కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

బైబిలు జీవితాలను మారుస్తుంది

మోటారు సైకిళ్లు, మత్తుపదార్థాలు, ఆటలు తప్ప మరో ధ్యాసలేని వ్యక్తి తన జీవితాన్ని పూర్తిగా దేవుని సేవలో గడపాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? జూదాన్నే వృత్తిగా చేసుకున్న వ్యక్తి తన వ్యసనం మానుకుని కుటుంబాన్ని పోషించడానికి మర్యాదకరమైన ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకున్నాడు? యెహోవాసాక్షిగా పెరిగినా, బైబిలు ప్రమాణాలను విడిచిపెట్టిన ఒకమ్మాయి మళ్లీ తన జీవితాన్ని సరిచేసుకునేలా ఆమెనేది ప్రోత్సహించింది? వారి మాటల్లోనే వినండి.

పరిచయం

పేరు: టెరెన్స్‌ జె. ఓబ్రయన్‌

వయసు: 57

దేశం: ఆస్ట్రేలియా

ఒకప్పుడు: మత్తుపదార్థాలకు బానిస, మోటారు సైకిళ్లంటే పిచ్చి

నా గతం: ఎప్పుడూ రద్దీగావుండే బ్రిస్‌బేన్‌లో నా బాల్యం గడిచింది, అది క్వీన్స్‌ల్యాండ్‌ రాజధాని. మాది క్యాథలిక్‌ కుటుంబమే అయినా నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికి చర్చీకి వెళ్లడం ఆపేసి, మతం గురించి మాట్లాడుకోవడం మానేశాం. నాకు పదేళ్లు ఉన్నప్పుడు, ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరానికి వెళ్ళిపోయాం. మా ఇల్లు సముద్రతీరం దగ్గర్లో ఉండేది, దాంతో పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేవరకు సముద్రంలో ఈత కొట్టడం, సర్ఫింగ్‌ చేయడంతోనే గడిపేశాను.

అలాగని నా చిన్నతనమంతా సంతోషంగా ఏమీ గడవలేదు. నాకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు మా నాన్న మా కుటుంబాన్ని వదిలేశాడు. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంది. తాగడం, గొడవలు మా ఇంట్లో పరిపాటైపోయాయి. ఒకరోజు రాత్రి మా అమ్మానాన్నలు బాగా గొడవపడిన తర్వాత, నేను నా మంచం మీద కూర్చొని ఒకవేళ నేను పెళ్లంటూ చేసుకుంటే నా భార్యతో ఎప్పుడూ వాదనకు దిగకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా, మా మారుటి తండ్రి, అమ్మా, ఆరుగురు పిల్లలం అంతా ఒకరితో ఒకరం ఆప్యాయంగా ఉండేవాళ్లం.

నాకు పద్దెనిమిది, పంతొమ్మిది ఏళ్లు వచ్చేసరికి నా స్నేహితులు పొగరుమోతుల్లా తయారయ్యారు. వాళ్లు పొగాకుకు, గంజాయికి, ఇతర మత్తుపదార్థాలకు, తాగుడుకు అలవాటుపడ్డారు. వాళ్లలాగే నేను కూడా విచ్చలవిడిగా బ్రతకడం మొదలుపెట్టాను. మోటారు సైకిళ్లు నడపడమంటే నాకు మహాయిష్టంగా ఉండేది. రెండుసార్లు పెద్ద ప్రమాదాలు జరిగినా, మోటారు సైకిళ్లను వదలడానికి మనస్సురాలేదు. పైగా నా మోటారు సైకిలుపై ఆస్ట్రేలియా అంతా చుట్టిరావాలని నిర్ణయించుకున్నాను.

నాకెంతో స్వేచ్ఛవున్నా, ప్రపంచ పరిస్థితుల గురించి ఆలోచించినప్పుడు, సాటి మనుష్యులు కష్టాలు పడుతున్నా చాలామంది పట్టించుకోకపోవడం చూసినప్పుడు చాలా బాధ అనిపించేది. దేవుని గురించిన, మతం గురించిన, ప్రపంచ పరిస్థితుల గురించిన వాస్తవాన్ని తెలుసుకోవాలని తహతహలాడాను. నాకొచ్చిన ఈ సందేహాల గురించి ఇద్దరు క్యాథలిక్‌ ప్రీస్టులను అడిగాను, కానీ వారిచ్చిన సమాధానాలు నాకు ఏమాత్రం సరిగ్గా అనిపించలేదు. అవే సందేహాలను వివిధ ప్రొటస్టెంట్‌ పరిచారకులను కూడా అడిగాను, అక్కడ కూడా నాకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత నా స్నేహితుడొకరు ఎడీ అనే యెహోవాసాక్షిని పరిచయం చేశాడు. నేను ఎడీతో నాలుగుసార్లు మాట్లాడాను, నేను అడిగిన ప్రతీ ప్రశ్నకు ఆయన బైబిలు నుండి సమాధానం చెప్పాడు. మా సంభాషణ ఆరంభం నుండీ నేనేదో కొత్త విషయం తెలుసుకుంటున్నానని నాకర్థమైంది. అయితే, నా జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరముందని అప్పుడు నాకనిపించలేదు.

బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఎలాగంటే . . . నేను ఆస్ట్రేలియా యాత్రలో మరో సాక్షిని కలిశాను, ఆయనతో కూడా చర్చించాను. అయితే నేను క్వీన్స్‌ల్యాండ్‌కు తిరిగొచ్చాక దాదాపు ఆరు నెలల వరకు సాక్షులను కలవలేదు.

ఒకరోజు పని నుండి ఇంటికి తిరిగొస్తుండగా, మంచి బట్టలు వేసుకుని, చేతిలో బ్రీఫ్‌కేసు పట్టుకుని నడుస్తున్న ఇద్దరు వ్యక్తులను చూశాను. బహుశా వాళ్లు యెహోవాసాక్షులు అయ్యుంటారని ఊహించి, దగ్గరకెళ్లి అడిగితే వాళ్లు అవునని చెప్పారు. నాతో బైబిలు అధ్యయనం చేయమని వారిని అడిగాను. వెంటనే సాక్షుల కూటాలకు వెళ్ళడం మొదలుపెట్టాను, ఆ తర్వాత 1973లో సిడ్నీలో జరిగిన ఒక పెద్ద సమావేశానికి కూడా వెళ్లాను. అయితే నేనేమి చేస్తున్నానో తెలిసినప్పుడు మా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా అమ్మ చాలా బాధపడ్డారు. దాంతో పాటు వేరే కారణాలవల్ల కూడా నేను సాక్షులను కలవడం మానేశాను. ఆ తర్వాత ఒక సంవత్సరంపాటు, నాకు బాగా ఇష్టమైన మరో వ్యాపకంలో అంటే క్రికెట్‌ ఆడడంలో మునిగిపోయాను.

కానీ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు మాత్రమే నేను నిజంగా సంతోషంగా ఉన్నానని నాకర్థమైంది. మళ్లీ వాళ్లను కలుసుకుని, కూటాలకు వెళ్లడం మొదలుపెట్టాను. అలాగే మత్తు పదార్థాలు తీసుకుంటున్న నా స్నేహితులతో కలవడం మానేశాను.

బైబిల్లో నుండి యోబు గురించి తెలుసుకున్న విషయాలే నేనిన్ని మార్పులు చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చాయి. సౌమ్యంగానే అయినా నిక్కచ్చిగా మాట్లాడే బిల్‌ అనే యెహోవాసాక్షి నాతో క్రమంగా బైబిలును చర్చించాడు. మేము యోబు జీవితంలో జరిగినదాన్ని గురించి బైబిలు నుంచి చర్చించుకున్న తర్వాత బిల్‌ నన్ను, ‘దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించడంలేదని సాతాను ఇంకెవరిని కూడా నిందించాడు’ అని అడిగాడు. (యోబు 2:3-5) బైబిల్లో నాకు తెలిసిన వ్యక్తుల పేర్లన్నీ చెప్పాను, బిల్‌ అవన్నీ ఓపిగ్గా విని, “అవును వారిని కూడా నిందించాడు” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన నా కళ్లలోకి సూటిగా చూస్తూ, “నిన్ను కూడా సాతాను అలాగే నిందిస్తున్నాడు” అన్నాడు. నేను అవాక్కయ్యాను. ఆ అధ్యయనానికి ముందు, నేను తెలుసుకుంటున్న సిద్ధాంతాలు సత్యమని నాకు తెలుసు. అయితే నేను నేర్చుకుంటున్న విషయాలకు తగ్గట్టు ప్రవర్తించాలని నాకు అప్పుడే అర్థమైంది. నాలుగు నెలల తర్వాత బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షిని అయ్యాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . . బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించడమెలాగో తెలుసుకుని ఉండకపోతే, నేనెలా ఉండేవాణ్ణో తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. బహుశా నేనీపాటికి చనిపోయి ఉండేవాడినేమో! మత్తుపదార్థాలు, తాగుడు వల్ల నా పాత స్నేహితుల్లో చాలామంది ఇప్పటికే చనిపోయారు. అలాగే వారిలో చాలామంది వైవాహిక జీవితం సంతోషంగా సాగలేదు. నా జీవితం కూడా అలాగే తయారైవుండేదని నాకు తెలుసు.

నాకిప్పుడు పెళ్లయ్యింది, నేనూ నా భార్య మార్గరెట్‌ ఆస్ట్రేలియాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో ఆనందంగా సేవచేస్తున్నాము. మా కుటుంబంలో ఇంకెవ్వరూ యెహోవా ఆరాధకులు కాలేదు. అయినప్పటికీ, గడచిన సంవత్సరాల్లో నేనూ మార్గరెట్‌ చాలామంది వ్యక్తులతో, దంపతులతో బైబిలు అధ్యయనం చేసి ఎంతో ఆనందాన్ని పొందాము. మేము ఎవరితో అధ్యయనం చేశామో వారంతా నాలాగే జీవితంలో మార్పులు చేసుకున్నారు. అలా మాకు చాలామంది మంచి స్నేహితులయ్యారు. అంతేకాక, నా భార్య మార్గరెట్‌ యెహోవాసాక్షుల కుటుంబంలో పుట్టి పెరిగింది, ఆమె దాదాపు 40 సంవత్సరాల క్రితం నేను చేసుకున్న ప్రమాణానికి కట్టుబడివుండేలా నాకు సహాయం చేసింది. మాకు పెళ్లయి 25 ఏళ్లు దాటాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం. అన్ని విషయాల్లో మా అభిప్రాయాలు ఒకేలా లేకపోయినా, ఇప్పటివరకు మేమెప్పుడూ వాదించుకోలేదు. బైబిలు చదవడంవల్లే మేమలా ఉండగలిగామని మా ఇద్దరి అభిప్రాయం.

పరిచయం

పేరు: మసహీరో ఓకబయషీ

వయసు: 39

దేశం: జపాను

ఒకప్పుడు: జూదగాడు

నా గతం: నేను ఇవాకురాలో పెరిగాను. అది ఓ చిన్న పట్టణం. నాగోయా నుండి అక్కడకు అరగంట రైలు ప్రయాణం. మా తల్లిదండ్రులు చాలా ప్రేమగలవారు. అయితే మా నాన్న ఓ యాకూజా అంటే ఒక గుంపుతో కలిసి నేరాలకు పాల్పడేవాడని ఆ తర్వాత తెలిసింది. నేరాలు చేసి సంపాదించిన డబ్బుతో ఆయన కొంతకాలం కుటుంబాన్ని పోషించాడు. ప్రతీరోజు విపరీతంగా తాగేవాడు, నాకు 20 ఏళ్లు వచ్చేసరికి ఆయన కాలేయం దెబ్బతిని చనిపోయాడు.

మా నాన్న కొరియా దేశస్థుడు అవడంవల్ల మమ్మల్ని అందరూ వేరుచేసి చూసేవారు. దీనితోపాటు వేరే కారణాలవల్ల టీనేజీలో ఎన్నో బాధలుపడ్డాను. నేను ఉన్నత పాఠశాలలో చేరినా ఎప్పుడో ఒకసారి మాత్రమే పాఠశాలకు వెళ్లేవాడిని, అలా ఒక సంవత్సరం తర్వాత చదువే మానేశాను. అప్పటికే నా పేరు పోలీసు రికార్డుల్లో ఉండడంతోపాటు మా నాన్న కొరియా దేశస్థుడు కావడంవల్ల నాకు ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. తంటాలుపడి చివరకు ఎలాగో ఓ ఉద్యోగం సంపాదించుకున్నాను కానీ నా మోకాళ్లకు గాయాలైనందువల్ల, కష్టమైన పని చేయలేకపోయేవాణ్ణి.

బతుకు తెరువు కోసం నేను పచింకొ అనే జూదం ఆడడం మొదలుపెట్టాను. పిన్‌బాల్‌ మిషన్‌ లాంటి పరికరం ఉపయోగించి ఈ ఆట ఆడతారు. అప్పటికే నాతో ఉంటున్న అమ్మాయి నేనొక మంచి ఉద్యోగం సంపాదించుకొని తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. కానీ నేను జూదంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తుండేవాణ్ణి కాబట్టి, ఆ జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు.

బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఎలాగంటే . . . ఒకరోజు మా ఇంటికి ఒక యెహోవాసాక్షి వచ్చి, జీవం—ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చారు. నేను అంతకు ముందెప్పుడూ ఈ ప్రశ్న గురించి ఆలోచించలేదు. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత, బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడ్డాను. చనిపోయినవాళ్లకు ఏమి జరుగుతుందోనని ఎప్పుడూ ఆలోచిస్తుండేవాణ్ణి. ఈ విషయమే కాక మరెన్నో విషయాల గురించి బైబిలు ఇస్తున్న స్పష్టమైన జవాబులు చూసినప్పుడు, నా కళ్లనుండి పొరలు రాలిపడినట్లు అనిపించింది.

నేను బైబిలు నుండి నేర్చుకుంటున్నవాటి ప్రకారం నడుచుకోవాలని అర్థంచేసుకున్నాను. అందువల్ల, సిగరెట్లు తాగడం మానేశాను, మా వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నాం. అప్పట్లో జుట్టు బాగా పెంచి, దానికి రాగి రంగు వేసుకునేవాణ్ణి. దాన్ని కత్తిరించుకుని నీటుగా కనిపించడం మొదలుపెట్టాను. అలాగే జూదమాడడం మానేశాను.

ఇలా మార్పులు చేసుకోవడం అంత సులభం కాలేదు. ఉదాహరణకు, నా సొంత శక్తితో కాదుగానీ, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం వల్ల, యెహోవా దేవుని సహాయంతో మాత్రమే పొగతాగడం మానేయగలిగాను. అంతేకాక, నేను పచింకొ ఆడడం మానేసిన తర్వాత దొరికిన మొదటి ఉద్యోగంతో సర్దుకుపోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే జూదంలో సంపాదించిన దానికన్నా చాలాతక్కువ సంపాదించేవాణ్ణి, దానికి తోడు ఒత్తిడి ఎక్కువైంది, పని కూడా చాలా కష్టంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో బైబిల్లోని ఫిలిప్పీయులు 4:6, 7 వచనాలు నాకు చాలా సహాయం చేశాయి. అక్కడిలా ఉంది: ‘దేని గురించీ చింతించకండి గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు, మీ తలంపులకు కావలివుంటుంది.’ ఈ వచనాలు నా జీవితంలో ఎన్నోసార్లు నెరవేరడం చూశాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . . నేను యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదట్లో నా భార్యకు నచ్చలేదు. అయితే నా ప్రవర్తనలో వస్తున్న మార్పులను చూసినప్పుడు ఆమె కూడా అధ్యయనంలో కూర్చోవడం, యెహోవాసాక్షుల కూటాలకు రావడం మొదలుపెట్టింది. ఇప్పుడు మేమిద్దరం యెహోవాసాక్షులం. ఇద్దరం కలిసి యెహోవా సేవచేయడం నిజంగా గొప్ప ఆశీర్వాదం.

నేను బైబిలు అధ్యయనం చేయకముందు, చాలా సంతోషంగా ఉన్నానని అనుకునేవాణ్ణి. కానీ నిజమైన సంతోషమంటే ఏమిటో ఇప్పుడు నాకు తెలిసింది. బైబిలు ప్రమాణాలకు తగ్గట్టు జీవించడం అంత సులభం కాదు, అయితే ఇంతకన్నా శ్రేష్ఠమైన జీవన విధానం లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

పరిచయం

పేరు: ఎలిజబెత్‌ జేన్‌ స్కోఫీల్డ్‌

వయసు: 35

దేశం: యునైటెడ్‌ కింగ్‌డమ్‌

ఒకప్పుడు: వారాంతాల్లో జల్సాగా గడపడమే జీవితం అనుకునేది

నా గతం: నేను స్కాట్లండ్‌లోవున్న, గ్లాస్గో నగర శివార్లలోని హార్డ్‌గేట్‌ అనే చిన్న పట్టణంలో పెరిగాను. యెహోవాసాక్షి అయిన మా అమ్మ నాకు ఏడేళ్లు వచ్చేసరికి బైబిలు విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. అయితే 17 ఏళ్లు వచ్చేసరికి నా తోటి విద్యార్థులతో సరదాగా గడిపేందుకే, అంటే నైట్‌క్లబ్బులకు వెళ్లడం, హెవీమెటల్‌ మ్యూజిక్‌ వినడం, తాగడం మీదే ఎక్కువ ఆసక్తి చూపించాను. దేవుడన్నా, బైబిలన్నా నాకస్సలు ఇష్టముండేది కాదు. వారాంతాల్లో జల్సాగా గడపడమే జీవితం అనుకున్నాను. కానీ నాకు 21 ఏళ్లు వచ్చేసరికి అదంతా మారిపోయింది.

ఒకసారి నేను ఉత్తర ఐర్లాండులోవున్న మా బంధువుల్ని చూడ్డానికి వెళ్లాను. అక్కడున్నప్పుడు నేను ఆరంజ్‌ వాక్‌ అనే ప్రొటస్టెంట్‌ ఊరేగింపు చూశాను. ఆ సందర్భంలో ప్రొటస్టెంట్లకు, క్యాథలిక్‌లకు మధ్య ఉన్న ద్వేషాన్ని, వివక్షను చూసి దిగ్భ్రాంతి చెందాను. నిజానికి ఆ సంఘటన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు బైబిలు నుండి మా అమ్మ చెప్పిన విషయాలు నాకు గుర్తొచ్చాయి. అంతేకాదు దేవుడు ప్రేమతో పెట్టిన నియమాలను ఉల్లఘించేవారిని ఆయనెప్పుడూ ఇష్టపడడని కూడా నాకు తెలుసు. నేనెలా జీవించాలని దేవుడు చెబుతున్నాడో పట్టించుకోకుండా, నా ఇష్టమొచ్చినట్టు జీవిస్తున్నానని ఆ క్షణం నాకర్థమయ్యింది. నేను స్కాట్లాండుకు వెళ్లినప్పుడు, బైబిలు చెప్పేదాన్ని జాగ్రత్తగా పరిశోధించాలని నిర్ణయించుకున్నాను.

బైబిలు నా జీవితాన్ని మార్చింది. ఎలాగంటే . . . అన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊర్లో యెహోవాసాక్షుల కూటానికి వెళ్లినప్పుడు నాకు బిడియంగా, కంగారుగా అనిపించింది. అయితే అక్కడ అందరూ నన్నెంతో ఆప్యాయంగా పలకరించారు. నేను బైబిలు నుండి నేర్చుకుంటున్న విషయాల ప్రకారం నడుచుకోవడం మొదలుపెట్టినప్పుడు, ప్రేమగల ఒక సహోదరి నా గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంది. నేను మళ్ళీ సంఘ సభ్యుల్లో ఒకరినని అనుకునేలా ఆమె నాకు సహాయం చేసింది. నా పాత స్నేహితులు నన్ను నైట్‌క్లబ్‌లకు రమ్మని పిలుస్తూనే ఉన్నారు, అయితే నేను బైబిలు ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నానని వారితో చెప్పాను. కొంతకాలానికి వాళ్లు నన్ను పిలవడం మానేశారు.

బైబిలు నీతిసూత్రాల పుస్తకం మాత్రమేనని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారింది. బైబిల్లోని వ్యక్తులు నిజంగా జీవించారని, వాళ్లకు కూడా నాలాగే భావోద్వేగాలు, బలహీనతలు ఉన్నాయని మెల్లమెల్లగా అర్థమైంది. వాళ్లు కూడా తప్పులు చేశారు. అయినా, వాళ్లు నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా దేవుడు వారిని క్షమించాడు. నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుణ్ణి లెక్కచేయలేదు, అయినా ఆయనను సంతోషపెట్టేందుకు నేనిప్పుడు శాయశక్తులా ప్రయత్నిస్తే ఆయన నన్ను క్షమిస్తాడని, గతంలో నేను చేసిన తప్పుల్ని మర్చిపోతాడని నమ్ముతున్నాను.

మా అమ్మ మంచి నడవడి కూడా నాకు స్ఫూర్తినిచ్చింది. నేను దేవుణ్ణి విడిచిపెట్టాను కానీ అమ్మ మాత్రం ఆయన్ని అంటిపెట్టుకునే ఉంది. అమ్మ యెహోవాకు నమ్మకంగా ఉండడం, ఆయన సేవ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నో ఆశీర్వాదాలు పొందవచ్చని చూపించింది. చిన్నప్పుడు సువార్త ప్రకటించడానికి అమ్మతో కలిసి ఇంటింటికి వెళ్లడం నాకస్సలు నచ్చేది కాదు. ప్రజలకు ప్రకటించడానికి అన్ని గంటలు గడపడం నావల్ల కాదనిపించేది. కాని ఇప్పుడు మాత్రం, మత్తయి 6:31-33లో యేసు చెప్పినదాన్ని చేయడంలో ఉన్న ఆనందాన్ని స్వయంగా చవిచూడాలని నిశ్చయించుకున్నాను. ఆయన, ‘ఏమి తింటామో ఏమి తాగుతామో ఏమి ధరించుకుంటామో అని చింతించకండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి; అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడతాయి’ అని అన్నాడు. నేను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షిని అయిన వెంటనే, రోజంతా పనిచేసే ఉద్యోగం మానేసి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చూసుకొని దేవుని సేవలో ఎక్కువ గంటలు గడపడం మొదలుపెట్టాను.

నేనెలా ప్రయోజనం పొందానంటే . . . యుక్తవయస్సులో ఉన్నప్పుడు అంటే వారాంతాల్లో జల్సాగా గడపడమే జీవితం అని నేననుకున్న రోజుల్లో నాకెప్పుడూ ఏదో వెలితిగా ఉండేది, జీవితం శూన్యంగా అనిపించేది. అయితే ఇప్పుడు నేను యెహోవా సేవలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాను కాబట్టి నాకిప్పుడు ఎంతో తృప్తిగా ఉంది. నా జీవితానికో లక్ష్యముంది. నాకు ఇప్పుడు పెళ్లి అయ్యింది. నేనూ నా భర్త ప్రతీవారం యెహోవాసాక్షుల సంఘాలకు వెళ్తూ అక్కడున్నవారిని ప్రోత్సహిస్తున్నాము. ఈ పని నా జీవితంలో నాకు లభించిన గొప్ప ఆశీర్వాదం. యెహోవా నాకు మరో అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు నేనెంతో రుణపడివున్నాను. (w09-E 11/01)

[29వ పేజీలోని బ్లర్బ్‌]

“మా సంభాషణ ఆరంభం నుండీ నేనేదో కొత్త విషయం తెలుసుకుంటున్నానని నాకర్థమైంది. అయితే, నా జీవన శైలి మార్చుకోవాల్సిన అవసరముందని అప్పుడు నాకనిపించలేదు”

[31వ పేజీలోని బ్లర్బ్‌]

“నా సొంత శక్తితో కాదుగానీ, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం వల్ల, యెహోవా దేవుని సహాయంతో మాత్రమే పొగతాగడం మానేయగలిగాను”

[32వ పేజీలోని బ్లర్బ్‌]

“బైబిలు నీతిసూత్రాల పుస్తకం మాత్రమేనని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారింది. బైబిల్లోని వ్యక్తులు నిజంగా జీవించారని, వాళ్లకు కూడా నాలాగే భావోద్వేగాలు, బలహీనతలు ఉన్నాయని మెల్లమెల్లగా అర్థమైంది”