కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

బైబిల్లో ఉన్నవి నమ్మడానికి పురావస్తుశాస్త్ర ఆధారాలు ఉన్నాయా?

యెషయా 20:1లో ఉన్న అష్షూరు రాజు సర్గోను II

బైబిల్లో హీబ్రూ భాషలో ఉన్న పుస్తకాల్లోని (చాలామంది ఆ పుస్తకాలను పాత నిబంధన అంటారు) “దాదాపు 50మంది,” ఒకప్పుడు నిజంగా ఉన్నారు అనడానికి ఆధారాలు దొరికాయి అని బిబ్లికల్‌ ఆర్కియాలజీ రివ్యూ పత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్‌ చెప్పింది. వాళ్లలో యూదా, ఇశ్రాయేలు దేశాల రాజులు 14 మంది ఉన్నారు. అందరికీ బాగా తెలిసిన దావీదు, హిజ్కియా రాజులతో పాటు అంతగా తెలియని మెనహేము, పెకహు రాజులు కూడా వాళ్లలో ఉన్నారు. అంతేకాదు ఐదుగురు ఈజిప్టు ఫరోలు ఇంకా అష్షూరు, బబులోను, మోయాబు, పర్షియా, సిరియా దేశాల 19 మంది రాజులు కూడా ఉన్నారు. కేవలం రాజులే కాదు ప్రధాన యాజకులు, ఒక శాస్త్రి, ఇతర అధికారులు కూడా ఆ 50 మందిలో ఉన్నారు.

వాళ్లందరూ ఒకప్పుడు నిజంగా ఉన్నారని చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు ఒప్పుకున్నట్లు ఆ ఆర్టికల్‌ చెప్పింది. అలాగే, బైబిల్లో గ్రీకు భాషలో ఉన్న పుస్తకాల్లోని (చాలామంది ఆ పుస్తకాలను కొత్త నిబంధన అంటారు) చాలామంది కూడా ఒకప్పుడు నిజంగా ఉన్నారనడానికి ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకు హేరోదు, పొంతి పిలాతు, తిబెరి, కయప, సెర్గి పౌలు వంటివాళ్లు. ▪ (w15-E 05/01)

బైబిలు ప్రాంతాల్లో సింహాలు ఎప్పుడు కనుమరుగయ్యాయి?

పురాతన బబులోనులో ఉన్న మెరిసే ఇటుకల గోడ

బైబిల్లో ఇశ్రాయేలు, పాలస్తీనా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఉంది. ఆ దేశ అడవుల్లో ఇప్పుడు సింహాలు ఎక్కడా లేవు. కానీ, బైబిల్లో సింహాల గురించి దాదాపు 150 సార్లు ఉంది. అంటే అవి బైబిలు రచయితలకు బాగా తెలుసుండాలి. బైబిల్లో కొన్ని విషయాలను సింహాలతో పోలుస్తూ చెప్పారు. అయితే కొందరికి సింహాలు ఎదురుపడిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. సమ్సోను, దావీదు, బెనాయా సింహాలను చంపారు. (న్యాయాధిపతులు 14:5, 6; 1 సమూయేలు 17:34, 35; 2 సమూయేలు 23:20) సింహాలు కూడా కొందరిని చంపాయని బైబిల్లో ఉంది.—1 రాజులు 13:24; 2 రాజులు 17:25.

పురాతన కాలంలో బైబిలు ప్రాంతాల్లో సింహాలకు భయపడేవాళ్లు, వాటిని గౌరవించేవాళ్లు. కొంతమంది వాళ్ల గోడలను సింహాల బొమ్మలతో అలంకరించేవాళ్లు, లేదా గోడలపై సింహాల బొమ్మలను వేసుకునేవాళ్లు. బబులోను రాజులు ఊరేగింపుగా వెళ్లిన దారిలో కూడా మెరిసే ఇటుక గోడలపై సింహం బొమ్మలున్నాయి.

12వ శతాబ్దం చివర్లో క్రూసేడర్లు (మతం కోసం యుద్ధాలు చేసిన క్రైస్తవులు) పాలస్తీనా ప్రాంతంలో సింహాలను వేటాడినట్లు నివేదికలు ఉన్నాయి. 1300వ సంవత్సరం తర్వాత ఆ ప్రాంతంలో సింహాలు అంతరించిపోయి ఉండవచ్చు. అయితే మెసొపొతమియ, సిరియాలో 19వ శతాబ్దం వరకు; ఇరాన్‌, ఇరాక్‌లో 1950 వరకు సింహాలు ఉన్నట్లు నివేదికలు ఉన్నాయి.▪ (w15-E 05/01)