కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

122వ అధ్యాయం

యేసు మేడగదిలో చేసిన ముగింపు ప్రార్థన

యేసు మేడగదిలో చేసిన ముగింపు ప్రార్థన

యోహాను 17:1-26

  • దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి తెలుసుకోవడం వల్ల ప్రయోజనం

  • యెహోవా, యేసు, శిష్యులు ఐక్యంగా ఉండడం

యేసు త్వరలో వెళ్లిపోతాడు, కాబట్టి అపొస్తలుల మీద ప్రగాఢమైన ప్రేమతో ఆయన వాళ్లను సిద్ధం చేస్తున్నాడు. ఆయన ఆకాశం వైపు చూసి తండ్రికి ఇలా ప్రార్థించాడు: “నీ కుమారుడు నిన్ను మహిమపర్చేలా నీ కుమారుణ్ణి మహిమపర్చు. ఎందుకంటే, నువ్వు మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు. దానివల్ల, నువ్వు తనకు అప్పగించిన వాళ్లందరికీ ఆయన శాశ్వత జీవితాన్ని ఇవ్వగలుగుతాడు.”—యోహాను 17:1, 2.

దేవుణ్ణి మహిమపర్చడమే అన్నిటికన్నా ప్రాముఖ్యమని యేసు గుర్తించినట్లు అర్థమౌతోంది. అయితే మనుషులు శాశ్వత జీవితం పొందడం గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. “మనుషులందరి మీద ఆయనకు అధికారం” ఇవ్వబడింది కాబట్టి, విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలు మనుషులందరికీ అందేలా ఆయన చేయగలడు. అయితే, ఆ ప్రయోజనాలు కొంతమంది మాత్రమే పొందుతారు. ఎందుకంటే యేసు ఇలా చెప్పాడు: “ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ, నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.” అలా తెలుసుకునేవాళ్లు మాత్రమే విమోచన క్రయధనం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందుతారు.—యోహాను 17:3.

ఒక వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి ఎక్కువగా తెలుసుకుని వాళ్లతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలి. అతను వాళ్లలా ఆలోచించాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు యెహోవాకు, యేసుకు ఉన్న అద్భుతమైన లక్షణాల్ని చూపించడానికి కృషిచేయాలి. అలాగే, మనుషులు శాశ్వత జీవితం పొందడం కన్నా దేవుడు మహిమపర్చబడడం ప్రాముఖ్యమని అతను గుర్తించాలి. ఆ విషయం గురించి మరోసారి ప్రస్తావిస్తూ యేసు ఇలా అన్నాడు:

“చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేసి భూమ్మీద నిన్ను మహిమపర్చాను. కాబట్టి తండ్రీ, లోకం ఉనికిలోకి రాకముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో అదే మహిమతో ఇప్పుడు నన్ను నీ దగ్గర మహిమపర్చు.” (యోహాను 17:4, 5) తనను పునరుత్థానం చేసి, పరలోకంలో అంతకుముందు తనకున్న మహిమను మళ్లీ అనుగ్రహించమని యేసు తండ్రిని అడుగుతున్నాడు.

అయితే, పరిచర్యలో తాను ఏం సాధించాడో గుర్తుచేసుకుంటూ యేసు ఇలా ప్రార్థించాడు: “లోకంలో నుండి నువ్వు నాకు ఇచ్చిన మనుషులకు నీ పేరు వెల్లడిచేశాను. వాళ్లు నీవాళ్లు, వాళ్లను నువ్వు నాకు ఇచ్చావు; వాళ్లు నీ వాక్యాన్ని పాటించారు.” (యోహాను 17:6) యేసు తన పరిచర్యలో యెహోవా పేరును ఉపయోగించడం కన్నా ఎక్కువే చేశాడు. ఆ పేరు ధరించిన వ్యక్తి గురించి అంటే యెహోవాకున్న లక్షణాల గురించి, ఆయన మనుషులతో వ్యవహరించే తీరు గురించి తెలుసుకునేలా అపొస్తలులకు సహాయం చేశాడు.

దానివల్ల అపొస్తలులు యెహోవాను తెలుసుకున్నారు, ఆయన కుమారుని పాత్రను, బోధల్ని అర్థంచేసుకున్నారు. యేసు వినయంగా ఇలా అన్నాడు: “నువ్వు నాకు చెప్పిన మాటల్ని నేను వాళ్లకు చెప్పినప్పుడు వాళ్లు వాటిని అంగీకరించి, నేను నీ ప్రతినిధిగా వచ్చానని నిజంగా తెలుసుకున్నారు. అంతేకాదు, నువ్వు నన్ను పంపావని వాళ్లు నమ్ముతున్నారు.”—యోహాను 17:8.

తర్వాత, తన అనుచరులు లోకానికి ఎలా భిన్నంగా ఉన్నారో చెప్తూ, యేసు ఇలా అన్నాడు: ‘నేను లోకం గురించి ప్రార్థించట్లేదు కానీ నువ్వు నాకు ఇచ్చినవాళ్ల గురించే ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే వాళ్లు నీ వాళ్లు; పవిత్రుడివైన తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు. అప్పుడు, మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్లు కూడా ఐక్యంగా ఉంటారు. నేను వాళ్లను కాపాడాను. నాశనపుత్రుడు తప్ప వాళ్లలో ఏ ఒక్కరూ నాశనం కాలేదు.’ ఆ నాశనపుత్రుడు, యేసును అప్పగించడానికి సిద్ధమైన ఇస్కరియోతు యూదానే.—యోహాను 17:9-12.

యేసు ఇంకా ఇలా ప్రార్థించాడు: “లోకం వాళ్లను ద్వేషించింది; . . . వాళ్లను లోకంలో నుండి తీసుకెళ్లిపొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ, దుష్టుని నుండి వాళ్లను కాపాడమని నీకు ప్రార్థిస్తున్నాను. నేను లోకసంబంధిని కానట్టే వాళ్లు కూడా లోకసంబంధులు కారు.” (యోహాను 17:14-16) అపొస్తలులు, ఇతర శిష్యులు లోకంలో అంటే సాతాను పరిపాలిస్తున్న మానవ సమాజంలో జీవిస్తున్నారు. అయినప్పటికీ వాళ్లు దానికి, దాని చెడుతనానికి దూరంగా ఉండాలి. ఎలా?

వాళ్లు పవిత్రంగా ఉండాలి, దేవుని సేవ చేసేలా తమను తాము ప్రత్యేకపర్చుకోవాలి. అందుకోసం వాళ్లు హీబ్రూ లేఖనాల్లో ఉన్న సత్యాలకు, యేసు స్వయంగా బోధించిన సత్యాలకు అనుగుణంగా జీవించాలి. యేసు ఇంకా ఇలా ప్రార్థించాడు: “సత్యంతో వాళ్లను పవిత్రపర్చు, నీ వాక్యమే సత్యం.” (యోహాను 17:17) కాలం గడుస్తుండగా, కొంతమంది అపొస్తలులు దైవప్రేరణతో రాసిన పుస్తకాలు కూడా ఆ ‘సత్యంలో’ భాగమయ్యాయి. అవి ఒకవ్యక్తిని పవిత్రపర్చగలవు.

ఆ తర్వాతి కాలంలో ఇతరులు కూడా ‘సత్యాన్ని’ అంగీకరిస్తారు. అందుకే యేసు అక్కడున్న అపొస్తలుల కోసం మాత్రమే కాకుండా, వాళ్ల బోధ విని తన మీద ‘విశ్వాసం ఉంచే వాళ్లందరి కోసం’ ప్రార్థించాడు. ఇంతకీ ఆయన ఏమని ప్రార్థించాడు? ఆయన ఇలా వేడుకున్నాడు: “వాళ్లందరూ ఐక్యంగా ఉండాలని; తండ్రీ, నువ్వు నాతో ఐక్యంగా ఉన్నట్టు, నేను నీతో ఐక్యంగా ఉన్నట్టు వాళ్లు కూడా మనతో ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను.” (యోహాను 17:20, 21) అన్ని విషయాల్లో తనకు, తన తండ్రికి ఒకే అభిప్రాయం ఉంటుందని యేసు చెప్తున్నాడు. తన అనుచరులు కూడా అలానే ఐక్యంగా ఉండాలని యేసు ప్రార్థిస్తున్నాడు.

యేసు ఇంతకుముందే పేతురుతో, ఇతర అపొస్తలులతో మాట్లాడుతూ, వాళ్లకోసం పరలోకంలో స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు. (యోహాను 14:2, 3) ఆ విషయాన్నే గుర్తుచేసుకుంటూ యేసు ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన వీళ్లు, నేను ఉండే చోట నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్లు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం పుట్టకముందే నువ్వు నన్ను ప్రేమించావు.” (యోహాను 17:24) ప్రపంచం పుట్టకముందే, అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ప్రేమించాడు. ఆ కుమారుడే యేసుక్రీస్తు అయ్యాడు.

యేసు ఆ ప్రార్థన ముగింపులో తన తండ్రి పేరును, అలాగే అపొస్తలుల పట్ల, ‘సత్యాన్ని’ అంగీకరించే ఇతరుల పట్ల దేవునికి ఉన్న ప్రేమను మళ్లీ నొక్కిచెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నువ్వు నామీద చూపించిన ప్రేమను వీళ్లు ఇతరుల మీద చూపించేలా, నేను వీళ్లతో ఐక్యంగా ఉండేలా నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”—యోహాను 17:26.