకి జారుకున్నారు. దానివల్ల, రోమా సైనికులు లోపలికి ప్రవేశించగలిగారు. వాళ్లు దేవాలయాన్ని తగలబెట్టి, మిగతా పట్టణాన్ని కూడా నాశనం చేశారు. యూదా జనాంగం అంతకుముందెప్పుడూ చూడని గొప్ప శ్రమల చివరి భాగం అదే.

9. నేడు చాలామంది ఏ విషయాన్ని గుర్తించట్లేదు?

9 నేడు చాలా ప్రభుత్వాలు సైనికుల్ని, ఆధునిక టెక్నాలజీతో ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్‌ని తమ సరిహద్దుల దగ్గర కాపలా ఉంచుతున్నాయి. అలా తమ దేశం మీద శత్రువులు చేసే దాడిని ముందుగానే గుర్తిస్తున్నాయి. కానీ యేసు రాజుగా పరిపాలించే మరింత శక్తిమంతమైన పరలోక ప్రభుత్వం ఒకటుందనీ, అది త్వరలోనే భూమ్మీదున్న ప్రభుత్వాలన్నిటితో యుద్ధం చేస్తుందనీ వాళ్లు గుర్తించట్లేదు. (యెష. 9:6, 7; 56:10; దాని. 2:44) అయితే మనం మాత్రం ఆ రోజు కోసం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ, దానికి సిద్ధపడుతున్నాం. అందుకే మనం బైబిలు చెప్తున్నవాటిమీద మనసుపెడుతూ, యెహోవాను నమ్మకంగా సేవిస్తూ ఉంటాం.—కీర్త. 130:6.

పక్కకు మళ్లకండి

10, 11. (ఎ) మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఎందుకు? (బి) బైబిలు చెప్తున్న విషయాల్ని ప్రజలు పట్టించుకోకపోవడానికి సాతానే కారణమని మీరు దేన్నిబట్టి చెప్తారు?

10 రాత్రంతా మెలకువగా ఉన్న ఓ కావలివాని గురించి ఆలోచించండి. అతను చాలా అలసిపోయి ఉంటాడు కాబట్టి ఇంకొన్ని గంటల్లో తెల్లవారుతోందనగా మెలకువగా ఉండడం అతనికి చాలా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా, మనం చివరిరోజుల్లో జీవిస్తున్నాం, అంతానికి దగ్గరయ్యేకొద్దీ మెలకువగా ఉండడం మనకు మరింత కష్టంగా ఉంటుంది. ఒకవేళ మనం మెలకువగా ఉండకపోతే ఎంతో నష్టపోతాం. కాబట్టి మనల్ని మెలకువగా ఉండనివ్వకుండా చేయగల మూడు విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

11 సాతాను చేసే మోసాలు. “ఈ లోకాధికారి” సాతాను అనే నిజాన్ని యేసు తాను చనిపోవడానికి కొన్నిరోజుల ముందు తన శిష్యులకు మూడుసార్లు గుర్తుచేశాడు. (యోహా. 12:31; 14:30; 16:9-11) ప్రజలను మోసం చేయడానికి సాతాను అబద్ధమతాన్ని ఉపయోగించాడు. అందుకే, అంతం చాలా దగ్గర్లో ఉందనడానికి బైబిల్లో ఉన్న స్పష్టమైన రుజువుల్ని నేడు చాలామంది పట్టించుకోవట్లేదు. (జెఫ. 1:14) అవును, సాతాను ‘అవిశ్వాసులైనవాళ్ల మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేశాడు.’ (2 కొరిం. 4:3-6) దాంతో ఈ లోకాంతం దగ్గర్లో ఉందనీ, యేసు ఇప్పుడు పరిపాలిస్తున్నాడనీ మనం ప్రజలకు చెప్తున్నప్పుడు చాలామంది “మాకు ఆసక్తిలేదు” అని అంటున్నారు.

12. మనల్ని మోసం చేసే అవకాశం సాతానుకు ఎందుకు ఇవ్వకూడదు?

12 బైబిల్లో ఉన్న రుజువుల్ని చాలామంది పట్టించుకోకపోయినా మనం నిరుత్సాహపడకూడదు. మెలకువగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో మనకు తెలుసు. పౌలు తోటి సహోదరులకు ఇలా చెప్పాడు, “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.” (1 థెస్సలొనీకయులు 5:1-6 చదవండి.) యేసు మనల్ని ఇలా హెచ్చరించాడు, ‘మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వస్తాడు కాబట్టి సిద్ధంగా ఉండండి.’ (లూకా 12:39, 40) త్వరలోనే సాతాను, లోకం “నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదు” అని ప్రజలు అనుకునేలా చేయడం ద్వారా కూడా వాళ్లను మోసం చేస్తాడు. అప్పుడు యెహోవా దినం హఠాత్తుగా వస్తుంది, అది చూసి వాళ్లు అవాక్కవుతారు. మరి మన విషయమేమిటి? మనం ఇతరుల్లా మోసపోకూడదన్నా, ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలన్నా, ‘మెలకువగా ఉండి మత్తులం కాకుండా ఉండాలి.’ దానికోసం మనం ప్రతీరోజు బైబిలు చదువుతూ యెహోవా చెప్పేవాటి గురించి లోతుగా ఆలోచించాలి.

13. ఈ లోకం మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తోంది? దానివల్ల వచ్చే ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే మనమేమి చేయాలి?

13 ప్రజల ఆలోచనా విధానాన్ని ఈ లోకం ప్రభావితం చేస్తుంది. ఈ రోజుల్లో చాలామంది, తాము దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. (మత్త. 5:3) వాళ్లు తమ సమయాన్ని, శక్తిని ఎక్కువశాతం ఈ లోకంలో ఉన్నవాటిని సంపాదించడానికి వెచ్చిస్తున్నారు. (1 యోహా. 2:16) అంతేకాదు, ప్రజల్ని ఆకర్షించే వినోదం ఇంతకుముందుకన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. అది వాళ్లను సుఖాన్ని ప్రేమించమని, తమకున్న ఏ కోరికనైనా తీర్చుకోమని ప్రోత్సహిస్తోంది. (2 తిమో. 3:4) ప్రజలు మరింత ప్రాముఖ్యమైన వాటిమీద మనసుపెట్టకుండా అవి వాళ్లను పక్కదారి పట్టిస్తున్నాయి. దాంతో వాళ్లు దేవునితో తమకున్న సంబంధం గురించి ఆలోచించడం లేదు. అందుకే, తమ కోరికలను తీర్చుకోవడం గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండకుండా ‘నిద్రమేలుకోవాలి’ అని పౌలు క్రైస్తవులకు గుర్తుచేశాడు.—రోమా. 13:11-14.

14. లూకా 21:34, 35లో మనకు ఏ హెచ్చరిక ఉంది?

14 మన ఆలోచనలపై ఈ లోకం కాదుగానీ దేవుని పవిత్రశక్తి పనిచేయాలని కోరుకుంటాం. జరగబోయే వాటిని స్పష్టంగా అర్థంచేసుకోవడానికి యెహోవా తన పవిత్రశక్తి ద్వారా మనకు సహాయం చేశాడు. [1] (1 కొరిం. 2:12) అయినాసరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవితంలోని చిన్నచిన్న విషయాలు కూడా మన ధ్యాసను యెహోవా సేవనుండి పక్కకు మళ్లించగలవు. (లూకా 21:34, 35 చదవండి.) చివరిరోజుల్లో జీవిస్తున్నామని నమ్మడం మూర్ఖత్వమని వేరేవాళ్లు మనల్ని ఎగతాళి చేయవచ్చు. (2 పేతు. 3:3-7) కానీ వాళ్ల మాటలకు మనం నిరుత్సాహపడకూడదు, ఎందుకంటే అంతం దగ్గర్లో ఉందనడానికి మన దగ్గర ఖచ్చితమైన రుజువులు ఉన్నాయి. కాబట్టి దేవుని పవిత్రశక్తి మనమీద పనిచేయాలని కోరుకుంటే, తోటి సహోదరసహోదరీలతో కలిసి మనం మీటింగ్స్‌కు క్రమంగా హాజరవ్వాలి.

‘మెలకువగా ఉండడానికి’ మీరు చేయగలిగినదంతా చేస్తున్నారా? (11-16 పేరాలు చూడండి)

15. పేతురు, యాకోబు, యోహానులకు ఏమి జరిగింది? వాళ్లలాగే మనకు కూడా ఏమి జరిగే అవకాశం ఉంది?

15 మన బలహీనతలవల్ల మనం మెలకువగా ఉండలేకపోవచ్చు. మనుషులు అపరిపూర్ణులని, వాళ్లలో బలహీనతలు ఉన్నాయని యేసు అర్థంచేసుకున్నాడు. ఆయన చనిపోవడానికి ముందురోజు రాత్రి ఏమి జరిగిందో చూడండి. తాను పరిపూర్ణుడైనప్పటికీ, చివరివరకు నమ్మకంగా ఉండాలంటే తన తండ్రి సహాయం కోసం ప్రార్థించాలని యేసుకు తెలుసు. ఆయన ప్రార్థన చేసుకోవడానికి వెళ్లినప్పుడు, మెలకువగా ఉండమని తన అపొస్తలులైన పేతురు, యాకోబు, యోహానులకు చెప్పాడు. కానీ మెలకువగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో వాళ్లు గుర్తించలేదు, వాళ్లు అలసిపోయి నిద్రపోయారు. యేసు కూడా బాగా అలసిపోయాడు అయినా ఆయన మెలకువగా ఉండి తన తండ్రికి ప్రార్థన చేశాడు. అపొస్తలులు కూడా ఆ సమయంలో ప్రార్థన చేస్తూ ఉండాల్సింది.—మార్కు 14:32-41.

16. లూకా 21:36 ప్రకారం ‘మెలకువగా ఉండాలంటే’ మనమేమి చేయాలని యేసు చెప్పాడు?

16 ‘మెలకువగా ఉంటూ’ యెహోవా దినం కోసం సిద్ధపడి ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది? ఎల్లప్పుడూ సరైనదాన్ని చేయాలనే బలమైన కోరిక మనలో ఉండాలి. అయితే అది మాత్రమే సరిపోదు. సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ ఉండాలని తాను చనిపోవడానికి కొన్నిరోజుల ముందు యేసు తన శిష్యులతో చెప్పాడు. (లూకా 21:36 చదవండి.) అంతం దగ్గరపడుతున్న ఈ సమయంలో మెలకువగా ఉండాలంటే మనం కూడా యెహోవాకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి.—1 పేతు. 4:7.

మెలకువగా ఉండండి

17. త్వరలో జరగబోయే దానికి మనమెలా సిద్ధపడవచ్చు?

17 మనం ‘అనుకోని గడియలో’ అంతం వస్తుందని యేసు చెప్పాడు. (మత్త. 24:44) కాబట్టి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సాతాను లోకంలో ఉన్నవాటిని ఆనందించడానికి ఇది సమయం కాదు. వాటిలో సంతోషం ఉందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. బదులుగా, మనం ఎలా మెలకువగా ఉండవచ్చో యెహోవా, యేసుక్రీస్తు బైబిలు ద్వారా చెప్తున్నారు. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలమీద, వాటి నెరవేర్పు మీద మనం మనసుపెడదాం. అంతేకాదు, మనం యెహోవాకు మరింత దగ్గరౌతూ ఆయన రాజ్యానికి మన జీవితంలో మొదటిస్థానం ఇద్దాం. అలా చేస్తే, అంతం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉంటాం. (ప్రక. 22:20) దానిమీదే మన ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి.

^ [1] (14వ పేరా) గాడ్స్‌ కింగ్‌డమ్‌ రూల్స్‌! పుస్తకంలో 21వ అధ్యాయం చూడండి.