కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇంటర్వ్యూ | ఫాన్‌ యూ

ఒక సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌ తన నమ్మకాల గురించి చెప్పారు

ఒక సాఫ్ట్‌వేర్‌ డిజైనర్‌ తన నమ్మకాల గురించి చెప్పారు

డాక్టర్‌ ఫాన్‌ యూ, బీజింగ్‌ దగ్గరున్న చైనా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎటామిక్‌ ఎనర్జీలో గణితశాస్త పరిశోధకుడిగా కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆయన నాస్తికుడు, పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేవాడు. కానీ ఇప్పుడు డా. యూ జీవం దేవుని చేత సృష్టించబడిందని నమ్ముతున్నారు. తేజరిల్లు! ఆయన నమ్మకాల గురించి అడిగింది.

దయచేసి మీ నేపథ్యం గురించి మాకు చెప్పండి.

నేను 1959 లో చైనాలో జ్యాన్గ్‌షీ ప్రావిన్స్‌లో, ఫూజో నగరంలో పుట్టాను. నాకు ఎనిమిది సంవత్సరాలు వచ్చే సరికి, సాంస్కృతిక విప్లవ ఫలితాలు మా దేశంలో కనిపించాయి. మా నాన్న సివిల్‌ ఇంజినీరు. ఒక మారుమూల ఎడారి ప్రాంతంలో రైలు మార్గాన్ని వేయమని ఆయనను ప్రభుత్వం ఆదేశించింది. చాలా సంవత్సరాల వరకు ఆయన మమ్మల్ని చూడడానికి సంవత్సరానికి ఒక్కసారే ఇంటికి వచ్చేవాళ్లు. అప్పుడు నేను అమ్మ దగ్గర ఉండేవాణ్ణి. ఆమె ఒక ప్రాథమిక పాఠశాలలో టీచర్‌. మేము మా అమ్మ పని చేసే స్కూల్‌లోనే ఉండేవాళ్లం. 1970 లో మేము యూఫాన్గ్‌ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అది లిన్‌చ్వాన్‌ జిల్లాలో ఒక బీద గ్రామం, అక్కడ ఆహారం చాలా తక్కువ దొరికేది.

మీ ఇంట్లో నమ్మకాలు ఏంటి?

మా నాన్నకు మతం అన్నా రాజకీయాలన్నా ఆసక్తి ఉండేది కాదు. మా అమ్మ బౌద్ధ మతస్థురాలు. మాకు స్కూల్‌లో జీవం సహజ ప్రక్రియల ద్వారా దానికదే వచ్చిందని నేర్పించేవాళ్లు. నేను నా టీచర్లు చెప్పింది నమ్మాను.

మీకు గణితశాస్త్రం మీద ఎందుకు ఆసక్తి కలిగింది?

గణిత శాస్త్రం అంటే తర్కం ఆధారంగా ఆలోచిస్తూ నిజాలను కనుక్కోవడం కాబట్టి నాకు అది నచ్చింది. 1976 లో సాంస్కృతిక విప్లవానికి నాయకుడైన డబ్ల్యు. మావో సే-టుంగ్‌ చనిపోయిన కొంతకాలానికి నేను విశ్వవిద్యాలయానికి వెళ్లాను. నేను తీసుకున్న ముఖ్య సబ్జెక్ట్‌ మ్యాథ్స్‌. అందులో మాస్టర్స్‌ డిగ్రీ పొందిన తర్వాత నేను న్యూక్లియర్‌ రియాక్టర్లను తయారు చేయడానికి అవసరమైన గణిత పరిశోధనలు చేశాను. అది నా మొదటి ఉద్యోగం.

బైబిలు గురించి మొదట మీకు ఎలా అనిపించింది?

నేను 1987 లో టెక్సస్‌ ఎ&ఎమ్‌ యూనివర్సిటీలో డాక్టరేట్‌ చదవడానికి అమెరికా వచ్చాను. అమెరికాలో చాలామంది దేవున్ని నమ్ముతారని బైబిలు చదువుతారని నాకు తెలుసు. అంతేకాకుండా ప్రతీరోజు జీవితంలో మనకు ఉపయోగపడే చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయని విన్నాను. అందుకే బైబిల్ని చదవాలని అనుకున్నాను.

బైబిలు బోధలు చాలా ఉపయోగకరంగా అనిపించాయి. కానీ కొన్ని భాగాలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించి చదవడం ఆపేశాను.

మీకు బైబిలు మీద మళ్లీ ఆసక్తి ఎలా కలిగింది?

ఒక సృష్టికర్త ఉన్నాడనే ఆలోచన నాకు కొత్త కాబట్టి ఈ విషయం గురించి సొంతగా పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను

మా ఇంటికి 1990 లో ఒక యెహోవాసాక్షి వచ్చి, మనుషులకు మంచి భవిష్యత్తు గురించి బైబిలు ఏమి చెప్తుందో చూపించారు. బైబిల్ని అర్థం చేసుకునేలా ఆమె నాకు సహాయం చేయడానికి భార్యాభర్తలు ఇద్దరిని ఏర్పాటు చేసింది. నా భార్య లీపింగ్‌ కూడా నాస్తికురాలే. ఆమె చైనాలో ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్రం నేర్పించేది. తర్వాత ఆమె కూడా బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టింది. మేము జీవం ఎలా మొదలైంది అనే విషయంలో బైబిలు ఏమి చెప్తుందో నేర్చుకున్నాము. ఒక సృష్టికర్త ఉన్నాడనే ఆలోచన నాకు కొత్త కాబట్టి ఈ విషయం గురించి సొంతగా పరిశోధన చేయాలని నిర్ణయించుకున్నాను.

మరి మీరు దాన్ని ఎలా చేశారు?

ఒక గణితశాస్త్రవేత్తగా నేను సంఘటనల సంభావ్యతను (probabilities of events) కనిపెట్టడంలో శిక్షణ పొందాను. జీవం దానంతట అదే మొదలవ్వాలంటే అప్పటికే మాంసకృత్తులు ఏర్పడి ఉండాలి అని నేను నేర్చుకున్నాను. కాబట్టి నేను ఒక మాంసకృత్తు ఏ నిర్దేశాలు లేకుండా వచ్చే అవకాశం లేదా సంభావ్యత ఎంత వరకు ఉంటుందో లెక్కపెట్టడానికి ప్రయత్నించాను. మాంసకృత్తులు ఇప్పటి వరకు తెలుసుకున్న అణువుల్లో అతి సంశ్లిష్టమైనవి. అందులోనూ జీవ కణాల్లో ఎన్నో వేల రకాల మాంసకృత్తులు ఉండవచ్చు. అవి ఒకదానితో ఒకటి ఎంతో ఖచ్చితంగా కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఒక మాంసకృత్తు దానంతట అదే ఏర్పడే సంభావ్యతే లేదు, అంటే అది అసాధ్యం అని ఇతరుల్లా నేను కూడా తెలుసుకున్నాను. పరిణామ సిద్ధాంతం అలాంటి సంశ్లిష్టమైన అణువులు వాటికి అవే, సొంతగా ఎలా సృష్టించుకుంటాయో సరిగ్గా వివరించినట్లు నాకు అనిపించలేదు. అదే వివరించలేనప్పుడు ముఖ్యంగా వాటితో ఏర్పడే జీవ వ్యవస్థలు ఎలా తయారవుతాయనేది వివరించడం చాలా కష్టం. నాకు వాస్తవాలన్నీ సృష్టికర్త వైపే చూపించాయి.

బైబిలు దేవుని నుండి వచ్చింది అని మీకు ఎలా నమ్మకం కలిగింది?

నేను యెహోవాసాక్షుల సహాయంతో బైబిల్ని స్టడీ చేస్తున్నప్పుడు బైబిల్లో చాలా వివరంగా ఉన్న ఎన్నో ప్రవచనాలు ఉన్నదున్నట్లు జరిగాయని తెలుసుకున్నాను. నేను కూడా బైబిలు సూత్రాలను పాటించడం వల్ల వచ్చే ప్రయోజనాలను రుచి చూడడం మొదలుపెట్టాను. ‘ఎన్నో సంవత్సరాల క్రితం జీవించిన బైబిలు రచయితలు ఇప్పటికీ ఉపయోగపడే మంచి మాటల్ని ఎలా రాయగలిగారు’ అని నేను అనుకున్నాను. మెల్లమెల్లగా నేను బైబిలు దేవుని వాక్యం అని అర్థం చేసుకున్నాను.

సృష్టికర్త ఉన్నాడని మీరు నమ్ముతూ ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?

నేను ప్రకృతిలో ఉన్న వివిధ మూలకాల గురించి ఆలోచించినప్పుడు సృష్టికర్త ఉన్నాడు అని నమ్మకుండా ఉండలేను. ప్రస్తుతం నేను కంప్యూటర్లకు సాఫ్ట్‌వేర్‌ తయారు చేస్తున్నాను. ఆ పని చేస్తున్నప్పుడు మన మెదడు వేరే ఏ కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ కన్నా ఎంత తెలివిగా పనిచేస్తుందో చూసినప్పుడల్లా ఎంతో ఆశ్చర్యపోతాను. ఉదాహరణకు రకరకాల మాటల్ని, స్వరాల్ని గుర్తుపట్టడానికి మన మెదడుకున్న శక్తిని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం వేరేవాళ్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల మాటలు సగం సగం ఉన్నా, మధ్యలో నవ్వినా, దగ్గినా, నత్తినత్తిగా చెప్పినా, యాసగా మాట్లాడినా, ప్రతిధ్వని వచ్చినా, చుట్టు ప్రక్కల గోలగోలగా ఉన్నా, ఫోన్‌లో గొంతు మారినా సులభంగా అర్థం చేసుకుంటాము. ఇది మీకు మామూలే అనిపించవచ్చు. కానీ సాఫ్ట్‌వేర్‌ డిజైనర్లకు అసలు విషయం తెలుసు. మాటల్ని, స్వరాల్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ కన్నా మనిషి మెదడు ఎన్నో రెట్లు గొప్పది.

పెద్దపెద్ద కంప్యూటర్లలా కాకుండా మన మెదడు భావాలను అర్థం చేసుకోగలదు, యాసగా మాట్లాడినా కనిపెట్టగలదు, గొంతు గుర్తు పట్టగలదు. మాటల్ని గుర్తుపట్టడానికి మనిషి మెదడుకున్న శక్తిని కంప్యూటర్లు కూడా అనుకరించేలా ఎలా చేయవచ్చో సాఫ్ట్‌వేర్‌ డిజైనర్లు పరిశోధన చేస్తున్నారు. అలా చేస్తూ వాళ్లు నిజానికి దేవుని చేతి పనిని అధ్యయనం చేస్తున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.