కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యూకలుకు చెందిన’ ముద్ర

‘యూకలుకు చెందిన’ ముద్ర

‘యూకలుకు చెందిన’ ముద్ర

సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో, కల్దీయుల రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును జయించి, పట్టణాన్ని తగులబెట్టి, దాని ప్రాకారాలను పడగొట్టించాడు. ఆయన యూదా రాజైన సిద్కియాను బంధించి, ఆయన కళ్ళు పీకించాడు. అంతేకాక, “బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.”​—⁠యిర్మీయా 39:​1-8.

అలా బబులోనీయుల చేతుల్లో మరణించిన యూదా ప్రధానుల్లో లేక అధిపతుల్లో షెలెమ్యా కుమారుడైన యూకలు కూడా ఉన్నాడు. ఈ బైబిలు పాత్ర గురించిన కొత్త సమాచారం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దానిని పరిశీలించేముందు, మనం యూకలు, ఆయన జీవించిన కాలాన్ని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.

“వారు నీపైని విజయము పొందజాలరు”

యూదా యెరూషలేములపై తీర్పు సందేశం ప్రకటించమని యెహోవా యిర్మీయాను ఆజ్ఞాపించాడు. యూదా రాజులు, ప్రధానులు, యాజకులు ఆయనకు వ్యతిరేకంగా “యుద్ధముచేతురు” అని దేవుడు యిర్మీయాతో చెప్పాడు. కానీ “నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు” అని యెహోవా చెప్పాడు.​—⁠యిర్మీయా 1:​17-19.

యూదా రాజధానియైన యెరూషలేమును బబులోనీయులు ముట్టడించినప్పుడు, నెబుకద్నెజరు తిరిగి వెళ్ళిపోతాడో లేదో తెలుసుకోవడానికి, అలా తిరిగి వెళ్లిపోయేలా ఆ ప్రవక్త ప్రార్థించాలని కోరేందుకు రాజైన సిద్కియా రెండుసార్లు యిర్మీయా దగ్గరకు దూతలను పంపాడు. రాజు పంపిన సందేశకుల్లో ఒకరు యూకలు, ఆయన యెహుకలు అని కూడా పిలువబడ్డాడు. బబులోనీయులు లేదా కల్దీయులు ఆ పట్టణాన్ని నాశనం చేస్తారని దేవుడు యిర్మీయాకు తెలియజేశాడు. యెరూషలేము నివాసుల్లో ఎవరైనా దానిలో నిలిచివుంటే వారు క్షామముచేత, తెగుళ్లచేత లేదా కత్తివాత నశించిపోతారు. కానీ, బయటకువెళ్లి కల్దీయులకు లోబడేవారు సజీవంగా ఉంటారు. ఆ మాటలు యూదా ప్రధానులను ఎంతటి కోపానికి గురిచేసి ఉంటాయో కదా!​—⁠యిర్మీయా 21:​1-10; 37:​3-10; 38:​1-3.

“యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము” అని సిద్కియాకు మనవి చేసిన ప్రధానుల్లో యూకలు ఒకడు. యిర్మీయాను బురద గోతిలో పడేసినవారిలో దుష్టుడైన యూకలు కూడా ఉన్నాడు. యిర్మీయా ఆ తర్వాత ఆ గోతిలోనుండి బయటకు తీయబడ్డాడు. (యిర్మీయా 37:⁠15; 38:​3-6) యెహోవాకు విధేయత చూపించినందుకు యిర్మీయా యెరూషలేము నాశనాన్ని తప్పించుకున్నాడు, కానీ యూకలు మాత్రం ఆయన నమ్మిన యూదా విధానం నాశనం చేయబడినప్పుడు బహుశా మరణించివుంటాడు.

ఆసక్తికరమైన విషయాలు

యూకలు గురించి యెరూషలేములో 2005వ సంవత్సరంలో కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. పురాతత్వశాస్త్రజ్ఞులు రాజైన దావీదు రాజభవనం ఉందని ఊహించిన చోట తవ్వడం ప్రారంభించారు. కానీ, వారికి అక్కడ ఒక పెద్ద రాతి నిర్మాణం కనిపించింది, అది యిర్మీయా కాలంలో బబులోనీయులు యెరూషలేమును జయించినప్పుడు నాశనం చేయబడిందని వారు నమ్ముతున్నారు.

అది దావీదు రాజభవనమో కాదో ఇంకా తెలియలేదు. కానీ, అక్కడ దొరికిన ఒక వస్తువును మాత్రం పురాతత్వశాస్త్రజ్ఞులు గుర్తుపట్టగలిగారు, అది 14వ పేజీలో చూపించబడిన 1 సెంటిమీటరు వెడల్పున్న మట్టి ముద్ర. దొరికినప్పుడు పాడైపోయిందిగా ఉన్న దస్తావేజును సీలు చేయడానికి ఆ ముద్ర ఉపయోగించబడింది. ఆ ముద్రపై ఇలా వ్రాసివుంది: “షోవి కుమారుడైన షెలెమ్యాకు కుమారుడగు యెహుకలుకు చెందినది.” ఆ ముద్ర ఖచ్చితంగా యిర్మీయా శత్రువైన యెహుకలు లేదా షెలెమ్యా కుమారుడైన యూకలుకు చెందిన ముద్ర.

దావీదు పట్టణంలో దొరికిన మరో మట్టిముద్రపై షాఫాను కుమారుడైన గెమర్యా పేరు కనిపించింది. ఆ గెమర్యా తర్వాత, “రాజు మంత్రుల్లో రెండవ స్థానం” యెహుకలుదే అని ఆ మట్టిముద్రపైవున్న వ్రాతను అర్థం చేసుకున్న పురాతత్వశాస్త్రజ్ఞురాలైన ఏలట్‌ మజార్‌ చెబుతోంది. *

దేవుని వాక్యంపై విశ్వాసముంచడం ఏవో ప్రాచీన కళారూపాలను కనుగొనడంపై ఆధారపడిలేదు; కానీ ప్రేరేపించబడిన ప్రవచనాల నెరవేర్పు అనే గట్టి పునాది కారణంగా మనం బైబిలును నమ్మవచ్చు. యిర్మీయా ఖచ్చితమైన రీతిలో యెరూషలేము నాశనం గురించి ముందే తెలియజేశాడని చారిత్రక వాస్తవాలు నిరూపిస్తున్నాయి. యిర్మీయాను వ్యతిరేకించినవారికి అవమానకరమైన చావే ఎదురైంది. మనం కూడా యిర్మీయాలా విశ్వాసంగా ఉంటే, మన శత్రువులు ‘మనపై విజయం పొందరు, ఎందుకంటే యెహోవా మనకు తోడైయున్నాడు’ అనే మన నమ్మకం ఆ విషయాన్నిబట్టి మరింత బలపడుతుంది.

[అధస్సూచి]

^ పేరా 11 గెమర్యా, షాఫానుల గురించిన సమాచారం కోసం కావలికోట డిసెంబరు 15, 2002, 19-22 పేజీల్లోని “షాఫాను గురించి ఆయన కుటుంబం గురించి మీకు తెలుసా?” అనే ఆర్టికల్‌ చూడండి.

[15వ పేజీలోని చిత్రం]

యిర్మీయా, దేవుని సందేశాన్ని నిర్వీర్యం చేయాలనే ఒత్తిడికి లొంగిపోలేదు

[14వ పేజీలోని చిత్రసౌజన్యం]

Gabi Laron/Institute of Archaeology/ Hebrew University ©Eilat Mazar