కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

57వ అధ్యాయం

యేసు ఒక అమ్మాయిని, చెవిటి వ్యక్తిని బాగుచేశాడు

యేసు ఒక అమ్మాయిని, చెవిటి వ్యక్తిని బాగుచేశాడు

మత్తయి 15:21-31 మార్కు 7:24-37

  • యేసు ఫేనీకే స్త్రీ కూతుర్ని బాగుచేశాడు

  • నత్తి ఉన్న చెవిటి వ్యక్తిని బాగుచేశాడు

తమకు అనుకూలమైన ఆచారాల్ని సృష్టించుకుంటున్న పరిసయ్యుల్ని ఖండించిన తర్వాత, యేసు తన శిష్యులతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆయన వాయవ్య దిశగా చాలా దూరం ప్రయాణించి ఫేనీకేలోని తూరు, సీదోను ప్రాంతాలకు చేరుకున్నాడు.

యేసు అక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. ఆ విషయం అక్కడి ప్రజలకు తెలియకూడదనుకున్నాడు, కానీ తెలిసిపోయింది. ఫేనీకేలో పుట్టిన ఒక గ్రీకు స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఇలా వేడుకుంది: “ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. చెడ్డదూత పట్టడంవల్ల మా అమ్మాయి విపరీతంగా బాధపడుతోంది.”—మత్తయి 15:22; మార్కు 7:26.

కాసేపటి తర్వాత శిష్యులు, “ఆమెను పంపించేయి, ఆమె మన వెనకాలే వస్తూ కేకలు వేస్తోంది” అని ఆయన్ని బ్రతిమాలారు. ఆమెకు ఎందుకు సహాయం చేయట్లేదో యేసు ఇలా వివరించాడు: “ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి వాళ్ల దగ్గరికి మాత్రమే దేవుడు నన్ను పంపించాడు.” అయినా ఆ స్త్రీ పట్టువదలకుండా ఆయన దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేసి, “ప్రభువా, నాకు సహాయం చేయి!” అని వేడుకుంది.—మత్తయి 15:23-25.

బహుశా ఆమె విశ్వాసాన్ని పరీక్షించడం కోసం, అన్యుల పట్ల యూదులకు ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని తెలియజేస్తూ యేసు ఇలా అన్నాడు: “పిల్లల రొట్టెలు తీసుకుని కుక్కపిల్లలకు వేయడం సరికాదు.” (మత్తయి 15:26) ‘కుక్క పిల్లలు’ అని అనడం ద్వారా అన్యుల పట్ల తనకున్న సున్నితమైన భావాల్ని యేసు తెలియజేశాడు. ఆయన ముఖ కవళికల్లో, జాలితో కూడిన స్వరంలో అవి కనబడివుంటాయి.

ఆమె ఆ మాటకు నొచ్చుకోకుండా, యూదుల తప్పుడు అభిప్రాయం గురించి యేసు అన్న మాటల్నే ఉపయోగిస్తూ, “నిజమే ప్రభువా, కానీ కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి కిందపడే ముక్కల్ని తింటాయి కదా” అని వినయంగా అంది. యేసు ఆమె మంచి మనసును గుర్తించి, “అమ్మా, నీ విశ్వాసం గొప్పది; నువ్వు కోరుకున్నట్టే నీకు జరగాలి” అన్నాడు. (మత్తయి 15:27, 28) అలాగే జరిగింది, ఆమె కూతురు అక్కడ లేకపోయినా బాగైంది! ఆ స్త్రీ తన ఇంటికి తిరిగి వెళ్లినప్పుడు, మంచం మీద ఉన్న తన కూతురు పూర్తిగా బాగై ఉండడం చూసింది. “అపవిత్ర దూత ఆ అమ్మాయిని వదిలివెళ్లాడు.”—మార్కు 7:30.

యేసు, ఆయన శిష్యులు ఫేనీకే ప్రాంతం నుండి యొర్దాను నది వైపుగా ప్రయాణం సాగించారు. వాళ్లు బహుశా గలిలయ సముద్రానికి ఉత్తరాన ఒకచోట యొర్దాను నది దాటి దెకపొలి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక కొండ మీదికి వెళ్లినప్పుడు ప్రజలు వాళ్లను గుర్తుపట్టారు. ప్రజలు కుంటివాళ్లను, చేతుల్లేనివాళ్లను, గుడ్డివాళ్లను, మూగవాళ్లను యేసు దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వాళ్లను బాగు చేసినప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపర్చారు.

అయితే, నత్తి ఉన్న ఒక చెవిటి వ్యక్తి మీద యేసు ప్రత్యేక శ్రద్ధ చూపించాడు. అంతమంది జనంలో ఆ వ్యక్తికి ఎలా అనిపించి ఉంటుందో ఊహించండి! యేసు బహుశా అతని కంగారును గమనించి, అతన్ని వాళ్లకు దూరంగా తీసుకెళ్లాడు. వాళ్లిద్దరే ఉన్నప్పుడు, యేసు అతన్ని బాగు చేయబోతున్నానని అతనికి సైగ చేసి చెప్పాడు. యేసు అతని చెవుల్లో తన వేళ్లు పెట్టి, ఉమ్మివేసి, తర్వాత అతని నాలుకను ముట్టుకున్నాడు. తర్వాత యేసు ఆకాశం వైపు చూసి “ఎప్ఫతా” అన్నాడు. ఆ మాటకు “తెరుచుకో” అని అర్థం. దాంతో అతను వినగలిగాడు, సరిగ్గా మాట్లాడగలిగాడు. దీని గురించి అందరికీ తెలియడం యేసుకు ఇష్టంలేదు. ప్రజలు తాము కళ్లారా చూసిన దాన్నిబట్టి, విన్న దాన్నిబట్టి తనమీద విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకున్నాడు.—మార్కు 7:32-36.

యేసు అలా అద్భుతరీతిలో రోగుల్ని బాగు చేయడం చూసి, ప్రజలు ‘ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.’ వాళ్లు ఇలా అన్నారు: “ఆయన చేసేవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన చివరికి చెవిటివాళ్లు కూడా వినేలా చేస్తున్నాడు, మూగవాళ్లు కూడా మాట్లాడేలా చేస్తున్నాడు.”—మార్కు 7:37.