కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కుటుంబ సభ్యుల పట్ల అనురాగాన్ని వ్యక్తం చేయండి

కుటుంబ సభ్యుల పట్ల అనురాగాన్ని వ్యక్తం చేయండి

కుటుంబ సభ్యుల పట్ల అనురాగాన్ని వ్యక్తం చేయండి

“నువ్వు దాన్ని కాల్చగలిగితే కాల్చు! కాల్చు!” అని టోరూ తన భార్య యోకోతో సవాలు చేశాడు. * “నేను ఖచ్చితంగా కాల్చేస్తాను,” అని మొండిగా సమాధానం చెప్పి వాళ్ళిద్దరు కలిసి తీయించుకున్న ఫోటోను కాల్చడానికి ఆమె అగ్గిపుల్ల వెలిగించింది. ఆ తర్వాత ఆమె “నేను మొత్తం ఇంటినే కాల్చేస్తాను!” అని కఠినంగా అన్నది. టోరూ తన భార్యను కొట్టి, వారిద్దరి మధ్య జరిగిన వాదనను దౌర్జన్యంతో ముగించాడు.

మూడు సంవత్సరాల క్రితం, టోరూ యోకోలు సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. మరి, పరిస్థితి ఇలా ఎందుకు మారింది? టోరూ చూడడానికి ఆహ్లాదకరమైన మనిషిలా కనిపించినా, ఆయన తనతో అనురాగంగా ఉండడంలేదనీ తన భావాలపట్ల చాలా అరుదుగా శ్రద్ధ చూపుతున్నాడనీ ఆయన భార్యకు అనిపించింది. ఆమె అనురాగానికి ప్రతిస్పందించే సామర్థ్యం తనకు లేదన్నట్లుగా ఉండేవాడు. ఈ పరిస్థితిని తట్టుకోలేక, యోకో కోపిష్ఠిగా తయారయ్యింది. ఆమెకు నిద్రలేమి, ఆందోళన, ఆకలి లేకపోవడం, చిరాకుపడడం, కృంగుదల, అకస్మాత్తుగా భయాందోళనలకు గురై ఏ పనీ చేయలేకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే, టోరూ ఇంట్లో నెలకొనివున్న ఉద్రిక్తమైన వాతావరణం గురించి ఏమీ పట్టనట్టుగా ఉండేవాడు. ఆ పరిస్థితి ఆయనకు మామూలుగానే అనిపించింది.

“అపాయకరమైన కాలములు”

ఇలాంటి సమస్యలు నేడు సర్వసాధారణమైపోయాయి. మన కాలంలో “అనురాగరహితులు” ఉంటారని అపొస్తలుడైన పౌలు ప్రవచించాడు. (ఇటాలిక్కులు మావి.) (2 తిమోతి 3:​1-5) ఇక్కడ “అనురాగరహితులు” అని అనువదించబడిన గ్రీక్‌ మూలపదం, కుటుంబ సభ్యుల మధ్య ఉండే సహజమైన అనురాగాన్ని వర్ణించే పదంతో ముడిపడివుంది. మనకాలంలో అలాంటి అనురాగం లేకుండా పోయింది. అనురాగం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఒకరిపట్ల ఒకరు దాన్ని చాలా అరుదుగా వ్యక్తంచేస్తుండవచ్చు.

నేడు చాలామంది తల్లిదండ్రులకు తమ సొంత పిల్లలపట్ల ప్రేమానురాగాలను ఎలా వ్యక్తంచేయాలో తెలియదు. కొంతమంది అనురాగరహితమైన కుటుంబ వాతావరణంలో పెరగడం మూలంగా, అనురాగాన్ని పొందితే దాన్ని వ్యక్తంచేస్తే జీవితం మరింత ఆనందకరంగా మరింత ఆహ్లాదకరంగా ఉండగలదని గ్రహించకపోవచ్చు. టోరూ విషయంలో కూడా అదే జరిగివుంటుందని అనిపిస్తుంది. ఆయన బాల్యంలో, ఆయన తండ్రి ఎల్లప్పుడూ పనిలో బిజీగా ఉండేవాడు, రాత్రి బాగా ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఆయన టోరూతో చాలా అరుదుగా మాట్లాడేవాడు, ఒకవేళ మాట్లాడినా దూషణకరంగా మాట్లాడేవాడు. టోరూ తల్లి కూడా ఉద్యోగం చేసేది, టోరూతో ఎక్కువ సమయం గడిపేది కాదు. టోరూకి టీవీనే బేబీసిట్టర్‌లా ఉండేది. కుటుంబంలో ఒకరినొకరు ప్రశంసించుకోవడం గానీ పరస్పరం సంభాషించుకోవడం గానీ ఉండేవి కావు.

సంస్కృతి కూడా ఒక కారకం కావచ్చు. లాటిన్‌ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో, ఒక వ్యక్తి తన భార్యపట్ల అనురాగాన్ని వ్యక్తంచేయాలంటే సంస్కృతికి వ్యతిరేకంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అనేక ప్రాచ్య దేశాలలో, ఆఫ్రికా దేశాలలో, ఒకరు మాటల ద్వారా గానీ చేతల ద్వారా గానీ అనురాగాన్ని వ్యక్తంచేయడం సాంప్రదాయ విరుద్ధమైనది. భర్తలు “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని తమ భార్యలకు లేదా పిల్లలకు చెప్పడం కష్టంమన్నట్లు భావించవచ్చు. అయినప్పటికీ ఎంతో కాలంగా నిజమైనదనీ ఆచరణాత్మకమైనదనీ నిరూపించబడిన తొలి కుటుంబ సంబంధం నుండి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు.

మాదిరికరమైన కుటుంబ సంబంధం

కుటుంబానికి అత్యుత్తమమైన మాదిరి యెహోవా దేవునికీ ఆయన అద్వితీయ కుమారునికీ మధ్యవున్న సన్నిహితమైన సంబంధం. వారు ఒకరిపట్ల ఒకరు పరిపూర్ణంగా ప్రేమను వ్యక్తంచేసుకుంటారు. యేసుక్రీస్తుగా మారడానికి ముందు ఈ ఆత్మప్రాణి, లెక్కించలేనన్ని వేల సంవత్సరాలు తన తండ్రితో సంతోషకరమైన సంబంధాన్ని అనుభవించాడు. ఆయన ఆ బంధాన్ని ఇలా వర్ణించాడు: “నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు. ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.” (సామెతలు 8:​30, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తన తండ్రి ప్రేమ గురించి ఆ కుమారునికి ఎంత నమ్మకం ఉందంటే, యెహోవా తన మూలంగా ప్రతి రోజూ సంతోషించాడు అని ఆయన చెప్పగలిగాడు. ఆయన తన తండ్రి ముందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు.

దేవుని కుమారుడైన యేసు మానవునిగా భూమ్మీద ఉన్నప్పుడు కూడా ఆయనకు తనపట్ల తన తండ్రికున్న గాఢమైన ప్రేమ గురించి హామీ ఇవ్వబడింది. యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఆయన తన తండ్రి స్వరాన్ని విన్నాడు: “ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నా[ను].” (మత్తయి 3:​17) యేసు భూమ్మీద తన పని ప్రారంభించడానికి ముందు ఆయన తండ్రి ఎంత ప్రోత్సాహకరంగా తన ప్రేమను వ్యక్తంచేశాడో కదా! ఆయన తన పరలోక జీవిత జ్ఞాపకాలను పూర్తిగా తిరిగి పొందినప్పుడు తన తండ్రి అంగీకారాన్ని వినడం ఆయన హృదయాన్ని కదిలించివుంటుంది.

కాబట్టి, తన విశ్వ కుటుంబంపట్ల సంపూర్ణంగా ప్రేమను వ్యక్తంచేయడంలో యెహోవా అత్యుత్తమమైన మాదిరిని ఉంచాడు. మనం యేసుక్రీస్తును అంగీకరిస్తే, మనం కూడా యెహోవా అనురాగాన్ని పొందవచ్చు. (యోహాను 16:​27) మనం పరలోకం నుండి మాటలు వినకపోయినప్పటికీ ప్రకృతిలో, యేసు విమోచన క్రయధన బలి ఏర్పాటులో, ఇతర విధాల్లో యెహోవా వ్యక్తంచేసిన ప్రేమను చూస్తాము. (1 యోహాను 4:​9, 10) యెహోవా మన ప్రార్థనలను కూడా వింటాడు, మనకు అత్యంత ప్రయోజనకరమైన రీతిలో మన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు. (కీర్తన 145:18; యెషయా 48:​17) మనం యెహోవాతో సన్నిహిత సంబంధాన్ని పెంపొందించుకుంటుండగా, ఆయన చూపించే ప్రేమపూర్వకమైన శ్రద్ధ పట్ల మన కృతజ్ఞత అధికమవుతుంది.

ఇతరులపట్ల తదనుభూతి, ఆసక్తి, దయ, లోతైన శ్రద్ధ ఎలా చూపించాలో యేసు తన తండ్రివద్ద నేర్చుకున్నాడు. దానిని ఆయన ఇలా వివరించాడు: “తండ్రి . . . వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నా[డు].” (యోహాను 5:​19, 20) యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన ఉంచిన మాదిరిని అధ్యయనం చేయడం ద్వారా మనం కూడా అనురాగాన్ని వ్యక్తంచేసే కళను నేర్చుకోవచ్చు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠8.

కుటుంబంలో అనురాగం​—⁠ఎలా?

దేవుడు “ప్రేమాస్వరూపి” కాబట్టి, మనం ఆయన “స్వరూపమందు” సృష్టించబడ్డాము కాబట్టి ప్రేమను పొందే సామర్థ్యం, ప్రేమను వ్యక్తంచేసే సామర్థ్యం మనకుంది. (1 యోహాను 4:8; ఆదికాండము 1:26, 27) అయితే, మనకు ప్రేమను వ్యక్తంచేసే సామర్థ్యం ఉన్నప్పటికీ అది దానంతటదే జరిగిపోదు. అనురాగాన్ని వ్యక్తంచేయాలంటే, మొదట మనకు మన భాగస్వామిపట్ల పిల్లలపట్ల అనురాగం ఉండాలి. మీరు వారిని గమనించి వారిలోవున్న మెచ్చుకోదగిన లక్షణాలను గుర్తించండి, మొదట్లో అవి ఎంత స్వల్పమైనవిగా అనిపించినా అలాంటి తలంపుల గురించి ఆలోచించండి. ‘నా భర్తలో [భార్యలో లేక పిల్లలలో] ప్రేమించదగినది ఏదీ లేదు’ అని మీరు అనవచ్చు. పెద్దలు చూసిన సంబంధాన్ని చేసుకున్న వారు, తమ భాగస్వామి పట్ల అంతగా అనురాగాన్ని పెంచుకుని ఉండకపోవచ్చు. కొంతమంది దంపతులు పిల్లలు కావాలని అనుకునివుండకపోవచ్చు. అయినప్పటికీ సా.శ.పూ. పదవ శతాబ్దంలో యెహోవా తన సూచనార్థకమైన భార్య అయిన ఇశ్రాయేలు జనాంగం గురించి ఎలా భావించాడో పరిశీలించండి. ఆయన తన ప్రవక్తయైన ఏలీయా, పదిగోత్రాల ఇశ్రాయేలు జనాంగంలో యెహోవా ఆరాధకులు ఇంకెవరూ లేరన్న ముగింపుకు వచ్చినప్పుడు, యెహోవా జాగ్రత్తగా గమనించి తనకిష్టమైన లక్షణాలున్న ప్రజలను గమనార్హమైన సంఖ్యలో అంటే మొత్తం 7,000 మందిని కనుగొన్నాడు. మీ కుటుంబ సభ్యులలోని మంచిని చూడడం ద్వారా మీరు యెహోవాను అనుకరించగలరా?​—⁠1 రాజులు 19:14-18.

అయితే కుటుంబంలోని ఇతర సభ్యులు మీ అనురాగాన్ని చవిచూడాలంటే మీరు దాన్ని వ్యక్తంచేయడానికి మనఃపూర్వకంగా ప్రయత్నించాలి. మెచ్చుకోదగిన విషయం ఏదైనా కనిపించిన ప్రతీసారి, మీ మెప్పుదలను మాటల ద్వారా వ్యక్తంచేయండి. సామర్థ్యంగల భార్య గురించి వర్ణిస్తూ దేవుని వాక్యం ఆమె కుటుంబానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన లక్షణాన్ని చెబుతోంది: “ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు . . . ఆమె పెనిమిటి ఆమెను పొగడును.” (సామెతలు 31:​28, 29) కుటుంబ సభ్యులు ఒకరిపట్ల ఒకరికున్న మెప్పుదలను ఎంత బాగా వ్యక్తంచేసుకున్నారో గమనించండి. ఒక తండ్రి తన భార్యను పొగడడం ద్వారా, తన కుమారునికి మంచి మాదిరిని ఉంచుతాడు. ఆ కుమారుడు వివాహం చేసుకున్నప్పుడు తన భార్యను ఉదారంగా ప్రశంసిస్తాడు.

అంతేగాక, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రశంసించడం మంచిది. పిల్లల మనస్సులో స్వగౌరవాన్ని నాటడానికి అది సహాయపడగలదు. నిజానికి, ఒక వ్యక్తి తనను తాను గౌరవించుకోలేకపోతే ‘తనవలె తన పొరుగువానిని’ ఎలా ‘ప్రేమించగలడు?’ (మత్తయి 22:​39) మరోవైపు తల్లిదండ్రులు తమ పిల్లలను అస్సలు ప్రశంసించకుండా ఎప్పుడూ విమర్శిస్తుంటే, పిల్లలు సులభంగా తమ స్వగౌరవాన్ని కోల్పోవచ్చు, ఇతరులపట్ల ఆప్యాయత చూపడం వారికి కష్టంగా ఉండవచ్చు.​—⁠ఎఫెసీయులు 4:31, 32.

మీరు సహాయాన్ని పొందవచ్చు

మీరు ప్రేమగల కుటుంబంలో పెంచబడలేదనుకోండి, అప్పుడెలా? అలా జరిగినప్పటికీ మీరు ఆప్యాయతను వ్యక్తంచేయడం నేర్చుకోవచ్చు. అందుకు చేయవలసిన మొదటి పని ఏమిటంటే, సమస్యను గుర్తించి మెరుగుపర్చుకోవలసిన అవసరం ఉందని ఒప్పుకోవడం. ఈ విషయంలో దేవుని వాక్యమైన బైబిలు ఎంతో సహాయం చేస్తుంది. దాన్ని ఒక అద్దంతో పోల్చవచ్చు. అద్దంలాంటి బైబిలు బోధలలో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు, మన ఆలోచనా విధానంలో ఉన్న లోపాలు మనకు కనిపిస్తాయి. (యాకోబు 1:​23) బైబిలు బోధలకు అనుగుణంగా, మనలో ఉన్న తప్పుడు ఆలోచనలను మనం సరిదిద్దుకోవచ్చు. (ఎఫెసీయులు 4:20-24; ఫిలిప్పీయులు 4:​8, 9) మనం “మేలుచేయుట యందు” ఎన్నడూ “విసుకక” క్రమంగా అలా చేయవలసిన అవసరం ఉంది.​—⁠గలతీయులు 6:⁠9.

తాము పెంచబడిన తీరునుబట్టీ లేక సంస్కృతినిబట్టీ కొందరికి ఆప్యాయత చూపించడం కష్టమనిపించవచ్చు. అయితే, అలాంటి ఆటంకాలను అధిగమించవచ్చు అని ఇటీవల జరిగిన పరిశోధనలు సూచిస్తున్నాయి. మానసిక ఆరోగ్య నిపుణుడైన డా. డానియల్‌ గోల్మాన్‌, ‘బాల్యంలో అలవర్చుకున్న, లోతుగా పాతుకుపోయిన అలవాట్లను కూడా మార్చుకోవచ్చు’ అని వివరిస్తున్నాడు. స్థిరంగా నాటుకుపోయిన హృదయ వాంఛలను కూడా దేవుని ఆత్మ సహాయంతో మార్చుకోవచ్చునని 19 శతాబ్దాలకంటే ఎక్కువకాలం క్రితం బైబిలు సూచించింది. అది మనకిలా ఉద్బోధిస్తుంది: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి . . . నవీనస్వభావమును ధరించుకొ[నుడి].”​—⁠కొలొస్సయులు 3:9, 10.

ఆ కుటుంబం, ఒకసారి సమస్యను గుర్తించిన తర్వాత, తమ అవసరాలను మనస్సులో ఉంచుకుని బైబిలును అధ్యయనం చేయవచ్చు. ఉదాహరణకు, బైబిలు కాంకార్డెన్సులో “అనురాగం” అన్న పదాన్ని ఎందుకు చూడకూడదు? అక్కడ మీరు ఇలాంటి లేఖనాన్ని కనుగొనవచ్చు: ‘సహించిన వారిని ధన్యులని ప్రకటిస్తున్నాము. మీరు యోబు సహనము గురించి విన్నారు, యెహోవా అనుగ్రహించిన ప్రతిఫలాన్ని చూశారు, యెహోవా అనురాగము, కనికరము గలవాడని మీరు తెలిసికొనియున్నారు.’ (యాకోబు 5:11NW) యోబుపట్ల యెహోవా అనురాగంతో, కనికరంతో ఎలా వ్యవహరించాడు అన్న విషయంపై అవధానముంచుతూ యోబుకు సంబంధించిన బైబిలు నివేదికను పరిశీలించండి. అప్పుడు మీ కుటుంబం పట్ల అనురాగంతో కనికరంతో ఉండడంలో యెహోవాను అనుకరించాలని మీరు తప్పకుండా కోరుకుంటారు.

మనం అపరిపూర్ణులం కాబట్టి, మాట్లాడేటప్పుడు “అనేకవిషయములలో మనమందరము తప్పిపో[తాము].” (యాకోబు 3:⁠2) కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు మనం మన నాలుకను ప్రోత్సాహకరమైన విధంగా ఉపయోగించడంలో విఫలమవ్వవచ్చు. ఈ విషయమై ప్రార్థన చేయడం, యెహోవా మీద ఆధారపడడం అవసరం. ప్రయత్నించడం మానకండి. “యెడతెగక ప్రార్థనచేయుడి.” (1 థెస్సలొనీకయులు 5:​16-18) కుటుంబంలో అనురాగం కోసం పరితపించేవారికి, అనురాగం చూపించాలనివున్నా చూపించలేకపోతున్నవారికి యెహోవా సహాయం చేస్తాడు.

అంతేకాకుండా, యెహోవా దయతో క్రైస్తవ సంఘం ద్వారా సహాయాన్ని అందిస్తున్నాడు. యాకోబు ఇలా వ్రాశాడు: “మీలో ఎవడైనను [ఆధ్యాత్మికంగా] రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థనచేయవలెను.” (యాకోబు 5:​14) అవును, కుటుంబసభ్యులు ఒకరిపట్ల ఒకరు అనురాగం కలిగివుండడంలో సమస్యలున్న కుటుంబాలకు యెహోవాసాక్షుల సంఘాలలోని పెద్దలు ఎంతో సహాయం చేయగలరు. పెద్దలు థెరపిస్టులు కాకపోయినప్పటికీ ఏమి చేయాలనేది తమ తోటి విశ్వాసులకు చెప్పడం ద్వారా కాదుగానీ యెహోవా దృక్కోణాన్ని వారికి గుర్తుచేసి వారితోపాటూ వారికోసమూ ప్రార్థన చేయడం ద్వారా ఓర్పుతో వారికి సహాయం చేయవచ్చు.​—⁠కీర్తన 119:105; గలతీయులు 6:⁠1.

టోరూ యోకోల విషయం చూస్తే, క్రైస్తవ పెద్దలు వారి సమస్యలను ఎల్లప్పుడూ శ్రద్ధగా విని వారిని ఓదార్చారు. (1 పేతురు 5:​2, 3) యోకో ‘తన భర్తను ప్రేమించేలా బుద్ధిచెప్ప’గల అనుభవజ్ఞురాలైన క్రైస్తవ స్త్రీ సహవాసం నుండి యోకో ప్రయోజనం పొందడానికి కొన్ని సందర్భాలలో ఒక పెద్ద, ఆయన భార్య యోకోను సందర్శించేవారు. (తీతు 2:​3-5) తోటి క్రైస్తవుల బాధలను, దుఃఖాన్ని అర్థం చేసుకుని వారికి సహానుభూతిని చూపించడం ద్వారా పెద్దలు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను” ఉంటారు.​—⁠యెషయా 32:1, 2.

టోరూ, తన భావోద్రేకాలను వ్యక్తంచేయడంలో తనకు సమస్య ఉందనీ, “అంత్యదినములలో” సాతాను కుటుంబ ఏర్పాటుపై దాడి చేస్తాడనీ దయగల పెద్దల సహాయంతో గ్రహించాడు. (2 తిమోతి 3:⁠1) టోరూ తనకున్న సమస్యను అధిగమించాలని నిర్ణయించుకున్నాడు. తాను పెరుగుతున్నప్పుడు తనకు ప్రేమ చూపించబడలేదు కాబట్టి తాను ఇప్పుడు ప్రేమను వ్యక్తంచేయడంలో విఫలమవుతున్నానని టోరూ గ్రహించడం ప్రారంభించాడు. శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, ప్రార్థించడం ద్వారా యోకో భావోద్రేక అవసరాలకు టోరూ క్రమంగా ప్రతిస్పందించడం ప్రారంభించాడు.

యోకోకు మొదట్లో టోరూ అంటే కోపం ఉన్నప్పటికీ, ఆయన కుటుంబ నేపథ్యాన్ని అర్థంచేసుకుని తన స్వంత బలహీనతలను గ్రహించిన తర్వాత, ఆమె తన భర్తలోని మంచిని చూడడానికి తీవ్రంగా కృషి చేసింది. (మత్తయి 7:1-3; రోమీయులు 5:12; కొలొస్సయులు 3:​12-14) తన భర్తను ప్రేమిస్తూనే ఉండడానికి తనకు శక్తినివ్వమని ఆమె యెహోవాను వేడుకుంది. (ఫిలిప్పీయులు 4:​6, 7) కొంత కాలానికి, టోరూ తన భార్యపట్ల అనురాగాన్ని వ్యక్తంచేయడం ప్రారంభించడం ద్వారా ఆమె సంతోషానికి కారణమయ్యాడు.

అవును, కుటుంబంలో అనురాగం పొందడమూ వ్యక్తంచేయడమూ మీకు కష్టమనిపించినా, మీరు ఆ సమస్యను తప్పక అధిగమించవచ్చు. దేవుని వాక్యం మనకు ఆరోగ్యకరమైన నడిపింపునిస్తుంది. (కీర్తన 19:⁠7) ఆ సమస్య యొక్క గంభీరతను గుర్తించడం ద్వారా, మీ కుటుంబ సభ్యులలోని మంచిని చూడడానికి ప్రయత్నించడం ద్వారా, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి అన్వయించుకోవడం ద్వారా, యెడతెగక ప్రార్థిస్తూ యెహోవా మీద ఆధారపడడం ద్వారా, పరిణతి చెందిన క్రైస్తవ పెద్దల సహాయం తీసుకోవడం ద్వారా మీకూ మీ కుటుంబానికీ మధ్య భయంకరమైన అడ్డుగోడలా కనిపించే ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు. (1 పేతురు 5:⁠7) అమెరికాలోని ఒక భర్త సంతోషించినట్లుగానే మీరూ సంతోషించవచ్చు. తన భార్యపట్ల అనురాగాన్ని వ్యక్తంచేయమని ఆయన ప్రోత్సహించబడ్డాడు. చివరికి, ఆయన ధైర్యాన్ని కూడగట్టుకుని “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని తన భార్యతో చెప్పినప్పుడు వచ్చిన ప్రతిస్పందనను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమె తన కళ్ళల్లో ఆనందబాష్పాలతో ఇలా అంది: “నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ ఈ 25 సంవత్సరాలలో మీరు నాకు అలా చెప్పడం ఇదే మొదటిసారి.” మీ భాగస్వామి మీదా మీ పిల్లల మీదా ఉన్న అనురాగాన్ని వ్యక్తంచేయడానికి మీరు అంతకాలం వేచివుండకండి!

[అధస్సూచి]

^ పేరా 1 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా సహాయం అందజేస్తున్నాడు