కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

షాఫాను గురించి ఆయన కుటుంబం గురించి మీకు తెలుసా?

షాఫాను గురించి ఆయన కుటుంబం గురించి మీకు తెలుసా?

షాఫాను గురించి ఆయన కుటుంబం గురించి మీకు తెలుసా?

మీరు బైబిలు చదువుతున్నప్పుడు షాఫాను గురించి, పలుకుబడిగల ఆయన కుటుంబంలోని కొంతమంది సభ్యుల గురించి ప్రస్తావించబడడాన్ని ఎప్పుడైనా గమనించారా? వాళ్ళెవరు? వాళ్ళేమి చేశారు? వాళ్ళ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

దాదాపు సా.శ.పూ. 642 లో యోషీయా సత్యారాధానను పునఃస్థాపించడానికి సంబంధించి బైబిలు మనకు ‘మెషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడైన షాఫానును’ పరిచయం చేస్తుంది. (2 రాజులు 22:⁠3) ఆ తర్వాతి 36 సంవత్సరాల్లో, అంటే సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనం చేయబడేంతవరకు, మనకు ఆయన నలుగురు కుమారులైన అహీకాము, ఎల్యాశా, గెమర్యా, యజన్యా, ఆయన మనుమలైన మీకాయా, గెదల్యా పరిచయం చేయబడతారు. (చార్టు చూడండి.) “షాఫాను కుటుంబం [యూదా రాజ్యంలో] ఉద్యోగివర్గంపై అధికారాన్ని కల్గివుండి, యోషీయా కాలం నుండి చెరగా కొనిపోబడే కాలం వరకు రాజు దగ్గర శాస్త్రి స్థానాన్ని కలిగివుంది” అని ఎన్‌సైక్లోపీడియా జుడైకా వివరిస్తోంది. షాఫాను గురించి ఆయన కుటుంబం గురించి బైబిలు చెబుతున్న దాన్ని పరిశీలించడం, వాళ్ళు యిర్మీయా ప్రవక్తకు, యెహోవా సత్యారాధనకు ఎలా మద్దతునిచ్చారనేది అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.

షాఫాను సత్యారాధనకు మద్దతునివ్వడం

సా.శ.పూ. 642 లో, రాజైన యోషీయాకు దాదాపు పాతికేళ్ళున్నప్పుడు, షాఫాను ఆయన దగ్గర శాస్త్రిగా లేఖికునిగా పనిచేస్తున్నట్లు మనం తెలుసుకుంటాము. (యిర్మీయా 36:​10) ఆ పనిలో ఏమి చేరివుంది? రాజు దగ్గర శాస్త్రిగా, లేఖికునిగా పనిచేసే వ్యక్తి రాజుకు సన్నిహిత సలహాదారునిగా ఉంటాడు, ఆర్థిక విషయాలపై ఆధిపత్యం ఉంటుంది, రాజనీతిలో సమర్థుడై ఉంటాడు, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ చట్టానికి సంబంధించిన విషయాల్లో, వర్తక ఒప్పందాల్లో ప్రవీణుడై ఉంటాడు అని పైన పేర్కొన్న గ్రంథం తెలియజేస్తోంది. కాబట్టి రాజు దగ్గర శాస్త్రిగా పనిచేస్తున్న షాఫాను, రాజ్యంలో ఎంతో పలుకుబడిగల వారిలో ఒకడు.

పదేళ్ళ క్రితం, బాలుడుగా ఉన్న యోషీయా ‘తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొన్నాడు.’ షాఫాను యోషీయా కన్నా చాలా పెద్దవాడన్నది స్పష్టం, కాబట్టి ఆయన యోషీయాకు మంచి ఆధ్యాత్మిక సలహాదారునిగా, సత్యారాధనను పునఃస్థాపించడానికి యోషీయా చేపట్టిన మొదటి ప్రయత్నానికి మద్దతుదారునిగా ఉండి ఉండవచ్చు. *​—⁠2 దినవృత్తాంతములు 34:​1-8.

ఆలయాన్ని బాగుచేస్తున్నప్పుడు “ధర్మశాస్త్రగ్రంథము” దొరికింది, షాఫాను “ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివెను.” అందులోని విషయాలను విని యోషీయా దిగ్భ్రాంతి చెంది, ఆ గ్రంథము గురించి యెహోవా వద్ద విచారణ చేయడానికి నమ్మకమైన పురుషుల ప్రతినిధివర్గాన్ని హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరికి పంపించాడు. షాఫానును, ఆయన కుమారుడైన అహీకామును ఆ ప్రతినిధివర్గంలో చేర్చడం ద్వారా రాజు వాళ్ళపై తనకు నమ్మకముందని చూపించాడు.​—⁠2 రాజులు 22:8-14; 2 దినవృత్తాంతములు 34:​14-22.

షాఫాను స్వయంగా చేసినదాని గురించి లేఖనాల్లో ప్రస్తావించబడింది ఈ ఒక్కసారే. బైబిల్లోని ఇతర వచనాల్లో ఆయన కేవలం తండ్రిగా లేదా తాతగా పేర్కొనబడ్డాడు. షాఫాను సంతానానికి యిర్మీయా ప్రవక్తతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

అహీకాము, గెదల్యా

మనం ఇప్పటికే గమనించినట్లుగా, షాఫాను కుమారుడైన అహీకాము హుల్దా ప్రవక్త్రి వద్దకు పంపబడిన ప్రతినిధివర్గానికి సంబంధించి మొదట పేర్కొనబడ్డాడు. ఒక గ్రంథం ఇలా తెలియజేస్తోంది: “అహీకాముకున్న బిరుదు గురించి హీబ్రూ బైబిలులో చెప్పబడకపోయినప్పటికీ ఆయన ఉన్నతాధికారి అని స్పష్టమవుతోంది.”

ఆ సంఘటన జరిగిన దాదాపు 15 సంవత్సరాల తర్వాత, యిర్మీయా జీవితం ప్రమాదంలో పడింది. ఆయన యెరూషలేమును నాశనం చేయాలన్న యెహోవా ఉద్దేశం గురించి ప్రజలను హెచ్చరించినప్పుడు, “యాజకులును ప్రవక్తలును జనులందరును అతని పట్టుకొని​—⁠నీవు మరణశిక్ష నొందక తప్పదు” అన్నారు. అప్పుడేమి జరిగింది? ఆ వృత్తాంతం ఇలా కొనసాగుతుంది: “షాఫాను కుమారుడైన అహీకాము యిర్మీయాకు తోడైయున్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు.” (యిర్మీయా 26:​1-24) ఇదేమి నిరూపిస్తోంది? ది ఏంకర్‌ బైబిల్‌ డిక్షనరీ ఇలా వివరిస్తోంది: “ఈ సంఘటన అహీకాముకున్న పలుకుబడిని ధ్రువీకరించడమే గాక షాఫాను కుటుంబంలోని ఇతర సభ్యుల్లా ఆయన కూడా యిర్మీయాపట్ల దయాపూర్వకమైన దృక్పథంతో ఉన్నాడని సూచిస్తోంది.”

దాదాపు 20 సంవత్సరాల తర్వాత, సా.శ.పూ. 607 లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసి చాలామందిని చెరగా తీసుకుపోయిన తర్వాత, షాఫాను మనుమడూ అహీకాము కుమారుడూ అయిన గెదల్యా మిగిలివున్న యూదులపై అధిపతిగా నియమించబడ్డాడు. షాఫాను కుటుంబంలోని ఇతర సభ్యుల్లా ఆయన యిర్మీయా గురించి శ్రద్ధ తీసుకున్నాడా? బైబిలు వృత్తాంతం ఇలా తెలియజేస్తోంది: “యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితోకూడ . . . కాపురముండెను.” కొన్ని నెలల్లో గెదల్యా చంపబడ్డాడు, మిగిలిన యూదులు తాము ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు యిర్మీయాను తమతో తీసుకువెళ్ళారు.​—⁠యిర్మీయా 40:5-7; 41:1, 2; 43:​4-7.

గెమర్యా, మీకాయా

షాఫాను కుమారుడైన గెమర్యా, మనుమడైన మీకాయా, యిర్మీయా 36వ అధ్యాయంలో వర్ణించబడిన సంఘటనల్లో ప్రముఖ పాత్ర వహించారు. అది దాదాపు సా.శ.పూ. 624, యెహోయాకీము పాలనలోని ఐదవ సంవత్సరం. యిర్మీయా దగ్గర కార్యదర్శిగా పనిచేస్తున్న బారూకు యెహోవా మందిరం వద్ద “షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో” యిర్మీయా మాటలను బిగ్గరగా చదివి వినిపించాడు. ఆ విధంగా, “షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని వి[న్నాడు].”​—⁠యిర్మీయా 36:9-11.

మీకాయా తన తండ్రికి, ఇతర ప్రధానులందరికి ఆ గ్రంథము గురించి తెలియజేశాడు, వాళ్ళంతా అది ఏమి చెబుతోందో వినాలని కోరుకున్నారు. విని వాళ్ళెలా ప్రతిస్పందించారు? “వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొని​—⁠మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.” అయితే రాజుతో మాట్లాడే ముందు వారు, “నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవ[ద్దు]” అని బారూకుకు సలహా ఇచ్చారు.​—⁠యిర్మీయా 36:​12-19.

వారు అనుకున్నట్లుగానే, రాజు ఆ గ్రంథములోని సందేశాన్ని నిరాకరించి, దాన్ని ముక్కలు ముక్కలు చేసి కాల్చివేశాడు. షాఫాను కుమారుడైన గెమర్యాతో సహా కొందరు ప్రధానులు, “గ్రంథమును కాల్చవద్దని . . . రాజుతో మనవిచేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను.” (యిర్మీయా 36:​21-25) జెరమాయా​—⁠యాన్‌ ఆర్కియాలజికల్‌ కంపానియన్‌ అనే పుస్తకం ఇలా నిర్ధారిస్తోంది: “గెమర్యా, యెహోయాకీము రాజు ఆస్థానంలో యిర్మీయాకు మంచి మద్దతుదారునిగా ఉన్నాడు.”

ఎల్యాశా, యజన్యా

సా.శ.పూ. 617 లో బబులోను యూదా రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. యెహెజ్కేలు ప్రవక్తతో సహా వేలాదిమంది యూదులను, “అధిపతులను పరాక్రమశాలులను . . . కంసాలివారిని కమ్మరివారిని చెరతీసికొని పోయెను.” మత్తన్యా క్రొత్త సామంత రాజయ్యాడు, బబులోనీయులు ఆయన పేరును సిద్కియా అని మార్చారు. (2 రాజులు 24:​12-17) ఆ తర్వాత సిద్కియా ఒక ప్రతినిధివర్గాన్ని బబులోనుకు పంపాడు, ఆ వర్గంలో షాఫాను కుమారుడైన ఎల్యాశా కూడా ఉన్నాడు. చెరలో ఉన్న యూదుల కోసం యెహోవా ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన సందేశం ఉన్న ఉత్తరాన్ని యిర్మీయా ఎల్యాశాకు అప్పగించాడు.​—⁠యిర్మీయా 29:​1-3.

షాఫాను, ఆయన ముగ్గురు కుమారులు, ఆయన ఇద్దరు మనుమలు పలుకుబడిగల తమ అధికారస్థానాలను సత్యారాధనకు, నమ్మకమైన ప్రవక్త అయిన యిర్మీయాకు మద్దతునివ్వడానికి ఉపయోగించారని బైబిలు వృత్తాంతం సూచిస్తోంది. షాఫాను కుమారుడైన యజన్యా సంగతేమిటి? షాఫాను కుటుంబంలోని ఇతర సభ్యుల్లా కాక ఇతడు విగ్రహారాధన చేశాడని స్పష్టమవుతోంది. ప్రవక్తయైన యెహెజ్కేలు బబులోను చెరలో ఉన్న ఆరవ సంవత్సరంలో లేదా దాదాపు సా.శ.పూ. 612 లో ఆయనకు ఒక దర్శనం కలిగింది, అందులో 70 మంది పురుషులు యెరూషలేములోని ఆలయంలో విగ్రహాలకు ధూపము వేస్తున్నారు. వారిలో యజన్యా కూడా ఉన్నాడు, కేవలం ఈయన మాత్రమే పేరుతో ప్రస్తావించబడ్డాడు. ఇది, ఆయన ఆ గుంపులో ప్రముఖ సభ్యుడై ఉండవచ్చునని సూచించవచ్చు. (యెహెజ్కేలు 8:​1, 9-⁠12) దైవభక్తిగల కుటుంబంలో పెంచబడినంత మాత్రాన ఒకరు యెహోవా నమ్మకమైన ఆరాధకుడయ్యే అవకాశం లేదని యజన్యా ఉదాహరణ చూపిస్తోంది. ప్రతి వ్యక్తీ తాను తీసుకునే చర్యకు తానే బాధ్యుడు.​—⁠2 కొరింథీయులు 5:​10.

షాఫాను, ఆయన కుటుంబ వంశావళి

యెరూషలేములో జరిగిన సంఘటనల్లో షాఫాను, ఆయన కుటుంబం ఒక పాత్ర నిర్వహించే సమయానికల్లా, యూదాలో ముద్రలను ఉపయోగించడం సామాన్యం అయిపోయింది. దస్తావేజులకు రుజువుగా లేదా వాటిపై సంతకానికి ముద్రలు ఉపయోగించబడేవి, అవి అమూల్యమైన రాళ్ళు, లోహం, దంతం, లేదా గాజుతో తయారు చేయబడేవి. సాధారణంగా, ముద్ర యొక్క సొంతదారుని పేరు, ఆయన తండ్రి పేరు, కొన్నిసార్లు సొంతదారుని బిరుదు వాటిపై చెక్కబడేవి.

బంకమన్నుపై వందలాది హీబ్రూ ముద్రల గుర్తులు కనుగొనబడ్డాయి. ప్రాచీన శిలలపై చెక్కబడిన వ్రాతల అధ్యయనాన్ని శిలాలేఖ విద్య అంటారు, హీబ్రూ శిలాలేఖ విద్యలో పండితుడైన ప్రొఫెసర్‌ నహమాన్‌ అవిగాడ్‌ ఇలా పేర్కొన్నాడు: “బైబిలులో ప్రస్తావించబడిన వ్యక్తుల గురించి తెలియజేసే ఏకైక హీబ్రూ శిలాలేఖ మూలాలు ముద్రలపై చెక్కబడిన మాటలే.” షాఫానుకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి చెక్కబడిన ముద్రలేమైనా దొరికాయా? దొరికాయి. షాఫాను, ఆయన కుమారుడైన గెమర్యాల పేర్లు 19, 21 పేజీల్లో చూపబడిన ముద్రపై కనిపిస్తాయి.

ముద్రల గుర్తులపై కుటుంబంలోని ఇతర నలుగురు సభ్యుల పేర్లు సూచించబడి ఉండవచ్చని కూడా పండితులు చెబుతారు​—⁠అజల్యా, షాఫాను తండ్రి; షాఫాను కుమారుడైన అహీకాము; షాఫాను కుమారుడైన గెమర్యా; గెదల్యా, ఈయన “ఒక గృహానికి అధిపతిగా” ఉన్నట్లు ఒక ముద్ర గుర్తుపై చూపించబడినట్లు తెలుస్తోంది. ఈ ముద్రలలో నాలుగవది, షాఫాను మనుమడైన గెదల్యాకు చెందినదిగా పరిగణించబడుతోంది, అయితే ఆయన తండ్రి అయిన అహీకాము పేరు అందులో ప్రస్తావించబడలేదు. ఆ ముద్ర గుర్తుపై ఉన్న ఆయన బిరుదు ఆయన దేశంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న అధికారి అని సూచిస్తోంది.

మనమేమి నేర్చుకోవచ్చు?

సత్యారాధనకూ నమ్మకస్థుడైన యిర్మీయాకూ మద్దతునిచ్చేందుకు పలుకుబడిగల తమ అధికార స్థానాలను ఉపయోగించడంలో షాఫాను, ఆయన కుటుంబం ఎంత చక్కని మాదిరి ఉంచారో కదా! మనం కూడా యెహోవా సంస్థకూ మన తోటి ఆరాధకులకూ మద్దతునిచ్చేందుకు మనకున్న వనరులను, పలుకుబడిని ఉపయోగించవచ్చు.

క్రమంగా బైబిలు చదవడమే గాక దాన్ని నిశితంగా పరిశోధించి, షాఫాను, ఆయన కుటుంబ సభ్యుల వంటి యెహోవా ప్రాచీన సాక్షుల గురించి తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహకరమైనదిగా విశ్వాసాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. వాళ్ళు కూడా గొప్ప “సాక్షి సమూహము”కు చెందిన వారే, మనం వారి మాదిరిని అనుకరించవచ్చు.​—⁠హెబ్రీయులు 12:⁠1.

[అధస్సూచి]

^ పేరా 6 యోషీయాకు దాదాపు పాతికేళ్ళు ఉన్నప్పటికే షాఫాను కుమారుడైన అహీకాము ఈడు వచ్చిన వ్యక్తి అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, షాఫాను యోషీయా కంటే చాలా పెద్దవాడే అయ్యుంటాడు.​—⁠2 రాజులు 22:​1-3, 11-14.

[22వ పేజీలోని బాక్సు]

హుల్దా​—⁠పలుకుబడిగల ఒక ప్రవక్త్రి

మందిరములో దొరికిన “ధర్మశాస్త్రగ్రంథము” చదవబడడాన్ని రాజైన యోషీయా విన్న తర్వాత, ఆ గ్రంథము గురించి “యెహోవాయొద్ద విచారణ” చేయమని షాఫానుకు, ఇతర నలుగురు ఉన్నతాధికారులకు ఆజ్ఞాపించాడు. (2 రాజులు 22:​8-20) ఆ ప్రతినిధి వర్గానికి సమాధానం ఎక్కడ లభించగలదు? ఆ సమయంలో, ప్రవక్తలూ బైబిలు రచయితలూ అయిన యిర్మీయా బహుశా నహూము, జెఫన్యా వంటివారు యూదాలోనే ఉన్నారు. అయితే ఆ ప్రతినిధివర్గం హుల్దా ప్రవక్త్రి దగ్గరికి వెళ్ళింది.

జెరూసలేం​—⁠యాన్‌ ఆర్కియాలజికల్‌ బయోగ్రఫీ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తోంది: “ఈ సంఘటనను గురించిన అసాధారణమైన విషయమేమిటంటే, కథలోని స్త్రీ పురుషుల అంశం ఎంతమాత్రం గమనార్హమైనది కాకపోవడమే. ధర్మశాస్త్ర గ్రంథము యొక్క స్థితిని నిశ్చయపర్చుకోవడానికి మొత్తం పురుషులతో కూడిన ప్రతినిధివర్గం ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళడాన్ని ఎవ్వరూ ఏ విధంగానూ అనుచితమైనదిగా పరిగణించలేదు. అది ప్రభువు వాక్యమని ఆమె ప్రకటించినప్పుడు, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఆమె అధికారాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేదు. ప్రాచీన ఇశ్రాయేలులో స్త్రీల పాత్రకున్న ప్రాముఖ్యతను నిర్ణయించే పండితులు తరచూ ఈ సంఘటనను ఉపేక్షిస్తారు.” అయితే పొందిన సమాచారం యెహోవా నుండి వచ్చినదే.

[21వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

షాఫాను వంశావళి

మెషుల్లాము

అజల్యా

షాఫాను

↓ ↓ ↓ ↓

అహీకాము ఎల్యాశా గెమర్యా యజన్యా

↓ ↓

గెదల్యా మీకాయా

[20వ పేజీలోని చిత్రం]

యిర్మీయా దగ్గరి నుండి వచ్చిన గ్రంథమును కాల్చవద్దని గెమర్యా, ఇతరులు యెహోయాకీముకు మనవి చేశారు

[22వ పేజీలోని చిత్రం]

యజన్యా షాఫాను కుటుంబ సభ్యుడే అయినప్పటికీ ఆయన విగ్రహాలను ఆరాధిస్తున్నట్లు ఒక దర్శనంలో చూడడం జరిగింది

[19వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy Israel Antiquities Authority

[21వ పేజీలోని చిత్రసౌజన్యం]

Courtesy Israel Antiquities Authority