కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ నాడీ వ్యవస్థ (ENS, నీలం రంగులో ఉంది) జీర్ణ అవయవాల్లో అమర్చబడి ఉంది

మీ పొట్టలో ఉన్న “రెండవ మెదడు”

మీ పొట్టలో ఉన్న “రెండవ మెదడు”

మీకు ఎన్ని మెదడులు ఉన్నాయి? మీ జవాబు “ఒకటి” అయితే మీరు రైట్‌. కానీ మీ శరీరంలో వేరే నాడీ వ్యవస్థలు లేదా నర్వస్‌ సిస్టమ్స్‌ కూడా ఉన్నాయి. వాటిలో ఒక న్యూరాన్‌ల నెట్‌వర్క్‌ ఎంత పెద్దగా ఉందంటే సైన్‌టిస్ట్‌లు దాన్ని “రెండవ మెదడు” అని పిలుస్తున్నారు. అది పొట్టలో ఉండే నాడీ వ్యవస్థ లేదా ఎన్‌టెరిక్‌ నర్వస్‌ సిస్టమ్‌ (ENS). అది మీ తలలో కాదు గానీ మీ పొట్టలో ఉంటుంది.

మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడానికి మన శరీరం ఎంతో చక్కగా, సమన్వయంతో కష్టపడుతూ పని చేస్తుంది. అందుకే మన మెదడు ఆహారాన్ని జీర్ణించే పనిని చాలావరకు పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థకు అప్పగించేలా తయారు చేయబడింది.

మన మెదడు చేసినన్ని పనులు ENS చేయకపోయినా అది చాలాచాలా సంశ్లిష్టంగా ఉంటుంది. మనుషులకు ఈ నాడీ వ్యవస్థలో దాదాపు 20 నుండి 60 కోట్ల న్యూరాన్‌లు ఉన్నాయి. సంశ్లిష్టంగా ఉన్న ఈ న్యూరాన్‌ల నెట్‌వర్క్‌ మన జీర్ణ వ్యవస్థ లోపల అమర్చబడి ఉంది. పొట్టలో ఉన్న ఈ నాడీ వ్యవస్థ మన మెదడులో ఉండి పని చేయాల్సి వస్తే అందుకు అవసరమైన నాడులు చాలా లావుగా ఉండేవి అని సైన్‌టిస్ట్‌లు చెప్తున్నారు. ద సెకండ్‌ బ్రెయిన్‌ అనే పుస్తకం ప్రకారం, “జీర్ణ వ్యవస్థ దాన్ని అది చూసుకోవడం సురక్షితమే కాదు, ఎంతో సులభం కూడా.”

రసాయనాలు కలిసే చోటు

సరైన మోతాదుల్లో కలిసిన ఎన్నో రకాల రసాయన మిశ్రమాలను సరైన సమయంలో, సరైన చోటుకు పంపిస్తే ఆహారం అరుగుతుంది. రసాయనాలు ఇంత సంశ్లిష్టంగా కలిసి పనిచేయడం చాలా గొప్ప విషయం. ఉదాహరణకు, మన పేగుల లోపలి గోడల్లో కొన్ని ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. అవి మనం తినే ఆహారంలో ఏయే రసాయనాలు ఉన్నాయో తెలుసుకుంటాయి. ఈ సమాచారం సహాయంతో మన పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ అందుకు ఏయే ఎన్‌జైమ్‌లు అవసరమో చెప్తుంది. ఆ ఎన్‌జైమ్‌లు మన శరీరం తీసుకునేలా ఆహారాన్ని విడగొడతాయి. అంతేకాదు పొట్టలో ఉన్న ఈ నాడీ వ్యవస్థ తిన్న ఆహార పదార్థాల్లో ఆమ్లతను లేదా ఎసిడిటిని, ఇతర రసాయన గుణాలను కూడా తెలుసుకుంటుంది. దాని బట్టి ఏయే ఎన్‌జైమ్‌లు పంపించాలో నిర్ణయిస్తుంది.

జీర్ణనాళములో (digestive tract) ఆహారం ఒక చోటు నుండి ఇంకో చోటుకు కదిలే విధానం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కదలికలను మన పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ (ENS) ఎక్కువగా చూసుకుంటుంది. జీర్ణనాళములో ఉన్న కండరాలు ముడుచుకుంటూ ఉండేలా చేస్తూ మన “రెండవ మెదడు” ఆహారాన్ని జీర్ణ వ్యవస్థలో కదిలిస్తుంది. జీర్ణ వ్యవస్థ పని చేయడానికి ఈ కండరాలు ఎంత బలంగా, ఎంత తరచుగా ముడుచుకుంటూ ఉండాలో పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ లేదా ENS నిర్ణయిస్తుంది.

భద్రతకు సంబంధించిన పనులు కూడా పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ చూసుకుంటుంది. మనం తినే ఆహారంలో ఖచ్చితంగా ఎంతో హాని కలిగించే క్రిములు ఉంటాయి. అందుకే మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాల్లో 70 నుండి 80 శాతం వరకు కణాలు మన పొట్టలోనే ఉన్నాయి. ఈ కణాలు మన వ్యాధి నిరోధక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. మనం తినే వాటిలో హానికరమైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటే పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ కండరాలు గట్టిగా ముడుచుకునేలా చేస్తూ వాంతులు లేదా విరోచనాల ద్వారా ఆ హానికరమైన పదార్థాలను బయటకు పంపించి శరీరాన్ని కాపాడుతుంది.

సమాచారాన్ని చక్కగా చేరవేయడం

మెదడుతో ఏ సంబంధం లేకుండానే పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ పనిచేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ఈ రెండు నాడీ కేంద్రాలు సమాచారాన్ని ఎప్పుడూ చేరవేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు, మనం ఎప్పుడు తినాలో, ఎంత తినాలో మన మెదడుకు తెలిపే హార్మోన్‌లను నియంత్రించడంలో పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థ పాత్ర ఉంది. కడుపు నిండిపోతే ఈ నాడీ వ్యవస్థలో నాడీ కణాలు మన మెదడుకు సంకేతాలు ఇస్తాయి. మరీ ఎక్కువ తింటే కడుపులో తిప్పుతున్నట్లుగా కూడా ఉంటుంది.

ఈ ఆర్టికల్‌ చదవకముందే మీ జీర్ణనాళానికి, మీ మెదడుతో సంబంధం ఉందని మీకు అనిపించి ఉండవచ్చు. ఉదాహరణకు, కొన్ని రకాల ఆహారాన్ని తిన్నప్పుడు హాయిగా అనిపించినట్లు మీరు ఎప్పుడైనా గమనించారా? పరిశోధన ప్రకారం ఇది ఎందుకు జరుగుతుందంటే, పొట్టలో నాడీ వ్యవస్థ మన మెదడుకు ‘సంతోష సంకేతాలు’ పంపిస్తుంది. అప్పుడు జరిగే కొన్ని వరుస ప్రక్రియల వల్ల మీకు సంతోషంగా అనిపిస్తుంది. అందుకే బాగా టెన్షన్‌గా ఉన్నప్పుడు కొంతమంది కొన్ని రకాల ఆహారం ఎందుకు ఎక్కువగా తింటారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే, డిప్రెషన్‌ లాంటి జబ్బులను చికిత్స చేయడానికి పొట్టలో నాడీ వ్యవస్థను కృత్రిమంగా ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయేమోనని సైన్‌టిస్ట్‌లు పరిశోధిస్తున్నారు.

మెదడు, జీర్ణ వ్యవస్థ సమాచారాన్ని చేరవేసుకుంటాయని చెప్పడానికి కొన్ని సందర్భాల్లో పొట్ట పిండేసినట్లు అనిపించడం ఇంకో ఉదాహరణ. బాగా టెన్షన్‌గా ఉన్నప్పుడు పొట్టలో నాడీ వ్యవస్థ రక్తాన్ని పొట్ట నుండి మెదడుకు మళ్లించినప్పుడు అలా పొట్ట పిండేసినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు కడుపులో తిప్పుతున్నట్లు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే టెన్షన్‌గా ఉన్నప్పుడు పొట్ట కండరాలు మామూలు కన్నా ఎక్కువగా ముడుచుకునేలా మెదడు పొట్టలో ఉన్న నాడీ వ్యవస్థకు సంకేతాలు పంపిస్తుంది.

పొట్టలో నాడీ వ్యవస్థను మన “రెండవ మెదడు” అని అన్నా అది ఆలోచించలేదు, నిర్ణయాలు తీసుకోలేదు. అంటే అది నిజంగా ఒక మెదడు కాదు. మీ బ్యాంక్‌ అకౌంట్‌కు సంబంధించిన లెక్కలు చూడడానికి, మీ హోమ్‌వర్క్‌ చేయడానికి, పాటలు రాయడానికి అది సహాయం చేయలేదు. అయినప్పటికీ, ఈ అద్భుతమైన వ్యవస్థలో ఉన్న సంశ్లిష్టత సైన్‌టిస్ట్‌లకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బహుశా దాని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. కాబట్టి, మీరు ఈసారి భోజనం చేసేటప్పుడు మీ జీర్ణ వ్యవస్థలో జరగబోయే పనుల గురించి అంటే, సమాచారం పోగు చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం, సంకేతాలు సమన్వయం చేయడం, వాటిని పంపించడం లాంటి పనులు ఎన్ని జరుగుతాయో ఒక్కసారి ఆగి ఆలోచించండి.