కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

44వ పాఠం

దేవుడు అన్ని పండుగల్నీ ఇష్టపడతాడా?

దేవుడు అన్ని పండుగల్నీ ఇష్టపడతాడా?

మనం సంతోషంగా జీవించాలని, సరదాగా గడపాలని యెహోవా కోరుకుంటున్నాడు. ప్రజలు పండుగలప్పుడు, కొన్ని ప్రత్యేకమైన రోజులప్పుడు బంధువులతో-స్నేహితులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. కానీ అన్ని పండుగలూ దేవుణ్ణి సంతోషపెడతాయా? ఈ విషయంలో మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

1. చాలా పండుగల్ని, వేడుకల్ని యెహోవా ఎందుకు ఇష్టపడడు?

చాలా పండుగలు, వేడుకలు బైబిలుకు వ్యతిరేకమైన నమ్మకాల నుండి పుట్టుకొచ్చాయని మీకు తెలుసా? కొన్ని పండుగలకు అబద్ధమత ఆచారాలతో సంబంధం ఉంటుంది. ఇంకొన్నిటికి మంత్రతంత్రాలతో, ఆత్మకు చావు లేదనే ఆలోచనతో సంబంధం ఉంటుంది. మరికొన్ని పండుగలు మూఢనమ్మకాల మీద, అదృష్టం కలిసొస్తుంది అనే నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. (యెషయా 65:11) అందుకే, యెహోవా తన ఆరాధకుల్ని ఇలా హెచ్చరిస్తున్నాడు: “వేరుగా ఉండండి, అపవిత్రమైనదాన్ని ముట్టకండి.”2 కొరింథీయులు 6:17. a

2. మనుషులకు ఎక్కువ ఘనత ఇచ్చే పండుగల్ని చూసి యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

ప్రజలు పరిపాలకుల్ని, సైనికుల్ని గౌరవించడానికి కొన్ని పండుగలు చేస్తారు. ఇంకొన్ని పండుగలు స్వాతంత్ర్యం వచ్చిన రోజును, జెండా లాంటి జాతీయ చిహ్నాల్ని గౌరవించడానికి చేస్తారు. (1 యోహాను 5:21) మరికొన్ని పండుగలు రాజకీయ లేదా సామాజిక సంస్థల్ని గౌరవించడానికి చేస్తారు. అయితే, ‘మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దని’ యెహోవా హెచ్చరిస్తున్నాడు. (యిర్మీయా 17:5 చదవండి.) మనుషులకు లేదా సంస్థలకు ఎక్కువ ఘనత ఇచ్చే పండుగల్ని చూసి యెహోవాకు ఎలా అనిపిస్తుంది? మరిముఖ్యంగా, ఆ మనుషులు లేదా సంస్థలు దేవుని ఉద్దేశానికి వ్యతిరేకమైన ఆలోచనల్ని ప్రోత్సహించి ఉంటే ఆయనకు ఎలా అనిపిస్తుంది?

3. ఎలాంటి ప్రవర్తనను బట్టి కొన్ని పండుగల్ని, వేడుకల్ని యెహోవా ఇష్టపడడు?

‘అతిగా తాగడాన్ని, విచ్చలవిడి విందుల్ని, తాగుబోతుల విందుల్ని’ బైబిలు ఖండిస్తుంది. (1 పేతురు 4:3) కొన్ని పండుగల్లో-వేడుకల్లో ప్రజలు అదుపు తప్పి ప్రవర్తిస్తారు, అసభ్యకరమైన పనులు చేస్తారు. యెహోవాకు స్నేహితులుగా ఉండాలంటే, మనం అలాంటి అపవిత్రమైన ప్రవర్తనకు చాలా దూరంగా ఉండాలి.

ఎక్కువ తెలుసుకోండి

పండుగలు, వేడుకల విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చో తెలుసుకోండి.

4. యెహోవాకు ఇష్టంలేని పండుగలకు దూరంగా ఉండండి

ఎఫెసీయులు 5:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఏదైనా పండుగను చేసుకోవచ్చో లేదో నిర్ణయించుకోవడానికి మనం ఏం చేయాలి?

  • మీ ప్రాంతంలో ప్రజలు సాధారణంగా ఏ పండుగలు చేస్తుంటారు?

  • మీకేం అనిపిస్తుంది, ఆ పండుగల్ని యెహోవా ఇష్టపడతాడా?

ఉదాహరణకు, పుట్టినరోజు వేడుకల గురించి దేవునికి ఎలా అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? యెహోవా ఆరాధకులు పుట్టినరోజును జరుపుకున్నట్టు బైబిల్లో ఎక్కడా లేదు. అయితే, యెహోవాను ఆరాధించని ఇద్దరు వ్యక్తులు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్టు బైబిల్లో ఉంది. ఆదికాండం 40:20-22; మత్తయి 14:6-10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఈ రెండు పుట్టినరోజు వేడుకల్లోనూ ఏం జరిగింది?

  • ఈ వచనాల ప్రకారం, పుట్టినరోజు వేడుకల గురించి యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

అయినా మీరు ఇలా ఆలోచించవచ్చు: ‘పుట్టినరోజు వేడుకల్లో లేదా బైబిలుకు వ్యతిరేకమైన ఇంకేదైనా వేడుకల్లో నేను పాల్గొంటే, యెహోవా దాన్ని అంత పట్టించుకుంటాడా?’ నిర్గమకాండం 32:1-8 చదవండి. అలాగే వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

  • యెహోవాకు ఏది ఇష్టమో మనం ఎందుకు జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి?

  • యెహోవాకు ఏది ఇష్టమో మనం ఎలా తెలుసుకోవచ్చు?

దేవునికి ఇష్టంలేని పండుగల్ని లేదా వేడుకల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?

  • అవి బైబిలుకు వ్యతిరేకమైన నమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయా? అవి ఎక్కడ నుండి పుట్టుకొచ్చాయో వివరాలు తెలుసుకోండి.

  • అవి మనుషులకు, సంస్థలకు, లేదా జాతీయ చిహ్నాలకు ఎక్కువ ఘనత ఇస్తున్నాయా? మనం అందరికన్నా, అన్నిటికన్నా ఎక్కువగా యెహోవానే ఘనపరుస్తాం. లోకంలోని సమస్యల్ని ఆయన మాత్రమే పరిష్కరిస్తాడని నమ్ముతాం.

  • వాటిలో చేసే ఆచారాలు, ప్రజల ప్రవర్తన బైబిలు నియమాలకు-సూత్రాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి.

5. మీ నమ్మకాల్ని గౌరవించేలా ఇతరులకు సహాయం చేయండి

యెహోవాకు ఇష్టంలేని పండుగల్లో పాల్గొనమని ఇతరులు ఒత్తిడి చేసినప్పుడు, వాళ్లను కాదనడం కష్టంగానే ఉండవచ్చు. వాళ్లను నొప్పించకుండా, ఓపిగ్గా మీ నమ్మకాలు చెప్పండి. ఒక సహోదరి దాన్నెలా చేసిందో తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

మత్తయి 7:12 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఈ వచనం ప్రకారం, “ఫలానా పండుగ మీరు చేసుకోకూడదు” అని యెహోవాసాక్షికాని మీ కుటుంబ సభ్యులకు చెప్పవచ్చా?

  • మీరు వాళ్లతో కలిసి పండుగలు చేసుకోకపోయినా మీకు వాళ్లంటే ఇష్టమని, వాళ్లను ప్రేమిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

6. మనం సంతోషంగా ఉండాలన్నది యెహోవా కోరిక

మనం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి సంతోషంగా సమయం గడపాలని యెహోవా కోరుకుంటున్నాడు. ప్రసంగి 8:15 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మనం సంతోషంగా ఉండాలన్నది యెహోవా కోరిక అని ఎలా చెప్పవచ్చు?

తన ప్రజలు ఇతరులతో కలిసి సరదాగా, సంతోషంగా సమయం గడపాలని యెహోవా కోరుకుంటున్నాడు. అది మన అంతర్జాతీయ సమావేశాల్లో ఎలా స్పష్టంగా కనబడుతుందో తెలుసుకోవడానికి, వీడియో చూడండి.

గలతీయులు 6:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ‘అందరికీ మంచి చేయడం’ కోసం మనం ఇతరులతో కలిసి పండుగలు చేసుకోవాలా?

  • పండుగ రోజున తప్పనిసరిగా బహుమతులు ఇవ్వాలన్నట్టు ఇస్తే బాగుంటుందా, లేక ఫలానా రోజు అని కాకుండా మీకు నచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తే బాగుంటుందా?

  • చాలామంది యెహోవాసాక్షులు తమ పిల్లల్ని సంతోషపెట్టడానికి అప్పుడప్పుడు ఏదోకటి ప్లాన్‌ చేస్తుంటారు, బహుమతులు కూడా ఇస్తుంటారు. మీకు పిల్లలు ఉంటే, వాళ్లను సంతోషపెట్టేలా మీరేం చేయవచ్చు?

కొంతమంది ఇలా అంటారు: “పండుగలప్పుడే కదా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా ఉండేది. అవి ఎక్కడ నుండి పుట్టుకొస్తే మనకేంటి?”

  • మీరేమంటారు?

ఒక్కమాటలో

మనం కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా సమయం గడపాలని యెహోవా కోరుకుంటున్నాడు. అయితే, మనం తనకు ఇష్టంలేని పండుగలు చేసుకోకూడదని కూడా ఆయన కోరుకుంటున్నాడు.

మీరేం నేర్చుకున్నారు?

  • యెహోవాకు ఇష్టంలేని పండుగల్ని లేదా వేడుకల్ని ఎలా గుర్తుపట్టవచ్చు?

  • పండుగల విషయంలో మన నిర్ణయాల్ని అర్థం చేసుకునేలా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎలా సహాయం చేయవచ్చు?

  • మనం సంతోషంగా, సరదాగా ఉండాలన్నది యెహోవా కోరిక అని మనకెలా తెలుసు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

క్రైస్తవులు చేసుకోని కొన్ని పండుగల గురించి తెలుసుకోండి.

“యెహోవాసాక్షులు కొన్ని పండుగలు ఎందుకు చేసుకోరు?” (jw.org ఆర్టికల్‌)

పుట్టినరోజు వేడుకల్ని దేవుడు ఇష్టపడడని మేము ఎందుకు నమ్ముతామో నాలుగు కారణాలు తెలుసుకోండి.

“యెహోవాసాక్షులు పుట్టినరోజు ఎందుకు చేసుకోరు?” (jw.org ఆర్టికల్‌)

పండుగలు వచ్చినప్పుడు, యెహోవాను ప్రేమించే పిల్లలు ఆయన్ని ఎలా సంతోషపెట్టవచ్చో చూడండి.

మీరు యెహోవాకు చాలా స్పెషల్‌ (11:35)

లక్షలమంది క్రైస్తవులు క్రిస్మస్‌ చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్లు తమ నిర్ణయం గురించి ఏమనుకుంటున్నారు?

“వాళ్లకు ఇంకా మంచిది దొరికింది” (కావలికోట ఆర్టికల్‌)

a పండుగలకు సంబంధించిన కొన్ని సందర్భాల్లో మీరు ఏం చేయవచ్చో తెలుసుకోవడానికి, అదనపు సమాచారంలో 5వ పాయింట్‌ చూడండి.