కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11వ పాఠం

బైబిల్ని ఎలా చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?

బైబిల్ని ఎలా చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?

ఏదైనా పెద్ద పని మొదలుపెట్టే ముందు, ఇంత కష్టమైన పని నేను చేయగలనా అని మీకు అనిపించిందా? బహుశా, అప్పుడు మీరు ఆ పనిని తేలిక చేసుకోవడానికి దాన్ని చిన్నచిన్న పనులుగా విడగొట్టి ఉంటారు. బైబిలు చదివే విషయంలో కూడా అంతే. ‘ఇంత పెద్ద పనిని నేను ఎలా మొదలుపెట్టాలి?’ అని మీరు అనుకోవచ్చు. అయితే బైబిలు చదవడం మీద, అధ్యయనం చేయడం మీద ఇష్టం పెంచుకోవడానికి మీరు చేయగల కొన్ని చిన్నచిన్న పనుల్ని ఈ పాఠంలో చూస్తాం.

1. మనం రోజూ ఎందుకు బైబిలు చదవాలి?

రోజూ బైబిల్ని లేదా “యెహోవా ధర్మశాస్త్రాన్ని” చదివే వ్యక్తి సంతోషంగా ఉంటాడు, అతను చేసే ప్రతీది సఫలమౌతుంది. (కీర్తన 1:1-3 చదవండి.) ముందుగా మీరు ప్రతీరోజు కొన్ని నిమిషాల పాటు బైబిలు చదవడం మొదలుపెట్టవచ్చు. అలా బైబిల్ని చదివే కొద్దీ, మీకు దానిమీద ఇష్టం పెరుగుతుంది.

2. బైబిల్ని ఎలా చదివితే ప్రయోజనం ఉంటుంది?

బైబిలు చదవడం నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, మనం కాసేపు ఆగి చదివినవాటి గురించి ఆలోచించాలి. అంటే చదవడంతో పాటు “ధ్యానించాలి.” (యెహోషువ 1:8) ఎలా ధ్యానించవచ్చు? మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘ఇది యెహోవా దేవుని గురించి నాకు ఏం చెప్తుంది? దీన్ని నా జీవితంలో ఎలా పాటించవచ్చు? వేరేవాళ్లకు సహాయం చేయడానికి నేను ఈ వచనాలు ఎలా ఉపయోగించవచ్చు?’

3. బైబిలు చదవడానికి మీరు ఎలా సమయం తీసుకోవచ్చు?

బైబిలు చదవడానికి అస్సలు సమయం దొరకట్లేదని మీకు అనిపిస్తుందా? మనలో చాలామందికి అలాగే అనిపిస్తుంది. అయితే, ‘మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోవడానికి’ ప్రయత్నించండి. (ఎఫెసీయులు 5:16) రోజులో ఒక సమయం అనుకుని, ఆ సమయాన్ని బైబిలు చదవడం కోసం పక్కన పెట్టడం ద్వారా మీరు అలా చేయవచ్చు. కొంతమంది ఉదయాన్నే బైబిలు చదువుతారు. ఇంకొంతమంది వేరే సమయంలో, బహుశా మధ్యాహ్నం పూట బైబిలు చదువుతారు. మరికొంతమంది రాత్రి పడుకునే ముందు చదువుతారు. మీకైతే ఏ సమయం బాగుంటుంది?

ఎక్కువ తెలుసుకోండి

బైబిల్ని ఇష్టంగా చదవడానికి మీరేం చేయవచ్చో పరిశీలించండి. బైబిలు స్టడీలో చర్చించే విషయాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, ముందే ఎలా చక్కగా సిద్ధపడవచ్చో తెలుసుకోండి.

మనం కొన్ని వంటకాల మీద మెల్లమెల్లగా ఎలా ఇష్టం పెంచుకుంటామో, అలాగే బైబిలు చదవడం మీద కూడా ఇష్టం పెంచుకోవచ్చు

4. బైబిల్ని ఇష్టంగా చదవడం అలవాటు చేసుకోండి

బైబిల్ని చదవడం మొదలుపెట్టాలంటే కొంచెం కష్టమే. కానీ, మనం దానిమీద “ఆకలి” లేదా ఇష్టం పెంచుకోవచ్చు. మీరు ఏదైనా కొత్త వంటకాన్ని రుచి చూసినప్పుడు మొదట మీకు అది నచ్చకపోవచ్చు. కానీ తినగా తినగా మీకు అది నచ్చుతుంది. బైబిలు చదవడం కూడా అంతే. 1 పేతురు 2:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బైబిల్ని రోజూ చదివితే, దానిమీద “ఆకలి” లేదా ఇష్టం పెరుగుతుందని మీకు అనిపిస్తుందా?

కొంతమంది బైబిల్ని ఇష్టంగా చదవడం ఎలా అలవాటు చేసుకున్నారో తెలుసుకోవడానికి వీడియో చూడండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • వీడియోలో చూపించిన యౌవనులకు ఎలాంటి ఆటంకాలు వచ్చాయి?

  • అయినాసరే రోజూ బైబిలు చదవడానికి వాళ్లకు ఏది సహాయం చేసింది?

  • బైబిల్ని ఎక్కువ ఇష్టంగా చదవడానికి వాళ్లు ఏం చేశారు?

బైబిలు చదవడం మొదలుపెట్టడానికి సలహాలు:

  • సరిగ్గా అనువదించిన, వాడుక భాషలో ఉన్న బైబిల్ని ఎంచుకోండి. కొత్త లోక అనువాదం బైబిల్ని చదివి చూడండి.

  • మీరు ఏ పుస్తకాల్ని లేదా అధ్యాయాల్ని చదవాలి అనుకుంటున్నారో వాటితో మొదలుపెట్టండి. సలహాల కోసం “బైబిలు చదవడం మొదలుపెట్టండి” అనే చార్టు చూడండి.

  • మీరు ఏమేం చదివారో రాసుకోండి. ఈ పుస్తకంలో ఉన్న “బైబిల్లో ఎక్కడి వరకు చదివారో గుర్తు పెట్టుకోండి” అనే చార్టు ఉపయోగించండి.

  • JW లైబ్రరీ యాప్‌ ఉపయోగించండి. మీరు ఎక్కడున్నా ఈ యాప్‌ ద్వారా మీ ఫోన్‌లో లేదా టాబ్‌లో బైబిలు చదవవచ్చు, వినవచ్చు.

  • కొత్త లోక అనువాదంలో ఉన్న అనుబంధ సమాచారం ఉపయోగించుకోండి. అందులో ఉన్న మ్యాపులు, చార్టులు, పదకోశం ఉపయోగిస్తే బైబిలు చదవడం ఇంకా ఆసక్తిగా ఉంటుంది.

5. బైబిలు స్టడీకి సిద్ధపడండి

కీర్తన 119:34 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • బైబిలు చదివే ముందు లేదా స్టడీకి సిద్ధపడే ముందు ప్రార్థించడం ఎందుకు మంచిది?

స్టడీ చేస్తున్న పాఠం నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే, ప్రతీసారి ముందే సిద్ధపడండి. మీరు ఏదైనా పాఠాన్ని సిద్ధపడుతున్నప్పుడు, ఈ పద్ధతిని ప్రయత్నించి చూడండి:

  1. (1) పాఠంలోని మొదటి భాగం చదవండి.

  2. (2) అక్కడ ఇచ్చిన లేఖనాల్ని బైబిలు తీసి చూడండి. ఆ లేఖనాల్ని అక్కడ ఎందుకు ఇచ్చారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

  3. (3) ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చే ముఖ్యమైన పదాల కింద గీతలు పెట్టుకోండి; అలా చేస్తే, స్టడీ జరుగుతున్నప్పుడు మీరు తేలిగ్గా జవాబులు చెప్పగలుగుతారు.

మీకు తెలుసా?

యెహోవాసాక్షులమైన మేము రకరకాల బైబిలు అనువాదాల్ని ఉపయోగించాం. అయితే, ప్రత్యేకించి పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంను మేము ఇష్టపడతాం. ఎందుకంటే అందులో దేవుని మాటల్ని ఉన్నదున్నట్టు, స్పష్టంగా అనువదించారు, పైగా దేవుని పేరును ఉపయోగించారు.—యెహోవాసాక్షులకు సొంత బైబిలు ఉందా? అనే jw.org ఆర్టికల్‌ చూడండి.

కొంతమంది ఇలా అంటారు: “బైబిల్ని చదవడం చాలా పెద్ద పని. నాకంత తీరిక లేదు, ఓపిక లేదు.”

  • మీరేమంటారు?

ఒక్కమాటలో

బైబిల్ని చదవడానికి సమయం తీసుకుంటే, చదివేది అర్థమయ్యేలా సహాయం చేయమని ప్రార్థిస్తే, స్టడీకి చక్కగా సిద్ధపడితే బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందుతాం.

మీరేం నేర్చుకున్నారు?

  • బైబిల్ని ఎలా చదివితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది?

  • బైబిల్ని చదవడానికి, అధ్యయనం చేయడానికి మీకు ఏ సమయమైతే బాగుంటుంది?

  • స్టడీకి సిద్ధపడడం ఎందుకు మంచిది?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయం చేసే కొన్ని సలహాలు చూడండి.

“బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా చదవాలి?” (కావలికోట నం. 1 2017)

ఎన్నో ఏళ్లుగా బైబిలు చదువుతున్న వాళ్లు ఏ సలహాలు ఇస్తున్నారో చూడండి.

వ్యక్తిగత అధ్యయనాన్ని చక్కగా చేయండి (2:06)