కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

38వ పాఠం

జీవం అనే బహుమతిని విలువైనదిగా చూడండి

జీవం అనే బహుమతిని విలువైనదిగా చూడండి

అందమైన మన జీవితంలో ఎన్నో తీపి గుర్తులు ఉంటాయి. అప్పుడప్పుడు కష్టాలు వచ్చినా, జీవితంలో మధురమైన క్షణాలు కూడా ఉంటాయి. యెహోవా మనకు జీవం అనే బహుమతిని ఇచ్చాడు కాబట్టే, ఈ జీవితాన్ని ఆనందించగలుగుతున్నాం. జీవం మనకు ఎంతో విలువైనది అని ఎలా చూపించవచ్చు? జీవాన్ని విలువైనదిగా చూడడానికి గల ముఖ్య కారణం ఏంటి?

1. మనం జీవాన్ని ఎందుకు విలువైనదిగా చూడాలి?

మనం జీవాన్ని ఎందుకు విలువైనదిగా చూడాలంటే, అది మన ప్రేమగల తండ్రైన యెహోవా ఇచ్చిన బహుమతి. యెహోవా దగ్గర “జీవపు ఊట” ఉంది, ఆయనే ప్రాణులన్నిటినీ సృష్టించాడు. (కీర్తన 36:9) “ఆయనే అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు.” (అపొస్తలుల కార్యాలు 17:25, 28) మనం ప్రాణాలతో ఉండడానికి, అలాగే ఆనందంగా జీవించడానికి కావాల్సినవన్నీ యెహోవా ఇస్తున్నాడు.—అపొస్తలుల కార్యాలు 14:17 చదవండి.

2. యెహోవా ఇచ్చిన జీవం మనకు ఎంతో విలువైనదని ఎలా చూపించవచ్చు?

మీరు మీ తల్లి కడుపులో పడిన క్షణం నుండే యెహోవా మిమ్మల్ని పట్టించుకోవడం మొదలుపెట్టాడు. దేవుని సేవకుడైన దావీదు బైబిల్లో ఇలా రాశాడు: “నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్లు నన్ను చూశాయి.” (కీర్తన 139:16) యెహోవా మీ జీవాన్ని చాలా విలువైనదిగా చూస్తాడు. (మత్తయి 10:29-31 చదవండి.) ఎవరైనా కావాలని ఎదుటివాళ్లను చంపినా, లేదా ఆత్మహత్య చేసుకున్నా a యెహోవా చాలా బాధపడతాడు. (నిర్గమకాండం 20:13) అంతేకాదు మనం అనవసరంగా మన ప్రాణాల్ని ప్రమాదంలో పడేసుకున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా వేరేవాళ్ల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసినా యెహోవా బాధపడతాడు. మనం మన జీవాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, ఎదుటివాళ్ల జీవాన్ని గౌరవించినప్పుడు జీవం అనే అద్భుతమైన బహుమతి మనకు ఎంతో విలువైనదని చూపిస్తాం.

ఎక్కువ తెలుసుకోండి

జీవం అనే బహుమతి మీకు ఎంతో విలువైనదని ఏయే విధాలుగా చూపించవచ్చో తెలుసుకోండి.

3. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి

యెహోవాకు సమర్పించుకున్న క్రైస్తవులు తమ పూర్తి శక్తి-సామర్థ్యాల్ని ఉపయోగించి ఆయన సేవ చేస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే, వాళ్లు ‘తమ శరీరాల్ని దేవునికి బలిగా అప్పగిస్తారు.’ కాబట్టి వాళ్లు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. రోమీయులు 12:1, 2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • మీ ఆరోగ్యాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి?

  • మీరు ఏయే విధాలుగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు?

4. జాగ్రత్తలు పాటించండి

దెబ్బలు తగిలే లేదా ప్రాణాల్ని ప్రమాదంలో పడేసే అలవాట్లకు, పనులకు దూరంగా ఉండమని బైబిలు చెప్తుంది. మీరు ఏయే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చో తెలుసుకోవడానికి వీడియో చూడండి.

సామెతలు 22:3 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి: మీరు అలాగే ఇతరులు ఎలా సురక్షితంగా ఉండవచ్చు . . .

  • ఇంట్లో ఉన్నప్పుడు?

  • పని స్థలంలో ఉన్నప్పుడు?

  • ఆటలు ఆడుతున్నప్పుడు?

  • వాహనం నడుపుతున్నప్పుడు లేదా వేరేవాళ్ల వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు?

5. తల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని విలువైనదిగా చూడండి

తల్లి కడుపులో ఉన్న బిడ్డ మీద యెహోవాకు ఎంత శ్రద్ధ ఉందో, ఆ బిడ్డ ఎదుగుదలను ఆయన ఎంత ఆసక్తిగా గమనిస్తాడో దావీదు కావ్యరూపంలో వర్ణించాడు. కీర్తన 139:13-17 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • యెహోవా దృష్టిలో మన జీవితం ఎప్పుడు మొదలౌతుంది, తల్లి కడుపులో పిండంగా ఏర్పడినప్పుడా లేక పుట్టినప్పుడా?

ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఇచ్చిన నియమాలు తల్లి ప్రాణాన్ని, ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని కాపాడాయి. నిర్గమకాండం 21:22, 23 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • కడుపులో ఉన్న బిడ్డ చావుకు అనుకోకుండా కారణమైన వ్యక్తిని యెహోవా ఎలా చూశాడు?

  • మరి ఎవరైనా కావాలనే అలా చేస్తే, యెహోవాకు ఎలా అనిపిస్తుంది? b

  • దేవుని అభిప్రాయం తెలుసుకున్నాక మీకు ఎలా అనిపిస్తుంది?

వీడియో చూడండి.

జీవాన్ని విలువైనదిగా చూసే ఒక స్త్రీకి కూడా, కొన్ని సందర్భాల్లో గర్భస్రావం తప్ప ఇంకో దారి లేదన్నట్టు అనిపించవచ్చు. యెషయా 41:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • గర్భస్రావం చేయించుకోమనే ఒత్తిడి ఎదురైనప్పుడు, ఒక స్త్రీ ఎవరి సహాయం కోసం చూడాలి? ఎందుకు?

కొంతమంది ఇలా అంటారు: “కొన్ని పరిస్థితుల్లో ఒక స్త్రీ గర్భస్రావం చేయించుకోక తప్పదు.”

  • యెహోవా తల్లి ప్రాణాన్ని, ఆమె కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని ఇద్దరి ప్రాణాల్నీ విలువైనదిగా చూస్తాడని మీరెందుకు నమ్ముతున్నారు?

ఒక్కమాటలో

జీవం యెహోవా ఇచ్చిన బహుమతి. కాబట్టి మనం మన జీవాన్ని అలాగే ఇతరుల జీవాన్ని ప్రేమించాలని, గౌరవించాలని, కాపాడాలని బైబిలు చెప్తుంది.

మీరేం నేర్చుకున్నారు?

  • మనిషి ప్రాణం యెహోవా దృష్టిలో ఎందుకు విలువైనది?

  • ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నా లేదా కావాలని వేరే వ్యక్తిని చంపినా యెహోవాకు ఎలా అనిపిస్తుంది?

  • మీరు జీవం అనే బహుమతిని విలువైనదిగా చూస్తున్నారా? ఎందుకు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

జీవం అనే బహుమతిని ఇచ్చినందుకు యెహోవాకు ఎలా కృతజ్ఞతలు చెప్పవచ్చో ఈ పాటలో చూడండి.

జీవం ఒక అద్భుతం (2:41)

గతంలో గర్భస్రావం చేయించుకున్న స్త్రీని దేవుడు క్షమిస్తాడా?

“గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?” (jw.org ఆర్టికల్‌)

జీవం విషయంలో దేవుని అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నవాళ్లు ఎలాంటి సరదాలకు దూరంగా ఉంటారో తెలుసుకోండి.

“‘ప్రమాదకరమైన ఆటలు’—మీరు ఆడాలా?” (తేజరిల్లు! ఆర్టికల్‌)

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుండి బయటపడడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోండి.

“నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?” (jw.org ఆర్టికల్‌)

a విరిగిన హృదయం గలవాళ్లను యెహోవా పట్టించుకుంటాడు. (కీర్తన 34:18) కొంతమంది ఎంతగా కృంగిపోతారంటే, ఇక చనిపోవడం తప్ప వేరే దారి లేదని అనుకుంటారు. అలాంటి వాళ్ల పరిస్థితిని, భావాల్ని యెహోవా అర్థం చేసుకుంటాడు. ఆయన వాళ్లకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎలా సహాయం చేస్తాడో తెలుసుకోవడానికి, ఈ పాఠంలో “ఇవి కూడా చూడండి” కింద ఉన్న “నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?” అనే ఆర్టికల్‌ చదవండి.

b గతంలో గర్భస్రావం చేయించుకున్న వాళ్లు తప్పు చేశామని అతిగా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్లు యెహోవా క్షమాపణ పొందవచ్చు. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడానికి, ఈ పాఠంలో “ఇవి కూడా చూడండి” కింద ఉన్న “గర్భస్రావం గురించి బైబిలు ఏం చెప్తుంది?” అనే ఆర్టికల్‌ చదవండి.