కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

15వ పాఠం

యేసు ఎవరు?

యేసు ఎవరు?

ప్రపంచంలో దాదాపు ప్రతీ ఒక్కరు యేసు గురించి విని ఉంటారు. చాలామందికి ఆయన పేరు తెలుసు కానీ ఆయన గురించి అంతగా తెలీదు. నిజానికి, యేసు ఎవరు అనే దాని గురించి చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. మరి బైబిలు ఏం చెప్తుంది?

1. యేసు ఎవరు?

యేసు పరలోకంలో ఉండే ఒక శక్తివంతమైన దేవదూత. మిగతా సృష్టిలో దేన్నీ చేయకముందే యెహోవా దేవుడు యేసును సృష్టించాడు. అందుకే, బైబిలు ఆయన్ని “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు” అని అంటుంది. (కొలొస్సయులు 1:15) యెహోవా స్వయంగా సృష్టించింది యేసును మాత్రమే, అందుకే బైబిలు ఆయన్ని దేవుని ‘ఒక్కగానొక్క కుమారుడు’ అని పిలుస్తుంది. (యోహాను 3:16) తన తండ్రైన యెహోవా మిగతా సృష్టిని చేస్తున్నప్పుడు, యేసు ఆయనతో కలిసి చాలా దగ్గరగా పని చేశాడు. (సామెతలు 8:30 చదవండి.) ఇప్పటికీ యేసుకు యెహోవాతో చాలా దగ్గరి సంబంధం ఉంది. యేసు యెహోవా దేవుని తరఫున మాట్లాడుతూ ఆయన సందేశాల్ని, నిర్దేశాల్ని దేవదూతలకు, మనుషులకు నమ్మకంగా అందజేస్తాడు. అందుకే యేసుకు “వాక్యం” అనే పేరు ఉంది.—యోహాను 1:14.

2. యేసు భూమ్మీదికి ఎందుకు వచ్చాడు?

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, యెహోవా తన పవిత్రశక్తిని ఉపయోగించి, అద్భుతరీతిలో యేసు ప్రాణాన్ని పరలోకం నుండి మరియ అనే కన్య గర్భంలోకి మార్చాడు. అలా యేసు ఈ భూమ్మీద ఒక మనిషిగా పుట్టాడు. (లూకా 1:34, 35 చదవండి.) మెస్సీయ లేదా క్రీస్తు గురించిన ప్రవచనాల్ని నెరవేర్చడానికి, మనుషుల్ని రక్షించడానికి యేసు ఈ భూమ్మీదికి వచ్చాడు. a మెస్సీయ గురించి బైబిలు ఏ ప్రవచనాలైతే చెప్పిందో అవన్నీ యేసులో నెరవేరాయి. యేసే ‘క్రీస్తు, జీవంగల దేవుని కుమారుడు’ అని గుర్తుపట్టడానికి ఆ ప్రవచనాలు సహాయం చేశాయి.—మత్తయి 16:16.

3. యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

యేసు మనిషిగా చనిపోయాక, దేవుడు ఆయన్ని ఒక దేవదూతగా బ్రతికించాడు. తర్వాత ఆయన పరలోకానికి తిరిగి వెళ్లాడు. అక్కడ “దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు.” (ఫిలిప్పీయులు 2:9) ఇప్పుడు యేసుకు చాలా అధికారం ఉంది. చెప్పాలంటే, యెహోవా తర్వాతి స్థానం ఆయనదే.

ఎక్కువ తెలుసుకోండి

యేసు నిజంగా ఎవరో, ఆయన గురించి నేర్చుకోవడం ఎందుకంత ప్రాముఖ్యమో వివరంగా తెలుసుకోండి.

4. యేసు సర్వశక్తిగల దేవుడు కాదు

యేసు పరలోకంలో ఉండే ఒక శక్తివంతమైన దేవదూత అయినప్పటికీ ఆయన తన దేవుడు, తండ్రి అయిన యెహోవా అధికారం కింద ఉంటాడని బైబిలు చెప్తుంది. సర్వశక్తిగల దేవునికి, యేసుకు ఉన్న సంబంధం గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

యెహోవాకు, యేసుకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఈ లేఖనాలు సహాయం చేస్తాయి. ప్రతీ లేఖనాన్ని చదివి, తర్వాత ఉన్న ప్రశ్నల్ని చర్చించండి.

లూకా 1:30-32 చదవండి.

  • యేసుకు, “సర్వోన్నత” దేవుడైన యెహోవాకు ఉన్న సంబంధాన్ని దేవదూత ఎలా వర్ణించాడు?

మత్తయి 3:16, 17 చదవండి.

  • యేసు బాప్తిస్మమప్పుడు ఆకాశం నుండి వచ్చిన ఒక స్వరం ఏమని చెప్పింది?

  • ఆ స్వరం ఎవరిదని మీరు అనుకుంటున్నారు?

యోహాను 14:28 చదవండి.

  • ఎవరు వయసులో పెద్ద, ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది? తండ్రికా, కుమారునికా?

  • యేసు యెహోవాను తండ్రి అని పిలిచాడు, దాన్నిబట్టి మనకు ఏం అర్థమౌతుంది?

యోహాను 12:49 చదవండి.

  • తాను తన తండ్రితో సమానం అని యేసు అనుకున్నాడా? మీకేం అనిపిస్తుంది?

5. యేసే మెస్సీయ అని రుజువైంది

మెస్సీయ లేదా క్రీస్తు అంటే, మనుషుల్ని రక్షించడానికి దేవుడు ఎంచుకున్న వ్యక్తి. ప్రజలు మెస్సీయను గుర్తుపట్టడానికి బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. యేసు భూమ్మీదికి వచ్చినప్పుడు నెరవేర్చిన ప్రవచనాల్లో కొన్నింటి గురించి తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

కింది బైబిలు ప్రవచనాలు చదివి, తర్వాత ఉన్న ప్రశ్నల్ని చర్చించండి:

మీకా 5:2 చదివి, మెస్సీయ ఎక్కడ పుడతాడని బైబిలు చెప్పిందో తెలుసుకోండి. b

కీర్తన 34:20; జెకర్యా 12:10 చదివి, మెస్సీయ మరణం గురించి బైబిలు ముందే ఏం చెప్పిందో తెలుసుకోండి.

  • ఆ ప్రవచనాలు నెరవేరాయా?—యోహాను 19:33-37.

  • యేసు ఒక పథకం వేసుకుని, తన జీవితంలోని సంఘటనల్ని ఆ ప్రవచనాలకు అనుగుణంగా మలుచుకున్నాడా?

  • వీటన్నిటిని బట్టి యేసు ఎవరని చెప్పవచ్చు?

6. యేసు గురించి తెలుసుకోవడం వల్ల మనం ప్రయోజనం పొందుతాం

యేసు గురించి, ఆయన పాత్ర గురించి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమని బైబిలు చెప్తుంది. యోహాను 14:6; 17:3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యేసు గురించి ఎందుకు తెలుసుకోవాలి?

మనం దేవునికి స్నేహితులు అవ్వడానికి యేసు మార్గం తెరిచాడు. ఆయన యెహోవా గురించి సత్యం బోధించాడు, మనం ఆయన ద్వారా శాశ్వత జీవం పొందవచ్చు

కొంతమంది ఇలా అంటారు: “యెహోవాసాక్షులు యేసును నమ్మరు.”

  • వాళ్లకు మీరేం చెప్తారు?

ఒక్కమాటలో

యేసు ఒక శక్తివంతమైన దేవదూత, దేవుని కుమారుడు, మెస్సీయ.

మీరేం నేర్చుకున్నారు?

  • బైబిలు యేసును, “మొత్తం సృష్టిలో మొట్టమొదట పుట్టినవాడు” అని ఎందుకు అంటుంది?

  • భూమ్మీదికి రాకముందు యేసు ఏం చేశాడు?

  • యేసే మెస్సీయ అని మనకెలా తెలుసు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

యేసు ఎలా దేవుని కుమారుడు అవుతాడో తెలుసుకోండి.

“యేసును దేవుని కుమారుడు అని బైబిలు ఎందుకు పిలుస్తుంది?” (jw.org ఆర్టికల్‌)

త్రిత్వం అసలు బైబిలు బోధ కాదు అని ఎందుకు చెప్పవచ్చు?

“యేసు దేవుడా?” (కావలికోట ఆర్టికల్‌)

యేసు గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకున్నాక ఒకామె జీవితం ఎలా మారిందో చదవండి.

“ఒక యూదురాలు తన నమ్మకాల్ని ఎందుకు మార్చుకోవాలనుకుందో వివరిస్తుంది” (తేజరిల్లు! ఆర్టికల్‌)

a అసలు మనుషుల్ని ఎందుకు రక్షించాల్సి వచ్చిందో, యేసు మనల్ని ఎలా రక్షిస్తాడో 2627 పాఠాల్లో చూస్తాం.

b మెస్సీయ భూమ్మీద ఖచ్చితంగా ఏ సంవత్సరంలో కనిపిస్తాడని ప్రవచనం చెప్పిందో తెలుసుకోవడానికి, అదనపు సమాచారంలో 2వ పాయింట్‌ చూడండి.