కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాసాక్షులది ప్రొటస్టెంట్‌ మతమా?

యెహోవాసాక్షులది ప్రొటస్టెంట్‌ మతమా?

మా పాఠకుల ప్రశ్న

యెహోవాసాక్షులది ప్రొటస్టెంట్‌ మతమా?

యెహోవాసాక్షులది ప్రొటస్టెంట్‌ మతం కాదు. ఎందుకు?

16వ శతాబ్దంలో రోమన్‌ క్యాథలిక్‌ చర్చిని సంస్కరించే ఉద్దేశంతో ఐరోపాలో ప్రొటస్టెంట్‌ ఉద్యమం మొదలైంది. “ప్రొటస్టెంట్‌” అనే పదం మొట్టమొదటిసారి, 1529లో డైట్‌ ఆఫ్‌ స్పైర్‌ దగ్గర మార్టిన్‌ లూథర్‌ అనుచరులను పిలవడానికి ఉపయోగించబడింది. అప్పటి నుండి, ప్రొటస్టెంట్‌ సంస్కరణోద్యమ సూత్రాలను, లక్ష్యాలను అంటిపెట్టుకునే వారందరినీ ఆ పేరుతో పిలవడం మొదలైంది. మిరియమ్‌ వెబ్‌స్టర్స్‌ కొలీజియేట్‌ డిక్షనరీ, 11వ సంపుటి ప్రొటస్టెంట్‌ అంటే, “పోప్‌ సర్వాధికారాన్ని నిరాకరిస్తూ, విశ్వాసమే అత్యంత ప్రాముఖ్యమని, విశ్వాసులందరూ మతాన్ని గురించి బోధించవచ్చని, బైబిలు మాత్రమే సత్యానికి ఆధారమని నమ్ముతూ ప్రొటస్టెంట్‌ సంస్కరణోద్యమ సూత్రాలను సమర్థించే అనేక చర్చి శాఖల్లో ఒక శాఖకు చెందిన సభ్యుడు” అని వివరించింది.

యెహోవాసాక్షులు పోప్‌ సర్వాధికారాన్ని నిరాకరిస్తూ, బైబిలు ప్రాధాన్యతను హృదయపూర్వకంగా సమర్థించినా, వారికీ ప్రొటస్టెంట్‌ మతాలకూ ప్రాముఖ్యమైన ఎన్నో విషయాల్లో తేడా ఉంది. వాస్తవానికి, యెహోవాసాక్షులు “భిన్నమైనవారు” అని ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ రిలిజియన్‌ చెబుతోంది. వారికీ ప్రొటస్టెంట్‌లకూ ఉన్న మూడు ముఖ్యమైన తేడాలను పరిశీలిద్దాం.

మొదటిది, ప్రొటస్టెంట్‌ మతాలు క్యాథలిక్‌ ఆరాధనా పద్ధతుల్ని నిరాకరించినా సంస్కరణోద్యమ నాయకులు త్రిత్వం, నరకాగ్ని, మానవ ఆత్మ అమర్త్యమైనది వంటి క్యాథలిక్‌ మత సిద్ధాంతాలను కొన్నింటిని విడిచిపెట్టలేదు. కానీ ఆ సిద్ధాంతాలు బైబిలుకు విరుద్ధమైనవే కాక, దేవుణ్ణి తప్పుగా అర్థంచేసుకునేలా చేస్తాయని కూడా యెహోవాసాక్షులు నమ్ముతారు.—ఈ పత్రికలో 4-7 పేజీలు చూడండి.

రెండవది, యెహోవాసాక్షుల మతం వ్యతిరేకించమని చెప్పదు గానీ అందరికీ ఉపయోగపడే ఉపదేశాన్నిస్తుంది. “ప్రభువు సేవకుడు పోట్లాడ రాదు. అందరి పట్ల దయచూపాలి. బోధించ కలిగి ఉండాలి. సహనం ఉండాలి. తనకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లకు శాంతంగా బోధించాలి” అనే బైబిలు ఉపదేశాన్ని వారు పాటిస్తారు. (2 తిమోతి 2:24, 25; ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అనేక మతశాఖలు చెబుతున్న విషయాలు బైబిలు చెబుతున్న విషయాలకు ఎలా విరుద్ధంగా ఉన్నాయో యెహోవాసాక్షులు చూపిస్తారు. అయితే, ఇతర మత సంస్థలను సంస్కరించడం వారి లక్ష్యం కాదు. బదులుగా, దేవుని గురించి, ఆయన వాక్యమైన బైబిలు గురించి తెలుసుకోవాలని కోరుకునే ప్రతివ్యక్తికి సరైన జ్ఞానం సంపాదించుకోవడానికి సహాయం చేయడమే వారి లక్ష్యం. (కొలొస్సయులు 1:9-12) వేరే నమ్మకాలున్న ప్రజలు కావాలనే తమతో విభేదించినప్పుడు, యెహోవాసాక్షులు వారితో వ్యర్థంగా వాదించరు.—2 తిమోతి 2:23.

మూడవది, ప్రొటస్టెంట్‌ ఉద్యమం వందల మత శాఖలుగా చీలిపోయింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు ఐకమత్యంతో ఉన్నారు. బైబిలు సిద్ధాంతాల విషయానికొస్తే, 230కన్నా ఎక్కువ దేశాల్లోవున్న యెహోవాసాక్షులు “ఏకభావముతో మాటలాడవలెను” అని పౌలు ఇచ్చిన సలహాను పాటిస్తారు. వారిలో విభజనలు లేవు. బదులుగా వారు నిజంగా ‘ఒకే మనసు, ఒకే ఆలోచన కలిగివున్నారు.’ (1 కొరింథీయులు 1:10, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) వారు తమతోటి సహోదరులతో ‘సమాధానమనే బంధముచేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి’ కృషిచేస్తారు.—ఎఫెసీయులు 4:1, 2. (w09-E 11/01)